ఆత్మీయత

గొల్లపిల్లాడిని అయ్యా, ఇలపింటివి తప్పవు..


ఈ రోజు దగ్గరి బంధువుల ఇంటికి తప్పక హాజరుకావాల్సిన కార్యానికై ఆటోలో వెల్తుండగా నా పక్కన ఓ పది పన్నెండేల కుఱాడు కూచున్నాడు. నే వెల్తున్న ఊరిలో ఎముకలు విరిగితే కట్టు కట్టే నాటువైద్యుడు చాలా ఫేమస్ మా ప్రాంతంలో. రెండు ముంజేతులకు వీడికి కట్లుండడం చూసి, వాడి చూపులలో నిర్లక్ష్యం, ఒకింత నిర్వేదం కనబడి పలుకరించాను. ఏ వూరు మీదితో మొదలుపెట్టి, ఏం ఘనకార్యం చేసి రెండు విరగ్గొట్టుకున్నావని అడిగాను..

నా ప్రశ్నకు అదే చూపులతో వాడు చెట్టెక్కి పడ్డాను అని చెప్పాడు.

వెంటనే నేను వాడికి బుద్ధి చెప్పేద్దామన్న ఆదుర్ధాతో ‘అదేమి పనిరా, హాయిగా చదువుకోవాల్సిన వయసులో, అలా ఎక్కొచ్చా?’ అని కొంత పెద్దరికం కలగలిపిన గొంతుతో ప్రశ్నించాను.

కానీ సిసింద్రీలా వెంటనే వాడి నోటినుండి ఈ జవాబు ‘గొల్ల పిల్లాడినయ్యా, చెట్టెక్కక పోతే ఎలా? ఇలపింటి దెబ్బలు మాకు తప్పవు’ అని చాలా మామూలుగా చెప్పాడు.

చదువుకోవాల్సిన వయసులో ఇలా గొఱెలు కాయడం ఎందుకు, ఎంతవరకు చదివావని అడిగితే, ఐదో తరగతి వరకు చదివాను, నాకు నాన్న లేడు, తప్పదు మరి ఈ పని అని చెప్పాడు.

దాంతో వాడికి చిన్న వయసులోనే కలిగిన కష్టానికి చాలా బాధ కలిగింది. కులవృత్తి చేయక తప్పని పరిస్థితికి నెట్టపడ్డ వాడి అసహాయతకు జాలేసింది. కానీ చదువుకుంటే నీ భవిష్యత్ బాగుంటుంది, వాళ్ళలో చదువుకున్న నాకు తెలిసిన వాళ్ళ బందువులబ్బాయి గురించి తెలుసా అని మొదలుపెట్టి చెప్పాను. కానీ వాడు ఇవేమీ పట్టవన్నట్లుగా తనకు చేతులు రెండూ బాగైపోతే ఎంత తొందరగా మరల కాపుకు పోతానా అన్న ధ్యాసే వాడి చివరి చూపులో కూడా కనబడింది..

బతుకు పోరాటంలోకి తొందరగా దూకిన వాడి ధైర్యానికి అభినందించాలో, తప్పనిసరైన ఈ జీవన వేదానికి దారితీసిన వైనానికి జాలిపడాలో, ఇటువంటి పిల్లలకు ఎన్ని పథకాలు వున్నా కుటుంబ పరిస్థితులు, ఆర్థిక తారతమ్యాల వలన వారి బతుకులు ఎప్పటికీ మెరుగుపడని విధానాలను తిట్టుకోవాలో తెలియని డోలాయమానానికి గురయ్యాను.

‘ఏంపిల్లడో’ వంగపండుతో టీ తాగిన వేళ..


