ఖండిద్దాం

ఏ మొగుడూ దొరకనప్పుడూ…


ఏ మొగుడూ దొరకనప్పుడు అక్క మొగుడే గతిలా ఈ రాష్ట్రానికి రోజుకో మొగుడొస్తుంటాడు, కాళ్ళూ చేతులూ, కళ్ళు కూడా లేని వికలాంగులులా వాడి చుట్టూ చేరి నవ్వులు చిందిస్తారు. మన ఖర్మకి ఇలాంటి స్థితి దాపురించింది. రోజుకో కొత్త పథకం ప్రకటించి మూడు రోజులకొకసారి ఢిల్లీ పరుగెత్తి తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి అధికారాన్ని అధిష్టానం కాళ్ళు మొక్కుతూ కాపాడుకుంటేనే సరిపోతొంది. వీళ్ళ వలన జనానికి ఒరిగిందీలేదు.

సామాన్యుడా నీ ఓపికకు వేన వేల వందనాలు..

చట్టాలు భయపెడతాయా??


నిన్న మరల ఢిల్లీలో ఐదేళ్ళ బాలికపై దారుణమైన అత్యాచారం జరిగింది.

ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు కౌన్సిలింగ్ చేసి తిరిగి వారిని బెదిరించబోయారంట.

మన ప్రధాని గారు బాధ పడ్డారంట.

ఇదీ నిన్నటి వార్త అయిపోయింది అప్పుడే.

నిర్భయ చట్టం తెచ్చాం అని ఆర్భాటంగా ప్రకటనలే తప్ప అందులోనూ తూట్లు పొడిచి తమకనుకూలంగా మార్చుకోగల రాజకీయులు ధనమదాంధులు వున్నారు.

వీళ్ళకి తక్షణ పరిష్కారాలే తప్ప విచారణలు, న్యాయస్థానాలు చట్టాలు భయపెడతాయా??

వీళ్ళకిదే తాగించాలి..


AJIT_PAWAR_GN_1222890e
ఇటీవల మహారాష్ట్ర ఉప ముఖ్య మంత్రి కేంద్ర మంత్రి శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ వర్షాభావ పరిస్థితులలో రైతాంగం తీవ్ర దుర్భిక్ష పరిస్థితులనెదుర్కొంటున్నదని ప్రజల తాగు సాగు నీరు అవసరాలకు ప్రాజెక్టులనుండి నీళ్ళు వదలాలని దేశ్ ముఖ్ అనే రైతు 55 దినాలుగా నిరాహార దీక్ష చేస్తున్నారని విలేకరులు ప్రశ్నించగా డ్యాముల్లో ఉచ్చ పోయాలా అదీ సమస్యే ఉచ్చ పోయడానికి నీళ్ళు లేవని తీవ్ర అసహనంతో జవాబిచ్చారు. ఇది ఒక రాష్ట్ర అత్యున్నత పదవిలో వున్న మంత్రి భాష. అదే ప్రజలు వీళ్ళకి నీళ్ళకి బదులు ఉచ్చబోసి తాగిస్తే సరిపోతుంది కదా. రాజకీయ నాయకులు అధికారులు ఇలా ప్రపంచంలో అత్యున్నత ప్రజాస్వామ్య దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామన్న కనీస జ్నానం లేకుండా మాటాడుతూ ప్రజల సహనానికి పరీక్ష పెడుతున్నారు. వీళ్ళకి తగిన బుద్ధి ప్రజలే చెప్పాలి.

బషీర్ బాఘ్ – దమననీతి..


పన్నెండు సంవత్సరాల తరువాత బషీర్ బాఘ్ వద్ద చంద్రబాబు హయాంలో జరిగిన పోలీసు దమనకాండపై వారి శాఖవారే నిర్వహించిన విచారణా నివేదికలో ఉద్యమకారులదే దోషం అని తేల్చి చెప్పడం వారిపై మరల కేసులు పెట్టడానికి తయారు కావడం చూస్తుంటే వారి నీతి న్యాయం ఏపాటిదో
తెలుస్తోంది. అకారణంగా ముగ్గురిని పొట్టన పెట్టుకున్న పోలీసులు వారిపై ముందుగా హత్యా నేరంకింద కేసులు పెట్టాలన్న హైకోర్టు తీర్పును పక్కన పెట్టి ప్రదర్శన నిర్వహించిన వారిపై కేసులు పెట్టడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ప్రజల ప్రశ్నించే హక్కును కాలరాయడం యిది. వ్యక్తి స్వాతంత్రాన్ని హరించడమే. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులపై ఉక్కు పాదం మోపడమే.. దీనిని ప్రజాస్వామ్య వాదులు ఖండించాలి…

సారీ టీచరొక్కటేనా??


