గోల

కొత్త (ప్రతి) నాయకుడు


Image
జగన్ ను దిల్ కుష్ లో పరామర్శించేందుకు విజయమ్మ బయల్దేరారు..ఇప్పుడే చేరుకొని కొడుకు చెంతకు చేరారు కూడా..
కానీ ఎవరి ఇళ్ళకు వాళ్ళను చేర్చే ఏకైక సాధనమైన ఆర్టీసి బస్సులను రద్దు చేసి రోడ్లన్నీ దిగ్బంధనం చేసిన రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం సామాన్య జనాలను ఇంత ఇబ్బందుల పాల్జేస్తూ అనవసరపు హైప్ సృష్టిస్తూ గత రెండు గంటలుగా భయకంపిత వాతావరణాన్ని మీడియా ద్వారా కల్పిస్తూ  వేలాది మంది పోలీసు బలగాలతో రాష్ట్రమంతా కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించి ‘కొత్త నాయకున్ని’ (తనకు ప్రతినాయకున్ని) కూడా సృష్టించుకుంది…
ఆర్థిక పరమైన నేరానికి పాల్పడ్డారని ఆరోపించబడిన వ్యక్తికి ఇంత పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తూ అనవసరంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతతను చెదరగొడ్తోంది..

దీనిద్వారా తన సొంత చానల్ పత్రికకే పరిమితమైన వ్యక్తి నేడు దేశ వ్యాప్తంగా వున్న మీడియాలో పాపులరవ్వడం ద్వారా తమ కన్ను తామే పొడుచుకున్నట్టైంది. దీని ద్వారా లబ్ధి పొందేది జగనే. ఈ దేశంలో అవినీతి ఆర్థిక నేరాల పట్ల సామాన్య జనం పట్టించుకున్న దాఖలాలే లేవు. అసలు ఏది నేరమో దేనిని ఏ స్థాయిలో శిక్షించాలో కూడా సరిగా స్పందించలేని న్యాయవ్యవస్థకూడా మనదే. అతి పెద్ద నేరాలు చేసిన వారిని చిన్న చిన్న మందలింపులతో వదిలేసిన దాఖలాలు చాలా. ఇలా ఇప్పటికే ప్రజలలో దీనిపట్ల ఎన్నికల ప్రచారానికి జగన్ వెళ్ళకుండా అడ్డుకోవడం ద్వారా తాము లబ్ధి పొందాలనుకోవడం అలాగే తమ నాయకుని పరిపాలన అంతా అవినీతిమయంగా పేర్కొనడం ద్వారా అది తమ నెత్తిపై సి.బి.ఐ. భస్మాసుర హస్తంగా మారిందన్నది త్వరలో తెలుసుకోబోతోంది…

ఆంధ్రజ్యోతివారికి శ్రీలక్ష్మీతో లవ్ ఫైయిల్యూరా???


గత ఆరునెలలుగా చూస్తున్నా…ఆంద్రజ్యోతి పేపర్లో ప్రతిరోజూ ప్రధాన వార్తగా ముందుపేజీలో లేకపోతే ఎక్కడో ఓ చోట ఆమె ఫోటోతో కూడిన వార్త రాయకుండా లేరు. ఆమె ఒక్కతే ఈ కుంభకోణమంతటికీ కారణంలా ఆమెనే ఎక్స్పోజ్ చేస్తూ వస్తుంటే ఈ సందేహమొచ్చింది.

రాజకీయ నాయకుల వత్తిడులకు లోను కాని అధికారులెవరైనా వున్నారా? పోనీ వత్తిడి చేయని రాజకీయనాయకులున్నారా?? తెలుగుదేశం పాలనా కాలంలో జరిగిన ఏలేరు కుంభకోణంలో పాల్గొన్న అధికారులు లేరా?? ఎన్నో అవకతవకలను కప్పిపుచ్చేస్తూ అధికారులు రాజకీయ నాయకులతో అంటకాగడం ఈ దేశ ప్రజల దౌర్భాగ్యం. ఒక్క శ్రీలక్ష్మితోనే మొదలు కాలేదు..తుదీ కాలేదు. మరి ఆంధ్రజ్యోతికి ఎందుకీ కక్ష ఆమెపై.. దేవాలయానికి వెళ్ళినా వెంటపడి అక్కడా వ్యంగ్యంగా రాతలు. జైల్లో భర్త కలిసినా వార్త. ఆమె తోటి ఖైదీలతో మాటాడినా వార్త. అసలు ఈ పత్రిక వార్తలు మరచి కథనాలు రాస్తూంది అన్నది నిజం కాదా??

