కోరిక

ఆప్కో వస్త్రాలను కొందాం..


apco_logo-------final_0
ఈ రోజు సాయంత్రం విజయనగరంలో గంటస్తంభం దగ్గర్లోని ఆప్కో వారి షాపులో దుప్పటి, తువాలు, లుంగీ కొన్నాను. బిల్ చెల్లించే సమయంలో సేల్స్ మేనేజర్ థాంక్సండీ అంటూ సార్ మీరిలా కొనడం ద్వారా చేనేత కుటుంబాలను ఆదుకొన్న వారవుతారు. మాకైతే ఉద్యోగాలున్నాయి జీతాలు వస్తాయి కానీ ఈ వృత్తినే నమ్ముకున్న కుటుంబాలకు తాము శ్రమపడి నేసిన బట్టలు అమ్మబడడం ద్వారా తిండి దొరుకుతుంది. మీకు మరో మారు నమస్కారమంటూ తను కళ్ళలో నీళ్ళు పెట్టుకోవడం చూసిన మాకు కూడా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. తప్పకుండా మళ్ళీ వస్తామని మా ఫ్రెండ్ నేను వచ్చాం భారమైన మనసుతో.

మిత్రులారా..
దయచేసి ఆప్కో వారి వస్త్రాలను వీలున్నంత మేర వాడడానికి ముందుకు వచ్చి చేనేత కార్మికులను ఆదుకొనే ఉడతా సాయం చేయగలరని మనవి. ఈ వస్త్రాలు చాలా మన్నికైనవి కూడా.

చేనేత వస్త్రాలను కొందాం. చేనేత కార్మిక కుటుంబాలను ఆదుకుందాం.

నీచ రాజకీయులు


పార్లమెంటరీ రాజకీయాలు ఎంత కుళ్ళు కంపుకొడుతున్నాయో అందరికీ అవగతమవుతోంది…

అసెంబ్లీ హాలులో బూతు బొమ్మలు చూస్తూ గడిపేవారు కొందరు…

జనం నెత్తురు తాగుతూ కోట్లరూపాయల సారా వ్యాపారం చేస్తూ పట్టుబడితే కులం పేరుతో తప్పుకోజూసే వాడొకడు…

శాఖల కోతలతో అగ్గిమీద గుగ్గిలమవుతాడొకడు…

బట్టీలకు బట్టీలు సారా వ్యాపారం చేస్తున్న వాడు అధినాయకుడై కూచుంటాడు పైన,

మోజు పడి మహిళను లోబర్చుకొని చంపిస్తాడొక మంత్రివర్యుడు….

వీళ్ళ డొక్కలు శుద్ధి జేయడానికే సరిపోతుంటే పరిపాలనెవడు జేస్తాడు…

వీళ్ళ అధికార ధాహం దన మదాంధకారాలతో జనం నెత్తిన కూచున్న ఈ రాజకీయ నీచులను పాతరెయ్యాలి….

సాక్షిపై స్వపక్షీయుల విమర్శ అర్థరహితంకాదా?
గత రెండు రోజులుగా అన్ని వార్తా పత్రికల పతాక శీర్షికలలో అవినీతి రాజా గురించి, అధికారమే పరమావధిగా గొంతు పెగల్చని మౌనసింగ్ గురించి రాస్తుంటే మార్కెట్లో అమ్ముడుపోవాల్సిన పత్రికకు ఈ వార్తలలో భాగస్వామ్యం అక్కరలేదా? అలా కాకుండా రాజా గారు చాలా నీతిమంతుడు, మా అమ్మగారు త్యాగ ధనులు, మా Mr.Clean సింగ్ గారి నోట్లో నాలుక కత్తిరించి చాన్నాళ్ళైనందున ఇప్పుడు మీరు ఇటువంటి విషయాలపై రాద్ధాంతం చేసి ఆయననేమీ అనవద్దు అన్న కథనాలు గుప్పిస్తే ఇప్పటికే సొంత డబ్బా పత్రికగా పేరు బడ్డ పత్రికను ఆ రెండున్నఱూపాయలకైనా కొంటారా? కాంగ్రెస్ వారైనంత మాత్రాన వార్తా పత్రికగా వారి బాధ్యతను విస్మరించమనడం సమంజసమా?

