గతం

కనుమరుగవుతున్న కుండలు


పండగలలోనో లేక చావుకో తప్ప మనం వాడకం మరిచిపోయిన కుండలు కనుమరుగవ్వడంతో ఒక చేతి వృత్తుల కులమే తమ జీవనాధారాన్ని కోల్పోయి నేడు వేరే మార్గాల్ని వెతుక్కోవాల్సి వచ్చింది. కుమ్మర్ల జీవితాలు తీవ్రమైన సంక్షోభానికి గురయ్యాయి. కుండల తయారీకి వాడే మట్టి దొరకక, కాల్చేందుకు సరిపడా ఊక, కఱ, అసలు చోటే దొరక్క వారు తమ వృత్తినే వదులుకోవాల్సివచ్చింది. ఈరోజు అలా బజారులో నడుస్తుంటే అంతా ఒక్కసారిగా కుండని కొనేందుకు మూగడం చూసి క్లిక్ మనిపించాలనిపించి మీతో ఇలా పంచుకోవాలనిపించింది. మనం మన సంస్కృతికి దూరమవుతూన్న క్రమంలో కొన్ని వేల కుటుంబాలు తమ వృత్తిని కోల్పోయి తద్వారా తమ జీవనాధారాన్ని కోల్పోవడంతో పాటు వారి ఉనికే కనుమరుగవుతున్న చేదు నిజం మింగుడుపడట్లేదు.

మాఊరి పాతాలు (నవరత్నాటాకీసు)


నవరత్న టాకీసు


మేమంతా పాతాలుగా పిలుచుకునే ఈ సినిమా హాలు మా ఊరి చివర ఇలా మూగగా మిగిలిపోయింది. 1950 ప్రాంతంలో ప్రారంభించిన ఈ నవరత్నా టాకీసు ఒక్కటే ఈ ప్రాంతానికి వున్న ఏకైక సినిమా హాలు. మా పెద్దతరం అంతా గొప్పగా చెప్పుకునే సినిమాలన్నీ ఇందులో చూసినవే. నేడు సినిమా టాకీసులలో వచ్చిన మార్పులకనుగుణంగా మార్పులకు చేరువ కాలేక ఓ సం. క్రితం దీనిని ఫంక్షన్ హాల్ గా మార్చారు. అయినా క్లిక్ కాక మరల మూతపడిపోయింది. రోజూ దీని ముందు వెళ్ళినప్పుడు చిన్నప్పుడు అమ్మ తాను ఎడ్లబండిపై పండగ దినాల్లో ఈ హాలుకు సినిమా చూడడానికి వచ్చినట్లు చెప్పిన విషయం, పాతాళభైరవి, గుండమ్మకథ, దేవదాసు మొ.న అప్పటి బ్లాక్ బస్టర్స్ గురించి చేసిన పరిచయాలు అలా గుర్తుకు వస్తుంటాయి. ఇప్పటికీ గూగుల్ వారి మేప్ లో నవరత్న గా ఓ గుర్తుగా మిగిలిన ఇది పాతతరం గుర్తుగా అలా ఎన్నాళ్ళు మిగులుతుందో. లేక ఏ కొత్త వ్యాపారానికి మారి మట్టిలో కలిసిపోతుందో కదా?