ఒక మహిళ పట్ల ఈ రకమైన ప్రవర్తన కలిగి వుండటం ఏ జర్నలిజం. ఆమె తప్పు చేసినట్టు నిరూపితమైతే శిక్ష అనుభవిస్తుంది. ప్రస్తుతం జైల్లోనే రిమాండ్ లో వున్నారు కదా?? ఇంక మీ కథనాలతో ఆమె వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేయడం సమంజసమా??

 

400 రూ.లకు సం.ఐతే లక్షలకోట్లు తిన్నవారికెన్నాళ్ళు?


ఈ రోజు వార్త దినపత్రికలో ఈ వార్త చదివి ఆశ్చర్యమేసింది..

నాలుగువందల రూయల జేబు దొంగతనం చేసిన వ్యక్తికి ఓ ఏడాది  జైలు శిక్ వంద రూపా జరిమానాను వేసారు  విశాఖపట్టణంలో గౌరవనీయ స్థానిక మేజిస్ట్రేటు వారు.

మరి ఇన్ని లక్షల కోట్ల  కుంభకోణాలు చేసిన వారికి ఎన్నేళ్ళు శిక్ష ఎంత జరిమానా వేయాలి. ఏమిటో కడుపు జరక్కో, చిల్లర పనులకో ఆశ పడి జేబు కత్తిరిస్తే పాపం ఓ ఏడాది జైలు.

ఈ ఘరానా దొంగలకు  నిజంగా శిక్షపడుతుందా?? అరెస్టైనా జైలులోనూ ప్రత్యేక సౌకర్యాలు, అనారోగ్యం పేరుతో ఆసుపత్రులలో వైద్యాలు.. ఇదీ మన నేర శిక్షాస్మృతి…

ఉన్నోడికి మేసినంత.. లేనోడికి కడుపుమంట…

కుక్క కరిస్తే చెప్పుతో కొట్టుకోవడమే మిగిలిందా?


ఈ మధ్య రాష్ట్రంలో కుక్క కాటు మరణాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి అని గౌరవనీయులైన వైద్యారోగ్య శాఖ కార్యదర్శి గారిని విలేకరులు అడిగితే యిందులో రాష్ట్ర ప్రభుత్వం కుట్రేమీ లేదని, జనం సరైన సమయానికి వేక్సిన్ వేయించుకోక పోవడంతో మరణాలు సంభవిస్తున్నాయని సెలవిచ్చారు.  కానీ వేక్సిన్ వేయించుకోవడానికి వెలితే సర్కారు దవాఖానలో వేక్సిన్ వుండదన్నది అందరికీ తెలిసిన విషయమే. పోనీ వైద్యారోగ్య మంత్రిగారినడుగుదామంటే ఆయన ఉప ఎన్నికల ఫలితాలతో బొప్పికట్టి యింకా పూర్తిగా కోలుకోలేదు. సి.ఎం.గారెమో గుండు గీయించుకొని హాయిగా ఏసీ కింద తలపెట్టి పడుకున్నారు. మరింక మన మొర వినేది సదరు గ్రామ సింహాలే కాబట్టి వాటి సంఘాలతో సమావేశమై వేడుకోవడమే తప్ప మరో గత్యంతరం లేకపోయే..

ఖమ్మంలో గౌరవనీయ మంత్రి వర్యుల కళ్ళముందే అయ్యా బతికించండయ్యా అని చుట్టుకుంటూ చనిపోయిన బాలుని హృదయ విదారక దృశ్యం టీవీలలో చూసిన మనం చలించిపోవడమే తప్ప సర్కారుకు  చీమ కుట్టినట్లైనా లేదు. కావున మనకు చెప్పుతో కొట్టుకోవడమే మిగిలిన వైద్యం…

నిజం మాటాడినోడిని పిచ్చివాడిగా జమచేసేస్తారా?