సారీ టీచర్ కంటే ముందు వచ్చిన సినిమాలన్నీ చాలా సంస్కారంతో వున్నాయా??

కొత్త దనం పేరుతో ఒసే ఒళే అని పరిచయం లేని అమ్మాయిలని కూడా అరుస్తూ పిలిచే దేశముదురు, ఇడియట్, పోకిరీలు లాంటి సినిమాలను భారీ కలెక్షన్స్ తో విజయవంతం చేసి, ప్రశ్నించని జనంకు ఇప్పుడిలా అడిగే అర్హతుందా??

ఇంట్లో టీవీలో వచ్చినప్పుడైనా పిల్లలతో చూడదగ్గ సినిమా ఏదైనా వుందా? ఇంతకంటే అసభ్యకరంగా వచ్చినవి పెద్ద హీరోలవి ఎందుకడగడం లేదు?? సినిమా ప్రభావం పిల్లలపై వున్నదని సెన్సారు బోర్డుకు తెలియదా? ఈ సినిమాకు బోర్డ్ వారు ఏకగ్రీవంగా U/A certificate ఇచ్చారంట. పన్నెండేళ్ళ లోపు పిల్లలను వెళ్ళకుండా చూసే బాధ్యత తల్లిదండ్రులదే అని కోర్టు వారికి చెప్పారు.

అసలు వ్యాపారం కానిదేదైనా మిగిలిందా మన సొసైటీలో??

ఇదో ఫ్రీ పబ్లిసిటీ వాళ్ళకి..

సంక్షేమం క్షామం అవుతున్నది…


రాష్ట్రంలో గత కొన్నేళ్ళూగా వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి అతి దయనీయంగా మారుతున్నది. హాస్టల్ విద్యార్థులకు రోజుకు 17/- లు మాత్రమే భోజనానికి ఇస్తున్నారు. దీనిలో సంక్షేమాధికారుల వాటాలు పోను వారికి కనిష్టంగా పది రూపాయలతోనే పెడుతున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితి కనిష్ట ప్రమాణాలకు దిగజారుతూ ఎంతో మంది విద్యార్థులు మరణాలకు గురవుతున్నారు ప్రతి యేడూ.

గిరిజన ఆశ్రమ విద్యార్థులది మరీ దారుణమైన పరిస్థితి. వీరికి ఎక్కువగా మలేరియా వ్యాధి సోకి అనారోగ్యానికి గురైతే వీరిని ఆసుపత్రులలో చేర్చక తల్లిదండ్రులతో ఇంటికి పంపించి చేతులు దులుపుకుంటారు. దీంతో వీరు కనీస రహదారి సదుపాయం లేని గ్రామాలకు వలసలకు చేరుకొని అక్కడ చావుతో పోరాడి ఓడిపోతున్నారు. ఇలా ప్రతి ఏటా వందలాది విద్యార్థులు మరణిస్తున్నారు. దీనిపై సర్వేలు చేసి ఏవో ప్రకటనలు ఇచ్చి ఆచరణ శూన్యమైన పథకాలతో చేతులు విదిలిస్తున్నారు. వీరికి ప్రాధమికి వైద్యం అందుబాటులో వుండదు. మలేరియా డ్రగ్స్ వాడితే పోషక విలువలువున్న అహారం అవసరం. కానీ అది వీళ్ళకు అందుబాటులో వుండ ఈ మందుల ప్రబావంతో జాండిస్ ఇతర సైడ్ ఎఫెక్ట్సుతో చావుకు లోనవుతున్నారు. ఇటీవల మా ITDA పరిధిలోని గ్రామాల పర్యటన సందర్భంగ నేను గమనించింది ఇది.

