ఆకాంక్ష-తెలంగాణా

ఎనిమిదో అధ్యాయం అమలు..


శ్రీ క్రిష్ణ కమిటీ రూపొందించిన ఎనిమిదో అధ్యాయాన్ని అమలు చేస్తున్నట్టుంది కేంద్రం..చర్చలు, చర్చోప చర్చలు పేరుతో కాలయాపన చేస్తూ ప్రజల గోడు పట్టకుండా తమ రాజకీయ దళారీతనన్నీ చూపుతోంది పాలకవర్గం. మేనేజ్ చేయడమే మేలన్నట్టు విడి విడి గౄపులుగా రమ్మనడంలో ఆంతర్యమిదే.. వారి వారి బయోడేటాలతో గట్టిగా వార్నింగ్ లిచ్చే కార్యక్రమం చేయడానికి కాకపోతే వీళ్ళ గోస వినేదెవ్వరు. వాళ్ళ దృష్టిలో వీళ్ళసలు ఏమీ కారు… ఊరికే జనాలను మభ్యపెట్టి కాల యాపన చేయడానికె చేస్తున్న ప్రయత్నాలివి. కావున తెలంగాణా ప్రజలు జాగరూకతతో వుండాలి. యువకులు నిరాశకు గురి కాకుండా వత్తిడికి తాము లోను కాకుండా నాయకులను వత్తిడి చేసే కార్యక్రమాలతో ముందుకు రావాలి. నాయకులలో విభేదాలకు కృషి చేస్తూ ఉద్యమాన్ని దెబ్బకొట్టే ప్రయత్నాలను అడ్డుకోవాలి. జరబద్రం తమ్మీ..

పెద బేరగాడు…


బేరగాడు

ఈ ప్రస్థానం ఎటు వైపు..
T.కాంగ్రెస్ వాళ్ళంతా కుయ్యో మొఱో అంటూ వుంటే పదిహేను రోజుల్లో తెలంగాణా ఇచ్చేస్తారని సంకేతాలొచ్చాయంటాడు ఈ నాయకుడు…ఈయనకేమైనా ప్రత్యేక రాడార్ వుందా?
సోనియా చిదంబరంలతో ఎంత కుదిరిందో బేరం కానీ రాజుకున్న అగ్గిపై నీళ్ళు చల్లడానికి వెంటనే సిగ్గు ఎగ్గులేకుండా తయారై పోయాడు. ఏదో ఒక నిర్ణయం వెలువడే సమయంలో యిలా చేస్తూ పబ్బం గడుపుకుంటున్న ఇటువంటి నాయకుల
పబ్లిక్ నిలదీయాలి…

జర భద్రం తమ్ముళ్ళూ…

ను

వార్తకు ఆధారంః

తెలంగాణా యాగం?


తెలంగాణా కోసం శత చండీ యాగం చేస్తున్నానని కె.సి.ఆర్. ప్రకటన్ ప్రజలను తప్పుదోవపట్టించడానికేనన్నది సుస్పష్టం. తనకున్న నమ్మకాలని ఏదో విధంగా కాష్ చేసుకోవాలనుకునే ఇలాంటి వారిని ప్రజలు ఇంకెంతో కాలం భరించలేరు. కాకపోతే తన కుటుంబ సభ్యులతో కలిసి చేస్తున్న దానిని తెలంగాణాకు ముడిపెట్టి చేయడం ఖండించాలి..

ఉద్యమం ద్వారానే సాధ్యమవుతుందన్న విషయాన్ని పక్కన పెట్టి మిలియన్ మార్చ్ నుండి పక్కకు తప్పుకొని, సోనియాకు భజన చేయడం మొదలుపెట్టి, మౌనం దాల్చిన ఈయన ఈ విధమైన ప్రచారార్భాటాలకు పాల్పడడం దారుణం..

రాజకీయ పార్టీలు సెక్యులర్ గా కనీసం అగుపించాల్సిన అవసరాన్ని కూడా గుర్తించలేనితనాన్ని అంతా ఖండించాలి. ఈ యాగపు ఖర్చును తన సొంత అకౌంట్ లో జమ చేయాలి..