అలా అని ఇలా రాయడం వెనుక అక్కసు లేదా అని ప్రశ్నించొచ్చు మీరు. కానీ ఈ సమయంలో దానిని బయటపెట్టుకొన్నందువలన జగన్ కు కొత్తగా ఒరిగేదేమీ వుండదు కదా? కావున ఇకనైనా జనం ఆలోచనలకు దగ్గరగా వార్తలు వస్తాయని ఆశిద్దాం..

వృధ్ధ జంబూకాలకు సహనం నశిస్తే బి.పి. ఎక్కువై గుండెపోటు వచ్చేది వాళ్ళకే తప్ప వాళ్ళవెనక జనం లేరన్న సంగతి అందరికీ తెలుసు కాబట్టి మీరిలా కంటిన్యూ కావాలని సామాన్యుల కోరిక…

ఈ ‘లైలా’ ఎన్ని కొంపలు ముంచుతుందో?


నిన్నటి విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరికలతో తీర ప్రాంత వాసుల గుండెల్లో స్టీమర్లు పరుగెడుతున్నాయి. ఈ తుఫానుకు చాలా నాజూకైన పేరు ‘లైలా’ గా నామకరణం చేయడంలో మన వాతావరణ కేంద్రం వాళ్ళ  sense of humour కు జోహార్లు. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే, బీడీ ముట్టించి దమ్ములాగినట్లుంది వీళ్ళ  పరిస్థితి. యిప్పటికే ఆరో నెంబరు … ప్రమాద హెచ్చరికలతో భయపెడుతూన్నారు.

లైలా కు నాదో విన్నపం. అమ్మా తల్లీ దయచేసి నీవు జూలు విదిలించక ఏదో తొలకరి జల్లులా అలా ఓ మోస్తరు వానలు కురిపించి, ఏరువాక సాగేటట్లు, వాతావరణం చల్లబడ్డట్లు, బావులలోను, చెరువులలోను నీళ్ళు నిండేటట్లు చూసిపో తల్లీ.

అత్యాశకాకూడదని ఆశిస్తూ..

క్రీడల గుహలను వదలనంటున్న రాజకీయ గబ్బిలాలు..


చాలా ఏండ్ల తరువాత భారత క్రీడా మంత్రిత్వ శాఖ ఓ మంచి నిర్ణయం తీసుకునేందుకు ముందుకు వచ్చింది. జీవిత కాలంగా కొనసాగుతున్న వివిధ క్రీడా సమాఖ్యల అధ్యక్ష, ఆఫీసు బేరర్లను తొలగించి కొత్తగా ఎన్నికలు జరపాలని నిర్ణయించడాన్ని  పార్టీలతో ప్రమేయం లేకుండా గత 20, 30 ఏళ్ళనుండి గబ్బిలాలలా పట్టుకువేలాడుతూ నూరుకోట్ల మంది భారతీయుల ఆశలపై ప్రతీ సారీ నీళ్ళు కుమ్మరిస్తున్న వారిని బయటకు పంపే కార్యక్రమంగా దీనిని పూర్తిగా చెప్పుకోలేకపోయినా గుడ్డిలో మెల్ల నయంలా కొంత మార్పునకు దోహదపడుతుందనుకుంటే అప్పుడే లాబీయింగ్ లతో తమ పదవులను కాపాడే ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు.