ఉత్తరాంధ్ర గొంతు


విప్లవకవి వంగపండు ప్రసాదు ఈ పేరు గత నలభై ఏళ్ళుగా ఆంధ్ర దేశాన వినిపిస్తూనే వుంది. ఆయన రాసిన పాటలు, భూమిభాగోతం నాటకం జనంలో కలగలిసిపోయాయి. ఉత్తరాంధ్రలో బుగతల దోపిడీ ఎలా కొనసాగిందో, దానికి గ్రామ కరణం, మునసబులు ఎలా తోడ్పడేవారో, వారికి వత్తాసుగా పోలీసులెలా లాఠీలు ఝలిపించేవారో కళ్ళకు కట్టినట్లు చూపించడంతో భూమిభాగోతం ఉత్తరాంధ్రనే కాక యావత్ తెలుగుదేశాన ఒక ఊపు ఊపింది ఆ రోజుల్లో. ఆయన రాసిన ఏంపిల్లడో ఎల్దమొస్తవా పాట యువకులను ఎంతో ఉత్తేజితులను చేసింది. అలాగే ఆయన డాక్ యార్డ్ లో పనిచేస్తూ తానెరిగిన కార్మిక జీవితాలనుండి పొందిన ప్రేరణతో రాసిన యంత్రమెట్లా నడుస్తు వున్నదో పాట కార్మికుల శ్రమను కళ్ళకు కడుతుంది. అలాగే ఊరిచివర మాలపేట అన్న పాట తొలి దళిత విప్లవ గీతంగా చెప్పవచ్చు.

అనుకోకుండా మేమిద్దరం ఈ రోజు తాను సైకిల్ పై వెళుతుండగా పలకరించడంతో కలుసుకున్నాం. చాలా రోజులుగా ఆయన ప్రత్యేక ఉత్తరాంధ్ర సాధనకు తన వంతు కృషిలో భాగంగా ధబేళ్ దుబేళ్ కార్యక్రమాలతో బిజీ అయి కలవడం కుదరలేదు. అలాగే ఆ మధ్య తాను వై.యెస్.మరణానంతరం ఏంపిల్లడో పాట శైలిలో ఆయన గురించి పాట రాసి సాక్షి టీవీలో వినిపించడంతో ఎదుర్కొన్న విమర్శలు, ఆ తరువాత నుండి ఆయన కొంత నాకు మానసికంగా దూరమయ్యారు. ఇవి వంగపండు జీవితంలో మొదటినుండి వున్నాయి. అంతా సినిమాలకు రాయకూడదనుకున్నప్పుడు ఆయన రాసి విమర్శలకు గురయ్యారు. అలాగే మగధీర సినిమాలో వాళ్ళు తన పాట చరణాలు వాడుకున్నందుకు నిరసన తెలిపి ఏదో మొత్తం పుచ్చుకొన్నాడని అనుకున్నారంతా. అయినా వంగపండు తన జీవన శైలినుండి దూరం కాలేదు. ఆయన ఆర్థికంగా పడ్డ ఇబ్బందులు ప్రత్యక్షంగా ఎరిగిన నాకు, వాటి ఒడిదుడుకుల వలన, కుటుంబ వత్తిడులకు లోనయి కొంతమేర ఆయన అటూ ఇటూ అయిన కాలం ఈ మధ్యనే. అయినా దాని ప్రభావం తన నడవడికపై ఎక్కడా కనపడదు.

చాలామందికి మల్లే విప్లవం పేరుచెప్పి లాభాలార్జించే మనిషంటే ఇక్కడ నమ్మరెవరూ. ఎందుకంటే ఆయన మాముందు ఏదీ దాచుకున్నది లేదు. తన పిల్లలచే మాత్రం ఎప్పుడూ చీకొట్టబడుతూ వుంటారు. తమను చిన్నతనంలో పట్టించుకోలేదని, పాటలు పాడుతూ తాను ఉద్యమాలలో వుండి తమను సరిగా చూడలేదని, వీటిలో వున్న చాలామంది తమ జీవితాలను సాఫీగానే సాగిస్తున్నారన్న వారి మాటలు కొంత నిజాలుగా కనిపించినా ఆయనకు తన పిల్లలంటే చాలా ప్రేమ. పెద్ద వాడు ఇప్పటికీ సరిగా జీవితంలో కుదుటపడలేదని బాధపడుతుంటాడు. కూతురు ఉష తానెలా వుంటానంటే అలా వుండమన్న స్వేచ్చ నిచ్చారు. ఆమె ఎంచుకున్న జీవితాన్ని తానెప్పుడూ అడ్డుచెప్పలేదు. చిన్న వాడు దుష్యంత్ కు చదువు చెప్పడానికి తన భూమిని తనఖాపెట్టి చదివించారు. ఆయనిప్పుడు హైస్కూలు టీచరయ్యడు ఈ మధ్య డిఎస్సీలో. అయినా ఆయనకు తండ్రి పట్ల తీవ్ర వ్యతిరేకత. తమకు ఆర్థికంగా ఇంకా బతికేందుకు తోడ్పడలేదని, ఉద్యమంతో మమేకమై డాక్ యార్డ్ లోని ఉద్యోగం రాజీనామా చేయడాన్ని తప్పుపడుతుంటాడు. అయినా వారికెవరికీ లోటు రానీయలేదు. వారివి గొంతెమ్మకోర్కెలు. వాటినే తీర్చడం తన ధ్యేయంగా పెట్టుకుంటే మనమీనాడు వంగపండు గురించి మాటాడేదే వుండదు. ఓ పక్క తమ తండ్రిని గొప్పకవి అంటూ పొగుడుతూ తిడుతుంటారు పిల్లలు. ఇది ప్రజల జీవితంలో మమేకమైన వాళ్లకు తప్పని స్థితే..