కాకా వెంకటస్వామి తన కేకతో కలవరం పుట్టిస్తే ఆయనకు మతిభ్రమించిందన్నవారు అసలు తమ మతి ఎక్కడుందో తమకు తెలుసా? సిగ్గులేనితనం, సంపాదనే ధ్యేయంగా, అధికారం కోసం పాకులాడడానికి ఎంతటి తార్పుడు పనికైనా వెనకాడని వాళ్ళు నిజాలు మాటాడే వారిని (అది ఎప్పుడైనా) వాళ్ళకు మతి భ్రమించిందనేయడం ఫాషనై పోయింది.. వెన్నెముక లేని ఈ ఊసర వెల్లులు ఇలాంటి వ్యాఖ్యలతో చంకనాకుతూ గడిపేయడానికి వెనకాడరని మనకు తెలియనిదా? ఇప్పుడింకేమి పీకుతారాయనకి?

ఇన్నాళ్ళు తెలంగాణా మేమే ఇస్తాం, తెస్తాం, చస్తామన్న వాళ్ళు ఇప్పుడు అధికారం నిలుపుకోవడం కోసం ప్రజారాజ్యంను కలుపుకు పోవడానికి బతిమాలడం నాలుగు కోట్లమంది ప్రజలను మోసం చేయడం కాదా? ఇంత హైరానా పెట్టడం దేనికి? లేని పోని ప్రకటనలతో ప్రజలను తీవ్ర క్షోభకు గురిచేయడం దేనికి? ఇస్తారో, ఇవ్వరో చెపితే వాళ్ళు ఏదో ఒకటి తేల్చుకుంటారు కదా? రోజుకో కొత్త ప్రకటనతో ప్రజల దృష్టిని దారి మళ్ళించే ప్రయత్నం చేస్తూ కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకోవడం కాకపోతే…

సల్మాన్ ఖాన్ అన్నదాంట్లో తప్పేముంది..ముంబయి దాడులపై సల్మాన్ ఖాన్ వ్యాఖ్యానిస్తూ ప్రముఖులున్న కేంద్రాలపై దాడులు జరగడం మూలంగానే దానికి అంత ప్రాముఖ్యమిచ్చారని అన్నదాంట్లో తప్పేముంది. సామాన్యులుపై జరిగిన దాడులపై గానీ, ప్రమాదాలను గానీ, అత్యాచారాలను గానీ, హత్యలను గానీ పాలక వర్గం సరిగా స్పందించి చర్యలు తీసుకున్న సందర్భాలు చాలా తక్కువ. అదికూడా రాజకీయపరమైన లబ్ధి చేకూర్చేది, ఓట్లను కూడబెట్టేదైతే తప్ప స్పందించేది అతి తక్కువ సార్లు మాత్రమే. ఈ విషయంలో ఆయనను తప్పుపట్టడం తప్పు. ఇంక పాకిస్తాన్ హస్తంపై వ్యాఖ్య దానిపై పాలక వర్గమే గట్టిగా నిలదీయలేకపోతోంది. చక్రవర్తి అమెరికా వారు అక్కడో మాట ఇక్కడికొచ్చాక ఇక్కడో మాట అన్నా ఖండించలేని దౌర్భాగ్యం మనది.

బాబ్బాబూ దయచేసి ఈ ధర్మ సందేహాన్ని తీర్చరూ..చదరంగం విజేత విశ్వనాథన్ ఆనంద్ భారతీయుడు కానప్పుడు శ్రీమతి సోనియా గాంధీజీని ఎలా ఒప్పుకోగలమో చెప్తారా?

