రాష్ట్రంలో గత నెలరోజులుగా కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె పట్ల ప్రభుత్వం రక రకాల వ్యాఖ్యానాలు చేస్తూ వైద్య విద్యార్థుల పట్ల ద్వేష భావాన్ని పెంపొందింప జేయడమే తప్ప వారి డిమాండ్ల పట్ల సముచిత వైఖరిని అవలంబించి సమస్య పరిష్కారానికి కృషి చేయకుండా మొన్నటికి మొన్న 108 సిబ్బంది సమ్మె చేస్తే RTC డ్రైవర్ల తో నడుపుతామన్నట్టుగా ఆసుపత్రులను కూడా ఇష్తమొచ్చిన వారితో నడిపి ప్రజల ప్రాణాల పట్ల చులకన భావం చూపుతోంది.
జూడా ల డిమాండ్లలో మొదటిది రూరల్ సర్వీసు పట్ల వ్యతిరేకత. దీనిని సాకుగా చూపి ఒక్కో వైద్య విద్యార్థికి పాతిక లక్షలు ఖర్చు పెడుతున్నట్టుగా చెబుతోంది పాలక వర్గం. కానీ ఇది నిజం కాదు. ప్రభుత్వాసుపత్రులలోని రోగులపైన, ఆసుపత్రుల నిర్వహణ ఖర్చును కలిపి వైద్య విద్యార్థి ఖర్చులో కలిపి చూపుతున్నారు. గ్రామీణ ఆసుపత్రులలో నేడు రిటైర్మెంటుకు దగ్గరగా వున్న వైద్యులు తప్ప మిగిలిన పోస్టులన్నీ అప్పుడే రిలీవైన విద్యార్థులతో నింపి గ్రామీణ ప్రజల ఆరోగ్యం పట్ల చులకన చూపు చూస్తున్నది ప్రభుత్వం. ఎక్కడ ఏ ఆసుపత్రులలోను గ్రామీణ పిహెచ్ సిలలో ఎవ్వరూ స్థానికంగా వుండి లేక శ్రద్ధతో వైద్యం చేస్తున్న వారే కరవయ్యారు. అప్పటికే ఓ ఆరేడేళ్ళు కాలేజీలలో చదువు ముగించుకొని వచ్చిన వార్ని బలవంతంగా వారికి ఇష్టంలేని ఉద్యోగం చేయమంటే శ్రద్ధ వుంటుందా? ఈ విధంగా రెగ్యులర్ ప్రభుత్వ వైద్య ఉద్యోగాలను తగ్గిస్తూ పోతున్నది. తద్వారా వైద్య రంగాన్ని సంక్షేమ రంగం నుండి తప్పించే యత్నంలో భాగంగా గుర్తించాల్సిన అవసరముంది.
అలాగే స్టైపెండు పెంచమనడంలోనూ వారి డిమాండ్ పట్ల సానుకూలంగా స్పందించడంలేదు. వెనకబడిన ఉత్తరప్రదేశ్ కంటే తక్కువగా చెల్లిస్తూ ప్రభుత్వ కాలేజీలలో చదువుకునే విద్యార్థులకు ఆర్నెల్లకోసారి నిధులు విడుదలచేస్తూ వారి చధువునకవసరమయ్యే వసతి సౌకర్యాల పట్ల శ్రద్ధ చూపకుండా వ్యవహరిస్తున్నారు. ఏ కళాశాలలోనూ గ్రంధాలయాలలో ఎప్పటివో పాత పుస్తకాలు తప్ప కొత్తగా వస్తున్న జర్నల్స్ కానీ వైద్య గ్రంధాలు కానీ లేని నిజం అందరికీ తెలిసినదే. ఒక్కో జర్నల్ సుమారు వెయ్యి రూపాయలు విలువగలవి ప్రతి నెలా కొనుక్కొని చదివే స్థోమత ఎంతమంది విద్యార్థులకు వుంటుంది. ప్రభుత్వ కళాశాలలలో చదివే విద్యార్థులలో అధిక శాతం మంది పేద మధ్యతరగతి బడుగు జీవుల పిల్లలే అయివుంటారన్నది నిజం కాదా..
వీళ్ళ సమ్మె జరిగే కాలంలో ఆసుపత్రులలో జరిగే సాధారణ మరణాలన్నీ లెక్కకట్టి వీళ్ళ ఖాతాలో జమచేయడం ఎంతవరకు సమంజసం?
ప్రతీ ఆర్నెల్లకోసారి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల జీతాలు, సౌకర్యాలు పెంచుకుంటున్న పాలక వర్గం నిజానికి వైద్య విద్య పట్ల ఎంత శాతం నిధులు ఖర్చు చేస్తున్నదో బహిరంగ పరచగలరా? విడుదలైన నిధులలో ఎంత శాతం కళాశాలల అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారు? ఎంత పెద్ద మొత్తంలో అధికారులు, రాజకీయ గణం బొక్కుతున్నారో బహిరంగంగా చెప్పగలరా?
ప్రజల డిమాండ్ల పట్ల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించే ముఖ్యమంత్రి మరో నీరో గా తన్ను తాను ఋజువు పరచుకోవడానికి తప్ప పాలన పట్ల శ్రద్ధలేదన్నది ప్రజలకు ఎరుకైనది. అలాగే వైద్యం పట్ల ఏమాత్రం అవగాహన లేని వారికి ఆ శాఖను అప్పగించి రౌడీలులా మాటాడిస్తున్నారు తప్ప సమస్యను సానుకూలంగా పరిష్కరించే కృషి జరగడంలేదు. ఈ విధంగా చేస్తూ చెంచా లాయర్లతో ప్రజా వ్యాజ్యాల ద్వారా కోర్తుల ద్వారా సమస్యను పక్కదారి పట్టించే యత్నం చేస్తూ నియంతలా వ్యవహరిస్తు వైద్య విద్యార్థులపట్ల ప్రజలలో ఏహ్యభావాన్ని తెచ్చే ప్రభుత్వ ధోరణిని ఖండిస్తూ జూ.డా.లకు మద్దతు తెలుపుదాం.