క్రీడాకారుల ఎంపికలో పారదర్శకత లేకపోగా రాజకీయ సిఫారసులతో, ధనప్రభావంతో, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతంతో ఎంపికైన మన క్రీడాకారుల(?)  నుండి ఏ పతకాన్ని ఆశించగలం. ఒలింపిక్స్ కు వందలాది మంది మందీ మార్బలంతో వెళ్ళి ఎవరో ఒకరిద్దరు అదృష్ట దీపక్ ల పతకాలతో మనం యిక్కడ చంకలు గుద్దుకొని, పట్టికలో మన స్థానం చూసి ఉసూరుమంటూ యింతేలే భారత పతకాల బతుకు అంటూ పాడుకోవడంతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.  యికనైనా ఇలాంటి వత్తిడులకు లొంగకుండా(!) గట్టి చర్యలు ఆశిద్దాం….

ఒక ‘భారతీయుడు’ రావాలి


ఈ రోజు నారాయణగూడలో జరిగిన నిర్మాణంలో వున్న భవనం కూలిన  దుర్ఘటనలో  11 మంది కూలీలు మరణించారు. ఇందులో ఒకరు 11 నెలల పసికందు.  ఇద్దరు మహిళలు. వీరంతా మెదక్, పాలమూరు జిల్లాల వాసులుగా చెప్తున్నారు.

ఈ భవనం పక్కనున్న పాఠశాల భవనంపై కూలడంతో అది కూడా బీటలు వారింది. ఏ అదృష్టం కాపాడిందో అందులోని చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు.

యిలా కడుతున్నవో, కట్టినవో కూలిపోవడం ఈ మధ్య తరచూ జరుగుతున్నాయి. వీటన్నింటికీ కారణం కాంట్రాక్టర్లతో కుమ్మక్కయిన అధికారుల వలననే జరుగుతున్నాయి. ఒక స్థలంలో కొత్తగా ఏదైనా కట్టడం నిర్మించాలంటే పొందాల్సిన అనుమతులు చాలా వున్నాయి. వీటిని సవ్యంగా పర్యవేక్షించక పోవడంవలన, కాంట్రాక్టర్లు ఇచ్చిన లంచాల కక్కుర్తితో, రాజకీయ వత్తిడులతోనో  అధికారులు ఉదారంగా అనుమతులివ్వడంవలన యిలా జరుగుతున్నాయన్న వాస్తవం అందరూ ఎరిగినదే!

ఒక మధ్యతరగతి వ్యక్తి స్వంత యిల్లు కట్టుకుందామంటే వాడి ముక్కుపిండి, కళ్ళలోంచి నెత్తురు కారి, కాళ్ళ చెప్పులరిగేలా తిప్పి ఈ జన్మలో యిల్లు వద్దనుకునేట్లు చేసే అధికారగణం, అదే ఒక కాంట్రాక్టరో, కార్పొరేటరో అయితే క్షణాలలో పనిచేసి పెడతారు. యిది మన వ్యవస్థలో పాతుకుపోయిన నైజం. ఎవరికి వారే తప్పుకుపోయే వాళ్ళం కాబట్టి యిలాంటివి సర్వసాధారణమయిపోయాయి.

యిలాంటి సంఘటనలు జరిగినప్పుడు హడావిడిగా ex-gratia ప్రకటించి, నలుగురిని సస్పెండ్ చేసే మన నాయకమ్మణ్యులు, వాటాలు కుదిరినాక, కులమో, మతమో పనిచేసి మరల వారిని యదావిధిగా విధుల్లోకి తీసుకుంటారు. సస్పెండ్ అయిన కాలానికి పనిచేయకుండా జీతమూ  వస్తుంది. హయిగా మరిన్ని స్వంత వ్యాపారాలు చేసుకునే అవకాశమూ వుంటుంది.

యిది కాదు పద్ధతి. వీళ్ళపై హత్యానేరం కింద కేసులు నమోదు చేసి, సరైన శిక్ష పడేట్లు చేయాలి. జరిగిన నష్టపరిహారాన్ని వాళ్ళనుంచే రాబట్టాలి.

