
డిసెంబర్ 31 తర్వాత ఏమవుతుందోనని అంతా ఉత్కంఠ..
అటు లీకవుతున్న శ్రీక్రిష్ణ కమిటీ ఉద్దేశ్యాలు, గవర్నర్ గారి ఉత్సాహం జనాన్ని అయోమయానికి, ఆందోళనకి గురిచేస్తున్నాయి..
విద్యార్థిలోకం భవిష్యత్ ఏమవుతుందోనని తల్లిదండ్రుల భయం..
పరీక్షలు సజావుగా జరుగుతాయా అని ఉత్కంఠ… కేంపస్ కౌన్సిలింగ్ మిస్ అవుతారేమో పిల్లలని ఒకటే దడ…
అసలు ఉద్యమాలే వద్దు, రాజకీయాలు అవసరంలేదన్న వాదన ఓ వైపు, తమ భవిష్యత్ తెలంగాణాతోనే ముడిపడి వున్నదన్న వాదన బలంగా వినిపించిన విద్యార్థి నాయకత్వం ఓ వైపు..
మేము పెట్టుకున్న ఇంజినీరింగ్ కాలేజీ సీట్లు మిగిలి పోయిన దానికి తెలంగాణా ఉద్యమమే కారణమని యాజమాన్యాలు – అసలు మీ కాలేజీలలో లేని సౌకర్యాలు, విద్యార్థుల కంటే సీట్లెక్కువైనందునే మిగిలాయన్న వాదం ఈ వైపు…
ప్రభుత్వ యాజమాన్యాలలోని స్కూల్లు, కాలేజీల విద్యార్థులే వీటికి కారణమంటూ వారిని, వారి ఉద్యమాన్ని, నిబద్ధతను తక్కువంచనా వేసే వారికి గట్టి సమాధానమే దొరికింది..
కార్పొరేట్ కాలేజీల చదువుతో మొత్తం విద్యనే అందని ద్రాక్ష చేసి, వ్యాపారం చేస్తున్న వారు పిల్లల భవిష్యత్ గూర్చి మాటాడడం విడ్డూరం… బడుగు బలహీన వర్గాల వారి పట్ల వారికున్న చిన్న చూపు ఇక్కడ ప్రస్ఫుటమయ్యింది…
ఉద్యమం, తమ భవిష్యత్ ను కలగలుపుకుంటూ ముందుకు పోతున్నామన్న వారి దృఢ సంకల్పం ముందు వీరి వాదనలన్నీ తాటాకు చప్పులయ్యాయి. సమాజ మార్పు కోరే వారెవరైనా తప్పక ఆహ్వానించాల్సిన అవసరముంది. కెరీర్ ఒక్కటే కొలమానమైన నేటి వ్యాపార విద్య వలన నష్టమే ఎక్కువన్నది స్పష్టమైంది.. ఏమైనా వారికి అభినందనలు తెలియజేయకుండా ఉండలేము.
డిసెంబర్ 31 చావుగీతను చూపి భయపెట్టాలనుకోవడం మూర్ఖత్వం. అదే ఆఖరి అంకం కాదు. కాదు కూడా..
వాయిదాలు, మోసాలు వారికి కొత్త కాదు. అసలు ఈ కమిటీకి ఏ చట్టబద్ధతా లేదన్నది అందరికీ తెలిసినదే.. వీళ్ళిచ్చే సూచనలు, సలహాలు తెలియనివేమీ కాదు.
ఒక పక్క కావాలంటే అదనపు బలగాలను పంపుతామన్న కేంద్ర గృహమంత్రి గారు ఇప్పటికే తన మనసులోని మాటను బయటపెట్టారు. కావున 31 తరువాత వారు తెచ్చే కొత్త వెలుగులేమీ వుండవు. భూకంపాలేమీ రావు. ఉగ్గబట్టుకున్న సహనానికి పరీక్ష మొదలవుతుంది.. అంతే…
ఈ ఉద్యమం వలన సమాజ నాయకత్వానికి కొత్త నెత్తురందింది.. ఇంకా బలమైన రూపం తీసుకొని ఓ గుణాత్మక మార్పుకు పునాది కావాలన్నది ఆకాంక్ష..
(ఈ రోజు ABN ఆంధ్రజ్యోతిలో Open Debate programme చూసి)