ఇంకో ముఖ్య విషయం రోజుకు ఖైదీకి భోజన ఖర్చు 50/-లు, ప్రభుత్వాసుపత్రులలో రోగికి 40/-లు (ఇందులో కమీషన్లు పోనూ రోగికి 25/-లు కూడా అందడంలేదన్నది వేరే విషయం) కానీ విద్యార్థికి రోజుకు 17/-లు మాత్రమే మంజూరు చేస్తున్నారు. ఇందులో సంక్షేమాధికారుల వాటా అధికం. ఇలా సరైన పర్యవేక్షణ లేక హాస్టళ్ళలో అతి దారుణ పరిస్థితులలో మగ్గుతూ SC, ST, BC విద్యార్థులు మరో గత్యంతరం లేక చదువులు కొనసాగిస్తున్నారు. కోట్లాది రూపాయలు విద్యకు ఖర్చు చేస్తున్నామని ప్రకటనలకే పరిమితమవుతున్నది ప్రభుత్వం. కింది స్థాయికి వచ్చేసరికి రూపాయికి తక్కువవుతున్న వైనం అందరికీ ఎరుకలో వున్నదే. సంక్షేమం నుండి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న ప్రభుత్వం కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తూ పేదలకు విద్యను అందని ద్రాక్షను చేస్తున్నది. పేద విద్యార్థులు హాస్టళ్ళలో కూడా తమ దారిద్ర్యాన్నే అనుభవిస్తూ అవమానాలు పడుతూ విద్యాభ్యాసం చేస్తున్నారు. దీంతో హైస్కూలు విద్యకు వచ్చేవారు సగానికి పైగా తరిగిపోతున్నారు. ఆ తరువాత కొనసాగినా అతి తక్కువ మందే చివరి వరకు ఉంటున్నారు. కూలి కొడుకు మరల కూలిగానే మిగిలిపోతున్నాడు…

నీచ రాజకీయులు


పార్లమెంటరీ రాజకీయాలు ఎంత కుళ్ళు కంపుకొడుతున్నాయో అందరికీ అవగతమవుతోంది…

అసెంబ్లీ హాలులో బూతు బొమ్మలు చూస్తూ గడిపేవారు కొందరు…

జనం నెత్తురు తాగుతూ కోట్లరూపాయల సారా వ్యాపారం చేస్తూ పట్టుబడితే కులం పేరుతో తప్పుకోజూసే వాడొకడు…

శాఖల కోతలతో అగ్గిమీద గుగ్గిలమవుతాడొకడు…

బట్టీలకు బట్టీలు సారా వ్యాపారం చేస్తున్న వాడు అధినాయకుడై కూచుంటాడు పైన,

మోజు పడి మహిళను లోబర్చుకొని చంపిస్తాడొక మంత్రివర్యుడు….

వీళ్ళ డొక్కలు శుద్ధి జేయడానికే సరిపోతుంటే పరిపాలనెవడు జేస్తాడు…

వీళ్ళ అధికార ధాహం దన మదాంధకారాలతో జనం నెత్తిన కూచున్న ఈ రాజకీయ నీచులను పాతరెయ్యాలి….

ఆడి సేతులల్ల బెమ్మజెముడు మొలిసియ్య…


ఖాకీచకుడు

అప్పా, ఓలప్పా ఏటే ఇలాగోసిపోయింది నీ సెయ్యి, బుగ్గ మీదేటే అలా కమిలిపోయింది అంటూ వొచ్చింది వరలక్ష్మి రాములమ్మ ఇంటికి..