Indian Party League – IPL


IPL పేరుతో 20 Twenty క్రికెట్ మ్యాచుల నిర్వాహకులు చేస్తున్నది భారీ వ్యభిచార వ్యాపారంగా ఈ రోజు TV9 లో ఒ కథనం ప్రచురితమైంది. లీగ్ మాచులాడుతున్న క్రమంలో నాలుగు లక్షల రూపాయలు పెట్టి టికెట్ కొన్నవారికి సెలబ్రిటీలతో ఆట పాట arrange చేస్తున్నారని, అలాగే మరికొంత ఎక్కువ చెల్లించిన వారికి సెమీస్ లోను, ఫైనల్స్ వరకు ఈ రకమైన విందు వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారని చూపించారు. అలాగే మన క్రికెట్ వీరులు కూడా అమ్మాయిలతో మందు కొడుతు, పార్టీలలో enjoy చేస్తున్నట్లుగా, దీనివలన ఎంతో మంది యువకులు, యువ క్రికెటర్లు వ్యక్తిగతంగా నాశనమవుతున్నారని, అక్కడ వ్యభిచారం కూడా జరుగుతున్నదని చూపించారు. యింత లాభసాటి వ్యాపారం కాబట్టే సినిమా తారలు, మద్యం వ్యాపారులు, రియలెస్టేట్ వారు, పత్రికాధిపతులు విరివిగా పెట్టుబడులు పెడుతూ వేలకోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. అందుకే లలిత్ మోడీ గారు సెలబ్రిటీలతో పబ్లిక్ గా చిందులేస్తూ వేలకోట్ల రూపాయల లాభాలార్జిస్తూ మాఫియా డాన్ లా ఫోజులిస్తున్నారు. మన బి.సి.సి.ఐ.వారికి వ్యాపారం తప్ప నైతికతను, సామాజిక బాధ్యతను పక్కన పెట్టేసారు. అందుకే ఇందులో వేలుపెట్టిన శశిథరూర్ ను దావూద్ గాంగ్ ద్వారా భయపెట్ట చూడడం. ధనమే ప్రథానంగా మారిన క్రికెట్ ను కొన్నేళ్ళ పాటు దేశంలో నిషేధించాలి. లేకపోతె చివరకు రక్తపాతానికి కూడా దారి తీయొచ్చు. యింత బహిరంగంగా వ్యాపారమయిపోయి, నైతికతను కోల్పోయిన క్రీడ మరోటి లేదేమో. గ్రామాలలో గ్రామ దేవతల పండగలకు, సంక్రాంతికి కోడి పందేలు, పొట్టేలు పందేలాడే వారిని చితకబాది అరెస్టులు చేసి డబ్బు లేత్తుకేల్లె మన రక్షక భటుల ప్రతాపం సామాన్యులపైనేనా? ఈ రక్త మాంసాల వ్యాపారంగా మారిన ఈ అనైతిక క్రీడ వీరి దృష్టికి రాకపోవడానికి కారణమేమిటో?

ఈ మాచులు చూస్తూ పిల్లలు తమ భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారు. పరీక్షల కాలంలో జరుగుతుండటం  మరింత దారుణ౦. ఫక్తు వ్యాపార వేత్తల పరిపాలనా కాలమిలానే వుంటుంది కామోసు.

So, this is not Indian Premier League. This is International Prostitutes League.

ఇంకా ఈ గోల నాలుగు రోజులా?


ఏ చానల్ చూసినా ఈ గోలే! పెళ్ళిగోల, సానియా – షోయబ్ ల పెళ్ళిగోల. యింత కవరింగ్ అవసరమా?

లెహంగా ఖరీదు ఇరవై లక్షలైతే ఏటి, ఇరవై రూపాయలైతే ఎవడిక్కావాలి. ఏ లంగా వేసుకుంటే వీళ్ళకెందుకో? మరి ఎంత మొత్తం తలా తీసుకున్నారో కానీ మాటి మాటికీ యీ గోలే తప్ప మరో వార్త లేదు. వార్త లేమీ లేక పోతే ఓ నాలుగ్గంటలు తమ వార్తా ప్రసారాలు ఆపితే ఏమైనా నష్టమా?  మధ్యలో మరల ఆయేషా మరో ఇద్దరిని కూడా ఇలాగే బుట్టలో వేయడానికి ప్రయత్నించిందన్న వార్త కలపడం. ఈ ముగ్గురు తప్ప ఈ రాష్ట్రంలో మరో ముఖ్యమైన వార్త లే లేవా? ప్రజల సమస్యలే లేవా? మంచి నీళ్ళ కోసం కిలోమీటర్ల కొద్దీ వేసవి ఎండలో నడిచి తెస్తున్న గ్రామీణుల వెతల గురించి, పట్టించుకోని పాలక, అధికార గణం గురించి ఎక్కువగా చెప్తే ! యిలాంటివే సాధారణంగా కనిపించే అత్యవసర సమస్యలెన్నో వున్నా ఈ గోల వినిపిస్తూనే వున్నారు. 3 రోజులు కాకపోతే ముప్పై రోజులు చేసుకొన్న మనకొచ్చిన ఇబ్బందేమిటి?

కాస్తా ఈ గోల తగ్గించరూ…