ప్రజా ఉద్యమాలను తప్పుదోవ పట్టించే ఇలాంటి నాయకులను ఖచ్చితంగా నిలదీయాలి…

సర్కారీ దిగ్బంధం


తెలంగాణా జెఏసీ ఈ రోజు తలపెట్టిన మిలియన్ మార్చ్ ను అడ్డుకునే క్రమంలో సర్కారే రైళ్ళను, బస్సులను, రవాణా సౌకర్యాలను ముందుగానే ఆపివేసి రాజధానిలో బంద్ పాటిస్తోంది. ఇంక ప్రత్యేకంగా దిగ్బంధనం చేయాల్సిన అవసరమేముంది. ప్రజలు శాంతియుతంగా ఉద్యమిస్తామని చెపుతున్నా సర్కార్ లేనిపోని అపోహలను సృష్టించి ప్రజల జీవనాన్ని గతకొంతకాలంగా అతలాకుతలం చేస్తోంది.

పరీక్షలను గతంలో కంటే  15 రోజులు ముందుగా నిర్వహించ తలపెట్టడంలో కార్పొరేట్ కాలేజీల కుట్ర దాగి వుండడం నిజం కాదా? సిలబస్ ను పాడేసి EAMCET కోసం ప్రత్యేక క్లాసులు నిర్వహించుకోవడం కోసం ఈ కాలేజీ యాజమాన్యాలతో కుమ్మక్కై ఈ విధంగా పరీక్షలు, విద్యార్థుల పేరుతో మార్చ్ ను అడ్డుకోవడం, విద్యార్థులను కూడా ఉదయాన్నే పరీక్షా కేంద్రాలకు చేరుకోమని బలవంత పెట్టడం ఇంత వత్తిడి మధ్య వారేమి పరీక్షలు రాస్తారు. బట్టీ గాళ్ళగా మారిన విద్యార్థిలోకం ఎటూ పాలుపోక బిక్కమొగం వేస్తోంది. గతంలో ఏదో ఒక సాకుతో పరీక్షలు వాయిదా వేసే సర్కారు పట్టుదలకు పోయి ఈ విధంగా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు లోను చేస్తోంది.

ఇంక తెలంగాణా అంతటా అమలు  చేస్తున్న రెడ్ ఎలర్ట్, తీవ్ర నిర్బంధం తప్పక ఏదో ఒక రోజు తగిన మూల్యాన్ని చెల్లించక తప్పదు. వేలాది మంది సాయుధ పోలీసుల పహరాలో సర్కారే తనను తాను నిర్బంధించుకుంటున్న ఈ దిగ్బంధాన్ని ప్రజలే బద్దలుకొట్టాలి…

పందులపెంపకంతో కంపుకొడుతున్న మీడియా..


గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై మీడియాలో వార్తలు రాకుండా కట్టడి చేస్తున్నారంటే ఏదో జరుగుతున్నట్లే కదా? అన్ని చానళ్ళు డిడి శాంతి స్వరూప్ లా మారిపోయాయి. పోలీసు బాసులు చెప్పిందే చూపుతున్నారు తప్ప కనీసం జర్నలిజం ధీరోదాత్తత చూపడంలేదు. అంటే వీళ్ళదంతా వ్యాపార జర్నలిజమే నన్నమాట. ఇరాక్ యుద్ధంలోను, పాలస్తీనాలో జరుగుతున్న దాడులను, ఆఖరికి ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాల చిత్రాలను, వార్తా విశేషాలను సేకరించే ధైర్యం గల జర్నలిస్టులు, ప్రసారం చేసే చానళ్ళున్నాయి. కానీ రియలెస్టేట్ వ్యాపారాలు, చిట్టా వ్యాపారాలు, పచ్చళ్ళ వ్యాపారాలతొ కడుపునిండిపోయిన నేటి మన మీడియాకు పోలీసు జ్వరం పట్టుకున్నట్లుంది. ఎంతసేపూ పట్టుచీరఎలా నేస్తారో నేర్పే NTV వాడు, జీవపరిణామంతో TV 9 వాడు, ఇలా తలా ఒక పందుల పెంపకం కార్యక్రమాలతో ఎంజాయ్ చేస్తున్నారు. లేకపోతే మేమింత వీరులం, మగధీరులం, ఇలా ఎక్కపొడిచినందుకు ఈ అవార్డ్ అని చూపించుకున్న వారు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు. మీడియా ప్రజల పక్షం వహించాలి. అంతేకానీ ప్రభుత్వం వద్దంటే మానేస్తే అది జర్నలిజం ఎలా అవుతుంది? వీళ్ళని చూడాల్సిన అవసరమేముంది. మూసేయండ్రా మీ చానళ్ళ వ్యాపారం.