రాయే తల్లీ లచ్మీ.. ఏటి సెప్పమంతావే, మా ఆశా వర్కర్లమందరం కలిసి మన మండలం నుండి ఉదయం పాసెంజిరెక్కి విజీనగరం యూనియనోళ్ళు రమ్మన్నారని ఎల్లినాం… అలా ఎల్లి రైలు టేసను నుండి బయటకు వస్తూనే అందరం రెండు లైన్లుగా ఇడిపోయి జీతాలు పెంచాలని, యూనిపారాలివ్వాలని గట్టిగా అరుసుకుంటూ కలెకటేరాపీసు వైపు నడుత్తున్నాం. ఎత్తు బిడ్జీ కాడికి వచ్చే రావడంతోనే పోలీసులడ్డుకున్నారు.. ఇంతమందిమి మేముండగా ఇద్దరు ఆడపోలీసులు మిగిలినోళ్ళంతా మగపోలీసులే తల్లి.. ఏమయ్యా బాబూ మేము మా సమస్యలు జెప్పుకోటానికి ఎల్తున్నాం, మేమెవలం దుడ్డుకఱలు పట్టుకోనేదు, మా సేతిలో ఏమీలేదు, కాయితాలు తప్ప మరి అడ్డుకుంటున్నారేమయ్యా అని అడిగినారే మా ముందున్నోళ్ళు, సంగం నాయకులు..మీరు ముందుకెల్లడానికీలునేదంతే నేదనీసి లావుపాటి బాబు ఒకటే ఈరంగం.. అయితే మేమిక్కడే కూకుండిపోతాం, కలెకటరు బాబే వత్తాడైతే అనీసి ఎక్కడోళ్ళం అక్కడే రోడ్డుపైన కూసున్నామే… ఇంక ఆ ఆడ పోలీసులు రెచ్చిపోయి ఏటే నెగండే నంజిల్లారా అని గదమాయించేసరికి, బొబ్బిలి, సాలూరు సుట్టుపక్కలనుండి వచ్చినోళ్ళంతా మేమెందుకు నెగాలె, మమ్మల్ని ఎల్లనిత్తే ఎల్తాం, నేకపోతే ఇక్కడే వుంతాం అని ఆళ్ళ సేతుల్నిండి ఇడిపించుకుంతుంటే ఆ గుంజులాట సూసి ఏటే ఆల్లతోని మాటలు, అనీసి కఱి దున్నపోతులా ఎగసోప బెట్టుకుంటూ ఒక్కపాలిగా మామీద నాటీలతో ఇరగబాదీసినాడె.. ఆడు తినాద సిఐ బావంట… ఆడి సేతులు పడిపోను, ఆడి నోట్లో మట్టికొట్ట, నా రగతం పొయ్య, ఆడి జిమ్మడిపోను, ఆడి సేతులల్ల బెమ్మజెముడు మొలిసియ్య ఏనాడు మీ బావైనా కొట్టనేదే, అలాపింటిది ఆ నంజికొడుకు నాటీతో బాదీసినాడే, పచ్చి బాలింతరాలు సిన్న పిల్లల్ని సేతులల్లో పట్టుకొని పరిగెట్ట నేకపోతుంటే పిఱలమీద మరీ కొట్టీసినాడే, పైటసెంగులు, జుత్తు పట్టి నాగీసి ఈడీసీసినారే, ఇజీనగరం ఆడి బాబుగాడిదైనట్టు రోడ్లమీద ఈరంగం ఆడినాడే, మాలో నలుగురైదుగురికి బుఱలపై దెబ్బలు తగిలి సానా రక్తం పోయినాదే లచ్మీ… ఏటి సెప్తాను, తెల్లారిగట్ల ఇంటికాడ బయలెల్లినప్పుడు తాగిన గెంజేనే, దిగాక టీ సుక్కకూడా తాగకుండ ఎల్లినామా, ఈ దెబ్బలు ఈటితోని పాటు కడుపుమంటతో నకనకలాడిపోయినామే.. ఉపాధిహామీ పనులకెల్లినోళ్ళకు రోజుకు వందొస్తుందా, మాకేమో నెలకు నాలుగొందలు జీతం, అదీ ఇప్పుడు ఆరేడు నెలలుగా ఇయ్యనేదా, తీరా ఇచ్చినప్పుడు అందులో గుమస్తాబాబుకు ఏబై ఇయ్యాల మరి మండలాపీసు మీటింగులకెల్లాల, ఆలకి ఈలకి బాలేదంటే తోడు ఎల్తన్నామా, పురిటికి పున్నానికి తీసుకెల్తున్నామా అందరికీ ఎలాగోలా సేసుకొస్తున్నామా, అయ్యా మరో ఆరొందలైనా పెంచండి మాప్రబో అని సెప్పుకోడానికి ఎల్తామంటే ఇలగ కాలిపోయింది.. మేమేమైనా ఉద్యోగాలు జీవితకాలం సేత్తామన్నామా, గోనెసంచీలతో ఒంపీమన్నామా… ఏటోనే లచ్మీ ఇలా దెబ్బలు తినీసి వచ్చినానా ఇంక మీ బావ నీకెల్లొద్దంటే ఎల్లినావ్, నువ్వే అనుబవించే అని ఆడు రోడ్డు మీద టీకొట్టులోనికి ఎల్లిపోనాడు..ఈ పిల్లలకి ఒండిపోయాలి కదా అని మల్లీ నెగిసినానే… యిదీ నిన్నటి మా ఎద…