అస్మదీయులు, తస్మదీయులు గురించి ఆలోచించే మన పాలకవర్గాలకు యిదంతా పట్టదు. కాబట్టి శంకర్ సినిమాలలో లాగ ఒక ‘భారతీయుడో’, ‘అపరిచుతుడి’ రాక కోసం ఎదురుచూడకతప్పదు.

కలిపిన చేతులు కడవరకూ..ఇదో మహా మానవ హారం

తెలంగాణా ప్రజల ఆకాంక్షల సమాహారం

కలిసిన యీ చేతులు కడవరకూ …

విజయం చేకూరేవరకు విడిపోరాదు!


ఈ స్ఫూర్తి చిరకాలం వర్థిల్లాలి

కలిసిన యీ చేతులగుండా ప్రవహించిన

విద్యుత్ తెలంగాణా తల్లి నుదుట

నక్షత్రమై మెరవాలి!


ఉప్పొంగిన ఈ మానవ సంద్రం

సునామీ కాకముందే

అందరి మదిలో అమృతం వర్షించాలి…

ఊపిరి వున్నంతవరకూ కొట్లాడదాం..


చావు దానంతటదే రావాలని కాళ్ళు బార్లా చాపుకొని

ఎదురుచూసే వాళ్ళు కోట్లాదిమంది

కానీ చావుకు ఎదురు నిలిచి పోరాడే వాళ్ళు కొద్దిమంది


రాజకీయ బేహారుల మోసాలకు

గుండెలు భారమయి చావుని ఆహ్వానిస్తున్న తీరు

బాధాకరం

ఇది కాదు మన వారసత్వం


శత్రువు గుండెల్లో నిదుర పోయిన

పెద్ది శంకర్. . . . . లలా

మండే నిప్పు కణికలై భూమ్యాకాశాలు

దద్ధరిల్లేలా పొలికేక కావాలి మనతరం


చావు గుండెల్లో నిదురపోదాం

ప్రజల కనులలో మెరిసే ఆశా కిరణాలవుదాం


ఆత్మ బలిదానం కాదు

బలిపీఠంపై వారినే కూర్చోబెడదాం


(తమ నేలతల్లి విముక్తి కోసం ప్రాణాలర్పించిన వేణు, సువర్ణల స్మృతిలో)


తెలంగాణా ఆవిష్కరణనాడే నూతన సంవత్సర వేడుకలు


తెలంగాణా ప్రజల చిరకాల ఆకాంక్ష ప్రత్యేక తెలంగాణానాడు ఏర్పాటయ్యాకే నూతన సంవత్సర

వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చిన  స్టూడేంట్స్ జాయింట్ ఏక్షన్ కమిటే నిర్ణయాన్ని

స్వాగతిద్దాం. ఆమరణ నిరాహార దీక్షలతో అట్టుడుకుతున్న నేలపై ఈ కృత్రిమ వేడుకలను

బహిష్కరిద్దాం. అణగారిన ప్రజల ఆకాంక్ష నెరవేరిన నాడే క్రొంగొత్త ఉత్సాహాంతో నూతన దశాబ్ధి

వేడుకలను జరుపుకుందాం.

సంబర సమయాన…


అంతా సంబరాలు జరుపుకునే సమయాన

మరల పిడిబాకుల వెన్నుపోట్ల

రాజీనామాలు

బుఱమీసగాళ్ళ పళ్ళుకొరుకుడు

పిడికిలి బిగింపుడు…


వదులుకోవద్దు వదులుకోవద్దు

ఈ అవకాశాన్ని

తుదికంటా పోరాటాన్ని

ముందుకు తీసుకుపోవాలె

దోచుకోవడం మరిగిన నేతల

తలరాతలు మార్చాలే..

చివరి ప్రకటన వచ్చేవరకు

మోసపోవద్దు….

తస్మాత్ జాగ్రత్త..