రెండు నాల్కల ధోరణిని ఖండించాలి..


జనవరి ఐదు మీటింగునకు పార్టీలనుండి ఇద్దరేసి నాయకులను ఆహ్వానించడంలోనే కేంద్ర ప్రభుత్వ కుట్రపూరిత ధోరణి తెలుస్తోంది.

శ్రీక్రిష్ణ కమిటీ పేరుతో వచ్చిన బృందం అన్ని ప్రాంతాల అభిప్రాయాలు సేకరిస్తామన్నారు కానీ ఎంచుకున్న ప్రాంతాలకే పరిమితమైపోయారు. ఈ బృందం ప్రచారానికిచ్చిన ప్రియారిటీ ప్రజల అభిప్రాయాలకిచ్చినట్లుగా లేదు. ఎప్పుడూ మీడియాముందు ఏదో ఒక వివాదాస్పద అంశాన్ని ప్రస్తావిస్తూనే వచ్చారు. ఇందులో దుగ్గల్ చాలా ముందున్నారు. ఇంతవరకు ఏర్పాటైన ఏ కమిటీలు ఇలా మీడియా ముందు ఫోజులివ్వలేదు. పనయిన తరువాత నివేదిక సమర్పించే ముందు చెప్పేవారు. ఇది కూడా ఒక ఎత్తుగడగానే చేసినట్లున్నారు. ఎందుకంటే ఆంధ్రులు ఆరంభశూరులని వీళ్ళకి బాగా చెప్పినట్టున్నారు తమిళ తంబి.

అలాగే రాజకీయ పార్టీలన్నీ ఇరు ప్రాంతాలుగా విడిపోయి తమ తమ అభిప్రాయాలను తెలియజేసాయి. ఈ ఎడబాటును అర్థం చేసుకుంటే చాలు. అలాగే ప్రధాన రాజకీయ పక్షాలైన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల అధినాయకత్వం తమ అభిప్రాయాలను కమిటీకి సమర్పించలేదు. దీనిని కూడా పట్టించుకోలేదు. మరి ఇద్దరేసి నాయకులను ఆహ్వానించడమంటే మరల రెండు అభిప్రాయల మధ్య సఖ్యత ఎలా కుదురుతుంది. అలా కాకుండా ప్రతి పార్టీ అధ్యక్షుల అభిప్రాయాలనే తీసుకుంటామంటే ఆయా పార్టీల వైఖరి తేట తెల్లమవుతుంది. సమస్య అటో ఇటో తేలిపోతుంది. అది వదిలేసి ఈ రెండు నాల్కల ధోరణి వలన సమస్య మరింత జఠిలమవుతుందన్నది అక్షర సత్యం.

డిసెంబర్ 31???డిసెంబర్ 31 తర్వాత ఏమవుతుందోనని అంతా ఉత్కంఠ..

అటు లీకవుతున్న శ్రీక్రిష్ణ కమిటీ ఉద్దేశ్యాలు, గవర్నర్ గారి ఉత్సాహం జనాన్ని అయోమయానికి, ఆందోళనకి గురిచేస్తున్నాయి..

విద్యార్థిలోకం భవిష్యత్ ఏమవుతుందోనని తల్లిదండ్రుల భయం..
పరీక్షలు సజావుగా జరుగుతాయా అని ఉత్కంఠ… కేంపస్ కౌన్సిలింగ్ మిస్ అవుతారేమో పిల్లలని ఒకటే దడ…

అసలు ఉద్యమాలే వద్దు, రాజకీయాలు అవసరంలేదన్న వాదన ఓ వైపు, తమ భవిష్యత్ తెలంగాణాతోనే ముడిపడి వున్నదన్న వాదన బలంగా వినిపించిన విద్యార్థి నాయకత్వం ఓ వైపు..

మేము పెట్టుకున్న ఇంజినీరింగ్ కాలేజీ సీట్లు మిగిలి పోయిన దానికి తెలంగాణా ఉద్యమమే కారణమని యాజమాన్యాలు – అసలు మీ కాలేజీలలో లేని సౌకర్యాలు, విద్యార్థుల కంటే సీట్లెక్కువైనందునే మిగిలాయన్న వాదం ఈ వైపు…

ప్రభుత్వ యాజమాన్యాలలోని స్కూల్లు, కాలేజీల విద్యార్థులే వీటికి కారణమంటూ వారిని, వారి ఉద్యమాన్ని, నిబద్ధతను తక్కువంచనా వేసే వారికి గట్టి సమాధానమే దొరికింది..

