కవిత

సలాం ముంబై…


నెత్తురోడిన ముంబై
మౌఢ్యం ఏదైనా మారణ హోమమే
మానవ హననమే…

కోల్పోయిన వాళ్ళలో నీకు చాయ్ తాపించిన వాడూ వున్నాడు
నీలో గూడు కట్టుకున్న చీకటి విషాదానికి
ఎన్నటికీ ఇది పరిష్కారం కాదు.. కాకూడదు…

నెత్తురోడిన వీధులు
చిద్రమైన మానవ దేహాలు
మూల్గుతున్న హృదయాలు
యిక్కడితో ఆగనీ…

పరిమళించనీ మానవత్వం….
ముంబై నీకు సలాం….

పోగాలం దగ్గరబడిందిరా…(పెట్రో ధరలకు నిరసనగా)


ఈళ్ళ సేతులల్ల బెమ్మెజెముడు మొలిసియ్య
ఈళ్ళ బుఱలో పాములు పెరుగుతున్నాయా
జెనాలు ఎలా బతుకీడుస్తున్నారో
ఎలా గోసబెడుతున్నారో
ఏ ఒక్కడికైనా యాదిలో వుందా..
ఈళ్ళ జీతాల్ గీతాల్ పెంచుకు పోతూ
పేదోడి పొట్ట గొట్ట సూస్తున్నారు కదయ్యా…

ఎక్కడా ఎండు కఱ పుల్లైనా దొరక్క
ఎలుగు గ్రూపుల్లో జేరి గొనుక్కున్న
గాస్ పొయ్యి యింక మా నెత్తిన బెట్టుకూరేగాలా?
ఆ ముద్ద వొండుకు తిండానికి కూడా
ఈలు లేకుండా యింత బరువు నెత్తితే
మీ నెత్తిన ఈ బండతో మోదాలిరా…

మీరిచ్చే మూడు గంటల పాటి కరెంటు కూడా ఎలగక
బుడ్డి దీపం ఎలిగించుకుందామన్నా
నువ్విచ్చే రేషన్ దుకాణంలోని
ఆ అర లీటరు కిరోసిన్ నీ కాష్టంలో పోద్దామంతే
మరల పెంచి జచ్చినావు కదరా?

ఈ జేత్తో కూల్డబ్బులిచ్చి
ఆ జేత్తో కొల్లగొట్టేస్తే మేమింక
ఏం దిని బతకాల?
ఏం దిని జావాల?

అటు యిత్తనాలు దొరక్క
ఎరువులు దొరక్క నారు పొయ్యనేక
ఒకైపు ఏడుస్తుంటే
ఈ అర్థరాత్రి ఈ సావు కబురొకటి…
మీ యింట్లో పీనుగెల్ల… 

మీకు పోగాలం దగ్గర పడుతోందిరా..

అత్యాశ కాకూడదు..


రాబోతున్న ఎండల వేడిమికి
చిగురాకుల గొడుగు పట్టే
వృక్షరాజంలా
నిస్వార్థతను అద్దుకునే
హృదయాల మేలు కలయిక
కావాలి ఈ ఉగాది…

నేలతల్లి కడుపున
దాగిన నీటి ఊటలను
తాగి తిరిగి
తొలకరితో మొదలై
పచ్చని పంటలనందించే
తపనతో వర్షించే కాలమేఘంలా
ధర్మాన్ని ఆచరించే
నిజాయితీ నివ్వాలి ఈ ఉగాది…

నిత్యమూ నిరతరమూ
విమర్శా ఆత్మ విమర్శల
మేలు కలయికలా
మన మధ్య స్నేహ పుష్పం
ఉదయించాలి ఈ ఉగాదిన…
(అందరికీ ఉగాది శుభాకాంక్షలుతో)

భారమైపోతాను…


రూపాన్ని

కోల్పోయి

ఖాళీగా

మిగిలిన

ప్రతిసారీ

నీ జ్నాపకాలు

కమ్ముకొని

ఒక్కసారిగా

భారమైపోతాను…

తండ్రీ… రాక్షసుడా….