ఇప్పటికీ ఆయన గోచి బిగించి గొంగడి వేసుకొని పాడుతూనే వున్నారు. అది విప్లవ గీతమే కావచ్చు ఉత్తరాంధ్ర జాలరి పాటే కావచ్చు. చితికిన బతుకులను పాట కట్టి కనులముందుంచగల సత్తా తనలో ఇంకా వుందని, తన వారసత్వాన్ని తెలంగాణా బిడ్డలందుకున్నంతగా తన నేల నుంచి ఎవరూ రాకపోవడం బాధాకరమంటుంటారు.

తాను ఇటీవల రాసిన తొమ్మిది పాటలతో ఒక సీడీ ని రూపొందించానని, దాని ఆవిష్కరణకు తాను బావగా పిలిచే గద్దర్, గోరటి వెంకన్న, ఆర్.నారాయణమూర్తి వస్తున్నారని, విశాఖ ఆర్ కే బీచ్ లో నవంబరు 7 వ తేదీ సాయంత్రం కార్యక్రమం అనుకుంటున్నామని చెప్పారు. గోరటి ప్రస్తుతం లండన్ వెళ్ళాడంటూ ఫోన్ చేస్తే నీ పాటనందుకున్న మేము ఇలా విదేశాలలో తిరుగుతున్నా నువ్వింకా మీ నేలమీదే వున్నావన్నారంట. ఆ విషయం గర్వంగా చెప్తూ మనకెందుకు బ్రదర్ అలాపింటి ఆశలు. మనం మన జనంతో కలిసి వుండడమే నాకు గొప్ప అన్న ఆయన మాటలు ఆయనలోని నిరాడంబరత్వాన్ని తెలియజేసాయి.

ఆయన చాలా భోళా మనిషి. ఎవరైనా వంగపండు గారూ అని పలకరిస్తే చాలు తన పాట తనకు తెచ్చిన గుర్తింపు అంటూ మురిసిపోతారు. తాను ప్రత్యేకించి సిద్ధాంతాలు, వ్యాకరణాలు చదవలేదంటారెప్పుడూ. తాను పుట్టిపెరిగిన పల్లె వాతావరణం, చిన్నప్పటినుండి తాననుభవించిన, ఎరిగిన జీవితాన్ని, ప్రత్యక్షంగా చూస్తున్న జనజీవన వైవిధ్యాన్ని తన పాటలద్వారా వెలుగులోకి తెస్తున్నానంటారు. ఉత్తరాంధ్ర జానపదంలోని నుడికారాన్ని పట్టుకున్న వంగపండు తన పాటలలోని యాసలోని స్వచ్చత మల్లే తనతో మాటాడితే ఆ అమాయకత్వం, స్పందన ఎరుకై మనం కూడా ఆయన పాటకు గొంతు కలుపుతాం…

ఇలా ఈ మనిషి ఇప్పటికీ తాను నమ్మిన దానికి తన 66 సం.ల వయసులో కూడా ఉత్సాహంగా రోడ్డుపై చిందేస్తున్న తన ఆరోగ్యానికి తానే సంబరపడిపోతుంటాడు.