ఇంత కఠినాత్ములమా?


ఒక ప్రక్క మనకు అత్యంత సమీపంలోనున్న దేశం మొత్తం బూడిదవుతున్న సందర్భంలో ఈ ఉపఖండంలో జరుగుతున్న క్రికెట్ వ్యాపారాన్ని ఎలా ఎంజాయ్ చేయగలుగుతున్నారో? అంత భీభత్సంగా ప్రకృతి విలయతాండవానికి గురై అల్లల్లాడుతూ ఆర్తనాదం చేస్తున్న ప్రజలను చూస్తూ సునామీ రోజుకూడా బందుపెట్టని ఫక్తు వ్యాపార సంస్కృతిని ఖండించను కూడా లేని సానుభూతి ఎవరికోసం? అణు ప్లాంట్లన్నీ బూడిదవుతూ మానవాళికి ముప్పుగా తయారవుతున్నా బహిరంగ ప్రదేశాలలో మూకుమ్మడిగా జనం కూడగట్టడం న్యాయమా? జరగరానిది జరిగితే ఎవరు దీనికి బాధ్యులు? జనావళి పట్ల బాధ్యత లేని పెట్టుబడిదారుల వ్యూహానికి ఇంత లోకువై పోవాలా? మన్యులంతా ఆలోచించగలరు….

రాజీవ్ రెడ్డి, సోనియా రోశయ్యని పెట్టుకోండిరా…


తెలుగు లలిత కళా తోరణం


తెలుగు లలిత కళా తోరణం పేరుకు ముందు రాజీవ్ ను కలపడానిని ఇప్పుడే ఏబిఎన్ లో చర్చలో సుబ్బరామిరెడ్డి సమర్థించుకోవడాన్ని చూస్తుంటే వీళ్ళ పేరుకు ముందు కూడా రాజీవో, సోనియా అనో తగిలించుకుంటే బాగుణ్ణు. ఏమంటే రాజీవ్ జీవితాన్ని త్యాగం చేసాడన్న సోది చెప్తున్నాడు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఈ జాతి వినాయకుల పేర్లను తగిలించేయడం ఎలా సమర్థించగలం. ఆ ఏంకర్ బాగానే అడిగాడు ప్రపంచ బ్యాంకు వేలకోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తుందని ప్రపంచబాంకు ఆంధ్రప్రదేశ్ గా మార్చేద్దామా అని అడిగితే ఈ నత్తి నాయకుడు తుతుతి అని అంటున్నాడు. ఏదో వీడి జేబులో సొమ్ములా మాటాడుతున్నాడు. అది కూడా పార్లమెంటు సభ్యులకిచ్చే నిధులనుండి ఇచ్చినదే.. ప్రజాధనంతో చేస్తున్న పనులన్నీ వీళ్ళ సొంత సొమ్ములా ఫోజులిస్తూ తెలుగువాడి పరువు తీస్తున్నారు. వాటర్ గేట్ కుంభకోణంతో సమానమైన బోఫోర్స్ కుంభకోణంతో భారత పరువు తీసిన రాజీవ్ పేరును ఇప్పటికే ప్రభుత్వ కార్యక్రమాలన్నింటికీ ఆఖరికి ఎప్పుడో NTR పేరు పెట్టిన విమానాశ్రయానికి కూడా తగిలించారు. అయినా వీళ్ళ దురద తీరక ఇలా సాంస్కృతిక వేదికలకు కూడా తగిలించడాన్ని అంతా వ్యతిరేకించడం మనందరి కర్తవ్యం కాదా?