రోజు: 25/06/2011

పోగాలం దగ్గరబడిందిరా…(పెట్రో ధరలకు నిరసనగా)


ఈళ్ళ సేతులల్ల బెమ్మెజెముడు మొలిసియ్య
ఈళ్ళ బుఱలో పాములు పెరుగుతున్నాయా
జెనాలు ఎలా బతుకీడుస్తున్నారో
ఎలా గోసబెడుతున్నారో
ఏ ఒక్కడికైనా యాదిలో వుందా..
ఈళ్ళ జీతాల్ గీతాల్ పెంచుకు పోతూ
పేదోడి పొట్ట గొట్ట సూస్తున్నారు కదయ్యా…

ఎక్కడా ఎండు కఱ పుల్లైనా దొరక్క
ఎలుగు గ్రూపుల్లో జేరి గొనుక్కున్న
గాస్ పొయ్యి యింక మా నెత్తిన బెట్టుకూరేగాలా?
ఆ ముద్ద వొండుకు తిండానికి కూడా
ఈలు లేకుండా యింత బరువు నెత్తితే
మీ నెత్తిన ఈ బండతో మోదాలిరా…

మీరిచ్చే మూడు గంటల పాటి కరెంటు కూడా ఎలగక
బుడ్డి దీపం ఎలిగించుకుందామన్నా
నువ్విచ్చే రేషన్ దుకాణంలోని
ఆ అర లీటరు కిరోసిన్ నీ కాష్టంలో పోద్దామంతే
మరల పెంచి జచ్చినావు కదరా?

ఈ జేత్తో కూల్డబ్బులిచ్చి
ఆ జేత్తో కొల్లగొట్టేస్తే మేమింక
ఏం దిని బతకాల?
ఏం దిని జావాల?

అటు యిత్తనాలు దొరక్క
ఎరువులు దొరక్క నారు పొయ్యనేక
ఒకైపు ఏడుస్తుంటే
ఈ అర్థరాత్రి ఈ సావు కబురొకటి…
మీ యింట్లో పీనుగెల్ల… 

మీకు పోగాలం దగ్గర పడుతోందిరా..