కార్పొరేట్ కాలేజీల చదువుతో మొత్తం విద్యనే అందని ద్రాక్ష చేసి, వ్యాపారం చేస్తున్న వారు పిల్లల భవిష్యత్ గూర్చి మాటాడడం విడ్డూరం… బడుగు బలహీన వర్గాల వారి పట్ల వారికున్న చిన్న చూపు ఇక్కడ ప్రస్ఫుటమయ్యింది…

ఉద్యమం, తమ భవిష్యత్ ను కలగలుపుకుంటూ ముందుకు పోతున్నామన్న వారి దృఢ సంకల్పం ముందు వీరి వాదనలన్నీ తాటాకు చప్పులయ్యాయి. సమాజ మార్పు కోరే వారెవరైనా తప్పక ఆహ్వానించాల్సిన అవసరముంది. కెరీర్ ఒక్కటే కొలమానమైన నేటి వ్యాపార విద్య వలన నష్టమే ఎక్కువన్నది స్పష్టమైంది.. ఏమైనా వారికి అభినందనలు తెలియజేయకుండా ఉండలేము.

డిసెంబర్ 31 చావుగీతను చూపి భయపెట్టాలనుకోవడం మూర్ఖత్వం. అదే ఆఖరి అంకం కాదు. కాదు కూడా..

వాయిదాలు, మోసాలు వారికి కొత్త కాదు. అసలు ఈ కమిటీకి ఏ చట్టబద్ధతా లేదన్నది అందరికీ తెలిసినదే.. వీళ్ళిచ్చే సూచనలు, సలహాలు తెలియనివేమీ కాదు.

ఒక పక్క కావాలంటే అదనపు బలగాలను పంపుతామన్న కేంద్ర గృహమంత్రి గారు ఇప్పటికే తన మనసులోని మాటను బయటపెట్టారు. కావున 31 తరువాత వారు తెచ్చే కొత్త వెలుగులేమీ వుండవు. భూకంపాలేమీ రావు. ఉగ్గబట్టుకున్న సహనానికి పరీక్ష మొదలవుతుంది.. అంతే…

ఈ ఉద్యమం వలన సమాజ నాయకత్వానికి కొత్త నెత్తురందింది.. ఇంకా బలమైన రూపం తీసుకొని ఓ గుణాత్మక మార్పుకు పునాది కావాలన్నది ఆకాంక్ష..
(ఈ రోజు ABN ఆంధ్రజ్యోతిలో Open Debate programme చూసి)

పుట్టినూరు సొంతూరు కాదా?


ఇటీవల తెరాస నేత కె.సి.ఆర్. తెలంగాణాలో పుట్టిన వాళ్ళంతా తెలంగాణా వాళ్ళే అన్నదానిపై రాద్ధాంతం జరుగుతోంది. అయినా మన జన్మస్థల ధృవీకరణ పత్రం మనం పుట్టిన వూరి నుంచే కదా తీసుకుంటాం. మరి దీనిపై ఇంత గోల దేనికో?

ముల్కీ నిబంధనలను దొంగ సర్టిఫికేట్లతో వాడుకుంటారని ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ సర్టిఫికేట్లు ఇచ్చేది మరి ఆ ప్రాంత అధికారులే కదా? వాళ్ళకు చిత్తశుధ్ధి లేదని అనుమానమా? దొంగ సర్టిఫికేట్ల సృష్టి ఎప్పుడూ వున్నదే. దానిని నిలువరించే కృషి వైపు ఆలోచించాలి కానీ ఆ ప్రాంతంలో పుట్టిన వాడికి అక్కడ నివాసముండే హక్కు లేదనడం ఫాసిజమే అవుతుంది కదా? అయినా దోచుకునే వాడికి కుల, మత, ప్రాంతీయ విభేదాలుంటాయా? ఆలోచించండి!
ఈ పాట విందాం..
నా జన్మభూమి