టీ తాగినంతసేపూ తన చుట్టూ పలకరింపులే..
ఆయన సెల్ నెం.9441305889

ఆయన గొంతులో వినండి ఏంపిల్లడో ఎల్దమొస్తవా..

రేపేమీ జరగకూడదు ప్రభూ…
మాకు ఎవరూ సుద్ధులు చెప్పొద్దు ప్రభూ..
ఎవరికి వారు మా వెన్నులో
పొడుస్తూనే వున్నారు ప్రభూ..
గాయాలు ఇంకా సలపరం పెడుతూనే వున్నాయి ప్రభూ..

అమ్మను కోల్పోయి
నాన్నను పోగొట్టుకొని
బిడ్డను అవిటివాణ్ణి చేసి
కన్న పేగులు తెంచిన
కత్తి మొనపై ఇంకా రక్తపు బొట్టు
కారుతూనే వుంది ప్రభూ..

ఇంకా మా సహనాన్ని పరీక్షించొద్దురా…
సమ్మతమే మన మతంరా..

కాషాయం పచ్చదనం మధ్యనున్న
తెలుపును మర్చిపోయారురా?
ఆ తెలుపు ధగ ధగలలో
మన కీర్తి పతాకను
ఎత్తి పడదాంరా..

(అయోధ్యపై వెలువడనున్న తీర్పు నేపథ్యంలో సామాన్యులు బలిగాకూడదని మనమంతా ముందుగా భారతీయులమనే గుర్తింపుతో అంతా కలసి నిలబడదామనే తీవ్ర ఆకాంక్షతో..)

తల్లీ నీకు వందనం..రాజస్తాన్ లోని ఓ కుగ్రామంలో కుక్కల దాడిలో జింక తల్లి చనిపోతే ఈ జింక పిల్ల ఒంటరిదైన క్షణాన దానిని అక్కున చేర్చుకొని సాకిన ఈ తల్లి ప్రేమకు వందనాలు తెలుపుదాం..

ఈ ఫోటోను తీసినది విజయ్ బేడీ అనే ఫోటోగ్రాఫర్. బేడీ సోదరులకు ఫోటోగ్రఫీలో గ్రీన్ ఆస్కార్ వచ్చింది.

source:http://news.rediff.com/slide-show/2010/aug/17/slide-show-1-capturing-the-big-picture.htm#contentTop

తెలుగోణ్ణి గెలుపిద్దాం..INDIAN IDOL PROGRAMME లో Final కు చేరిన తెలుగు గాయకుడు శ్రీరామ చంద్ర ను గెలిపించుటకు SMS ల ద్వారా సహకరించమని వారి కుటుంబం TV9 లో ఇదే సమయంలో request చేస్తున్నారు. క్రిందటి ఎపిసోడ్ లో శంకర్ మహదేవన్ ముందు breathless song పాడి మెప్పించిన శ్రీరాం ను మనమూ SMS ల ద్వారా గెలిపించడం ద్వారా ఒక ఉత్తరాది వారి సంగీత కార్యక్రమంలో మన తెలుగు వాడిని గెలిపించే అవకాశాన్ని వినియోగించుకొని మన శ్రీరాం ను గెలిపించుటకు అందరికీ విజ్నప్తి చేస్తున్నా.

ఇందుకు మనం చేయాల్సింది SREERAM ఆని Type చేసి 52525 కి SMS చేయడమే. చేస్తారు కదూ..

నాన్న గుండె ఆగింది..


చిన్నారి తన చిట్టి పాదాలతో

గుండెలపై ఆడిన క్షణాలు గుర్తొచ్చి

ఒక నాన్న గుండె ఆగింది


తనకు తినిపించిన గోరుముద్దలలోని

ఎంగిలి మెతుకు తీయదనం గుర్తొచ్చి

ఒక నాన్న గుండె ఆగింది…


తన నునులేత నుదుటిపై

పెట్టిన ఆత్మీయ ముద్దు గుర్తొచ్చి

ఒక నాన్న గుండె ఆగింది…


బాయిలర్ లోంచి డాడీ డాడీ అన్న

ఆర్తనాదం వినిపించి

ఒక నాన్న గుండె ఆగింది…