తనెవరో,

ఆడో, మగో,

ఏ కులమో,

ఏ మతమో,

ధనికురాలో,

పేదరాలో

తెలీని

ఆ పిచ్చితల్లి…


నవమాసాలు

అమ్మకడుపులో

భద్రంగా ఈదులాడి

బయటపడిన క్షణం…


తను ఆడబిడ్డనని

తన ఇంట తిరుగాడే

అదృష్ట దేవతనని

గారాభంగా చేతుల్లోకి

తీసుకుంటావనుకుంటే

ఒక్కసారిగా నేలకేసి మోది

చంపుతావనుకోలేదు నాన్నా…


ఇందులో నా తప్పేంటో

కాస్తా చెప్పగలవా?

మరో మారు జన్మెత్తకుండా

వుంటా….

(ఉదయాన్నే పేపరులో ముందు పేజీలోనే ఆడబిడ్డని నేలకేసి బాది ఆసుపత్రిలోనే చంపిన తండ్రి వార్త చదివి)

వీధులన్నీ మావే..


విధివెక్కిరింత

 

 

 

 

 

 

 

 

 

 

 

ఎవరో విసిరేసిన ఎంగిలాకులులా
ఇలా ఈ రోడ్డు పక్కన
దొర్లుకుంటూ ఎక్కడినుండో
ఓ సుడిగాలికి చిక్కిన
చెత్త కాగితంలా ఇలా
ఎగురుకుంటూ
ఒకరినొకరం
ఓదార్చుకుంటూ
మట్టిలో మగ్గుతున్న
మా బతుకులిలా
గాలిపటంలా మారినందుకు
ఎవర్నీ నిందించలేము…

ఏటికి ఎదురీదడం
నేర్చుకుంటున్న చేపపిల్లలం…

మీమీ భధ్రమయ జీవితాలలో
మా కంపు సోకనివ్వం
మా పుట్టుక చావులతో
మిమ్మల్నిబ్బంది పెట్టం…

మీ బడ్జెట్ కందని మా
ఖాళీ కడుపు
మీ లోటు లెక్కలనడగదులెండి..

ఇప్పుడెవర్నీ నిందించలేము
కారణాలేవైనా
వత్తిడిగొన్న జీవితాల
గతితప్పిన బతుకు
చిత్రపటాల చిరిగిన
బొమ్మలం…

కానీ
రేపెప్పుడో
మాకూ వెలుగు దొరకదా అని
ఎదురుచూపు…

మాటాడుకుందాం రా…….


మాటాడుకుందాం

రా

మనసువిప్పి నగ్నంగా…

 

కనులలోయలో దాగిన

కలలన్నీ కుప్పబోసి

పూచిక పుల్లాటాడుదామా?

లేక

పాదం అంచున కట్టిన

సైకత ప్రేమమందిరంతో

తాజ్ ని ఓడిద్దామా?

 

రా నేస్తం..

గుండెపై చెవిపెట్టి

అగ్గిపెట్టెల  ఫోన్ లా

దారం గుండా వినబడే

నా లబ్ డబ్ లయను

ఈ కొండ శిఖరాన

నిలబడి లోయంతా

వినపడేట్టు

నీవు ఎలుగెత్తి

గానం చేస్తే

నీతో శృతి కలుపుదామని

ఈ అంచున…….

