కవిత-విలాపం

టెలిగ్రాం..


teligram
టెలిగ్రాం

టెలిగ్రాం సార్
సార్ టెలిగ్రాం

ఈ పిలుపు మరి వినబడదు
అందుకునేందుకు చేతులు వణకవు

శుభమైన అశుభమైనా
ముందుగా గుండె దడ పుట్టే
ఆ పిలుపు మరి వినబడదు

మూడు ఏభై వసంతాలు దాటి
కట్ కటా కట్ కటా కట్
అంటు డాట్ డాష్ లతో
సుదూర తీరాలు కలిపిన
టెలిగ్రాఫ్ తంత్రులు
మూగబోతున్నాయి

దశాబ్ధాల నిరామయ
సేవలకు స్వస్థి

మా జ్నాపకాల
దొంతరల మధ్య ఒదిగిపోతున్న వేళ
చివరి వీడ్కోలు నీకిది
మిత్రమా…

(జూలై 15నుంచి టెలిగ్రాం సేవలను నిలిపివేస్తున్న వార్త చదివి)

ఇది ప్రగతి విరామం..


మనిషి నోట్లోకి ఇంత ముద్ద దిగాలన్న
ఒకే ఒక్క ఆశతో
ఒంటిపై గుడ్డ కానరాకుండా
దప్పికగొన్న గొంతులో ఇన్ని నీళ్ళు కూడా
పోసుకోక ఎగసోప పడుతూ
ఉత్త చేతుల్తోనే ఆశగా లేని కరెంటు తీగల్ని
కలుపుతూ నేలమ్మ కడుపున నాలుగు
గింజలు పండించి నలుగురికీ
అన్నమై తాను తృప్తిగా తేన్చేందుకు
ఆరుగాలం నెత్తుటిని చెమటగా మార్చే
సత్తెకాలపు వాడు
నేడు
కన్నెఱ జేస్తూ తన నాగలి కఱును
గోడకు జారగిలబెట్టి పూన్చిన
ఎద్దులను కట్లు విప్పదీసి
బండి సీలలను ఊడబెరికి
నెత్తిన చుట్టిన తలపాగా విప్పదీసి
నడుముకు చుట్టి
బంద్ చేస్తున్నానింక
అని సమర శంఖారావం
పూన్చిన క్షణం
నువ్వూ నేనూ
మొఖం ఎక్కడ పెట్టుకుందాం??

సుఖమన్నది ఎరుగని
పిచ్చి నాగలి ఆకలిగా నేలపై
మోరజాపి జూస్తుంటే
ఆ నేలపై తిరుగాడే వాళ్ళకు
ఇంక మంచి జరుగుతుందా??

ప్రతిది తూనిక జేసి గాజు గోళాల మధ్య
జరిగే సత్తు వ్యాపార కూడళ్ళలో
నువ్వు ఆబగా నాకే విదేశీ పాచి వాసన
నీ ముక్కు రంధ్రాలకు సోకడం లేదంటే
శాపగ్రస్తుడెవ్వడో బోధపడలేదా??

చిరుగు పాతలే నీ మానాన్ని
కాపాడే ఎరగా నీ కళ్ళముందు తెరలు తెరలుగా
కదలాడుతుంటే నీవమ్మేసిన అమ్మతనం
ఇంక నీకు కానరాలేదంటే ధృతరాష్ట్రుడెవడో
ఎరుకపడలేదా???

బుడబుక్కల వారిలా వేషాలేస్తూ
రోజుకో నెరవేరని హామీల నేతి బీరకాయల్ని
గుప్పిస్తూ కుప్పిగంతులేస్తున్న వాడ్ని చూసి
వాడి ముఖాన ఖాండ్రించి ఉమ్మడానికి కూడా
అసహ్యమేస్తుందన్నది నిజం

ఇది పంటకు విరామం కాదు
జాతి ప్రగతికి విరామం..విలోమం….

సూరీడుకో విన్నపం


దిగులుగాలికి పడుతుంటే
కింద రాలే గింజలకంటే
ఎగిరిపోయే పొల్లు గింజలెక్కువైనాయిరో..

రాలిన గింజలలో
కమురుబారిన గింజలెక్కువాయినాయిరో..

గిడసబారిన గింజ కొనే దిక్కులేక
ఎత్తిపట్టిన పేగుల్తో
ఈ పండగెట్లా పారిపోద్దోరా నాయినా

ఇంటికొచ్చిన కూతురికి
సీర అల్లునికి పండగ కట్నాలుకు
సావుకారు అప్పు తప్పక
ఇంక భోగి కుడుములకు
మినుములేడ తేనని ఏడుస్తున్న
నా ఆడది వొంక సూడలేక
సెరువు గట్టున జేరిన నన్ను
జూసి గుంకిపోతున్న సూరీడు మామా
ఈ పండుగ దినాలల్ల నీతో
ఆ కొండమాటుకు తీసుకుపోవా..

వరదపాలు


బురద బువ్వ

 

 

 

 

 

 

 

 

చేతికంది వచ్చిన కొడుకును

పొట్టన పెట్టుకున్న సుడిగుండమల్లే

ఈ వరద కోత కొచ్చిన పంటను

నీటముంచి రైతు కంట కారే

నెత్తుటి వరదైంది…

 

ఆరుగాలం శ్రమించి

పుస్తెలకూడా  తాకట్టుపెట్టి

పండించిన పంట చేను

ఏపుగా ఎదిగిన ఎన్నుల

వెలుగుతో కనుల నిండుగా

పండిన కార్తీక పున్నమి వెన్నెల

కొండ చాటుకు మళ్ళకముందే

తీరందాటిన జల ప్రళయంతో

అలముకున్న చీకట్లతో

ఎలా ఈ ఏడు గట్టెక్కేదంటూ

బావురుమంటున్న రైతన్న

 

చుట్టూ ఆకాశంలో గిరికీలు కొట్టి పోయిన

ఉత్తుత్తి కిరణాల పొడిపొడి మాటల

హామీలతో మరింత కుంగిన

ఆకుపచ్చ చందమామ

నీకు సాయం ఒట్టి

ఎండమావేనా???