శవాలపై గుడ్డలేరుతున్న రాజకీయ రక్కసులు


తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోరుతూ సుమారు 400 మందికి పైగా యువతీ యువకులు ఆత్మార్పణం చేస్తే కళ్ళుతెరిచిన కేంద్రం తెలంగాణా ఏర్పాటు ప్రక్రియ మొదలైందన్న ప్రకటనతో మొదలు పెట్టి శ్రీ క్రిష్ణ కమిటీ వరకు అన్ని దగాకోరు నిర్ణయాలు ప్రకటిస్తూ, రోజూ ఏదో ఒక ఆలవోక ప్రకటనలతో వారి గుండెల్లో గునపాలు దించడంలో అన్ని రాజకీయ పక్షాలు తలా ఒక చేయివేసాయి. ప్రధాన పక్షాల అధినేతలు మాత్రం కమిటీకు ఏమీ చెప్పక ఒకడు మేమే కదా ఇచ్చేది చచ్చేది అని ప్రగల్భాలు పలుకుతుంటే, ఇస్తే వొద్దమని ఇంకోడు సన్నాయి నొక్కులు నొక్కుతూన్నాడు. ఈ లోపుగా రాజీనామాలు చేసిన స్థానాలలో పోటీకి మేమంటే మేం సై అని నిస్సిగ్గుగా ముందుకు వచ్చిన వీళ్ళకు నిజంగా తెలంగాణా ప్రజల పట్ల అభిమానముందా? వారి భావోద్రేకాలను సొమ్ము చేసుకొనడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. భారీ విగ్రహ దళసరి నాలుక నాయకుడు గెలిస్తే నేనే సి.ఎం.అయి తెలంగాణా ఇచ్చేస్తానని కదల్లేక కదుల్తూ జనాన్ని విసిగిస్తున్నాడు. మరల వీళ్ళ నల్లడబ్బు, అధికార ప్రభావం పారించి ఎలాగైనా ఎన్నికల్లో గెలిచే ఏర్పాట్లు చేసుకుంటున్న ఈ మోసకారి నాయకులను ఎండగట్టాలంటే అసలు ప్రజలు తమకున్న ఒకే ఒక అస్త్రం స్వచ్చందంగా ఈ ఎన్నికలను బహిష్కరించడమే. అదే నిజమైన తెలంగాణా స్ఫూర్తి. ఎన్నిమార్లు ఎన్నికలలో పాల్గొన్నా దాని ప్రభావం ఒట్టిపోతున్న వేళ మాకొద్దీ కుట్రపూరిత, దగాకోరు, దగుల్భాజీ ఎన్నికలని, శవ రాజకీయాలని ప్రజలు విస్పష్టంగా ప్రకటించిన వేళ ఈ కాగితప్పులుల మేకపోతు గాంభీర్యాలు పటాపంచలై దిగి వస్తారు.అదే ఆత్మార్పణ చేసిన అమరులకు నిజమైన నివాళి…

కాదంటారా?


ప్రతిపాదనే తమవద్ద లేనప్పుడు కమిటీ ఎందుకు సారూ?


ఈ రోజు నాలుగేళ్ళ తరువాత మన ప్రధాన మంత్రిగారు విలేకరుల సమావేశంలో మాటాడారు. ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదనలేవీ తమ వద్ద లేవని, తెలంగాణ విషయంలో శ్రీక్రిష్ణ కమిటే నివేదిక వచ్చాక స్పందిస్తానని సెలవిచ్చారు.

మరి తమ గృహమంత్రిగారి డిసెంబరు 9 నాటి ప్రకటనలో మీ భాగస్వామ్యం లేదా సార్?

రాష్ట్రం తీవ్ర అలజడికి గురికాబడి, యిరువైపులా అగ్గిరాజేసిన పాపం ఎవరిది సార్?

300 మందికి పైగా యువకులు తమ ఆత్మ బలిదానాలకు మీరిచ్చిన విలువ యిదేనా?

ఏమాశించి ఈ నిప్పుల కొలిమిని అంటించారు సార్?

మీ రాజకీయ చదరంగంలో బలయ్యేది క్రొన్నెత్తురు పారే యువకులే కదా?

వై.ఎస్.హవాను తగ్గించడానికి కేంద్రం ఆడిన నాటకమా?

తెలంగాణా అట్టుడికిన సమయాన మీరు తెరచాటు నుండి మరల ఈ రోజు యిలా చిలుక పలుకులు పలికారంటే, ప్రస్తుతమున్న స్తబ్ధత మిమ్మల్నిలా మాటాడించే ధైర్యాన్నిచ్చిందన్న మాట. మీ కేబినెట్ లో రెండో స్థానంలో వున్న మీ సహచరుడు చిదంబరం రగిల్చిన చిచ్చు కు ఆహుతైన లేలేత స్వప్నాలకు ఎవరు బదులిస్తారు?

యిది ప్రజలను వంచించే కార్యక్రమమే…