 

నీ నవ్వుల వెన్నెల

పరచుకున్న

ఈ అడవి పూల

పరిమళం

దిగంతాలు

వ్యాప్తిచెందనీ…

 

నవ్వు నీ ఒక్కడికే

సొంతమైందన్న

ఈర్ష్య నాలో

పోగొట్టేలా

సందమామ

వంగి నీ నుదుట

ముద్దులిడే

ఆ దృశ్యం

గుండె గూటిలో

పదిలం నేస్తం…

 

రా

మాటాడుకుందాం…

నీతో పోటీకి రానా???రివ్వున
రివ్వురివ్వున
అలా ఆలవోకగా
మునివేళ్ళపై
ఆడిన నా పాదాలు
అలా అల అలల
సవ్వడిలో
వర్షపు క్రతువులో
జతగాడి వేలి
చివర ఆసరాతో
నర్తించిన క్షణాలు…

నా చుట్టు
అల్లుకున్న
కలల
ఇంద్ర ధనస్సులోని
రంగులన్నీ
ఒక్కటై
తెల్లని
తెల తెల్లని
కాంతి వర్ణమే
అసూయపడేట్టు
నడయాడిన
నాటి నా
పాదముద్రలు…

నేడిలా
చక్రాల కదలికలకే
పరిమితమై
నా నీడ నన్నే
వెక్కిరించ చూడ…

వెక్కిల్లుగా మిగిలిన
జ్నాపకాల దొంతర
నన్ను వెంటాడగా
ఎదురు నిలిచిన
నీతో పోటీకి రానా…

(dedicated to who challenge the challenges with their will until last breath)

దాహమేస్తోంది..


దాహమేస్తోంది
చల్లని మంచినీళ్ళు తాగాలని వున్నా
ఎక్కడా కాసిన్ని దొరకవే!
పేకట్లలో కొచ్చిన నీళ్ళుతో
ఈ గొంతెండుతోంది..

నీళ్ళను కూడా సరుకుగా చేసిన
బేహారుల మధ్య
అమ్మతనం కోల్పోతూ
దాహమేస్తోంది…

కరచాలనమిచ్చి
గట్టిగా కావలించుకొని
కడుపారా కలబోసుకోవాలనుకుంటే
ఒక్కడు అగుపడడే!
చెవిలో మోగే సెల్తో
ఎన్ని సెకన్లని మాటాడుతావు
ఉన్నావా వుంటే
పర్వాలేదులే మళ్ళీ చేస్తా
అన్న మాటతో
దాహమేస్తోంది…

ఈ చుట్టూ వున్న
ఎడారితనం మధ్య
ఒంటెల బిడారిలా
సాగిపోతూ
దాహమేస్తోంది…

మనకై మనం నిలబడేదెన్నడు?


“Wanting to be someone else is a waste of the person you are.”
Kurt Cobain

ఎప్పుడూ ఎవ్వరి వెంటో నడవడానికి
చూపే ఉత్సాహంకంటే..
నీ కాళ్ళ బలిమి తెలిసి నిన్ను నీవు
గట్టిగా నేలను తన్నిపెట్టి
నిటారుగా వెన్నుపూస
నిలిపి మాట్లాడే మనిషిగా
రూపొందలేవా?

ఎవడో ఒక మాయల మరాఠీ వెనక
వాడి మంత్ర దండపు మాయా శక్తి
లో ఏదో దాగుందన్న ఆతురతతో
పరుగుపెట్టడమే తప్ప
నీ పిడికిట బిగించి గట్టిగా
చేయెత్తి ఎప్పుడైనా విసిరికొట్టావా?

ఎక్కడిదో ఓ చద్దన్నం మూట
రాలిపడదా..
ఈ పూటకు గడిపేయలేనా
అన్న నిస్సత్తువ మూలుగు తప్ప
నీ పొలికేకతో దిగంతాలు పెక్కటిల్లి
భూమి పొరల దాగిన
నీదైన మెతుకు ఉబికి వస్తుందన్న
స్పృహ లేనితనమింకెన్నాళ్ళు?

ఈ బేలతనం వల్లనే
నిన్ను నీవు కబేళా పశువులా
తోలబడుతున్నావన్న గ్రహింపు
ఇంకెన్నాళ్ళకి?

(ఈ నాయకుల వెంట పరుగులెత్తుతున్న గొఱెలమందను జూసి)