తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోరుతూ సుమారు 400 మందికి పైగా యువతీ యువకులు ఆత్మార్పణం చేస్తే కళ్ళుతెరిచిన కేంద్రం తెలంగాణా ఏర్పాటు ప్రక్రియ మొదలైందన్న ప్రకటనతో మొదలు పెట్టి శ్రీ క్రిష్ణ కమిటీ వరకు అన్ని దగాకోరు నిర్ణయాలు ప్రకటిస్తూ, రోజూ ఏదో ఒక ఆలవోక ప్రకటనలతో వారి గుండెల్లో గునపాలు దించడంలో అన్ని రాజకీయ పక్షాలు తలా ఒక చేయివేసాయి. ప్రధాన పక్షాల అధినేతలు మాత్రం కమిటీకు ఏమీ చెప్పక ఒకడు మేమే కదా ఇచ్చేది చచ్చేది అని ప్రగల్భాలు పలుకుతుంటే, ఇస్తే వొద్దమని ఇంకోడు సన్నాయి నొక్కులు నొక్కుతూన్నాడు. ఈ లోపుగా రాజీనామాలు చేసిన స్థానాలలో పోటీకి మేమంటే మేం సై అని నిస్సిగ్గుగా ముందుకు వచ్చిన వీళ్ళకు నిజంగా తెలంగాణా ప్రజల పట్ల అభిమానముందా? వారి భావోద్రేకాలను సొమ్ము చేసుకొనడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. భారీ విగ్రహ దళసరి నాలుక నాయకుడు గెలిస్తే నేనే సి.ఎం.అయి తెలంగాణా ఇచ్చేస్తానని కదల్లేక కదుల్తూ జనాన్ని విసిగిస్తున్నాడు. మరల వీళ్ళ నల్లడబ్బు, అధికార ప్రభావం పారించి ఎలాగైనా ఎన్నికల్లో గెలిచే ఏర్పాట్లు చేసుకుంటున్న ఈ మోసకారి నాయకులను ఎండగట్టాలంటే అసలు ప్రజలు తమకున్న ఒకే ఒక అస్త్రం స్వచ్చందంగా ఈ ఎన్నికలను బహిష్కరించడమే. అదే నిజమైన తెలంగాణా స్ఫూర్తి. ఎన్నిమార్లు ఎన్నికలలో పాల్గొన్నా దాని ప్రభావం ఒట్టిపోతున్న వేళ మాకొద్దీ కుట్రపూరిత, దగాకోరు, దగుల్భాజీ ఎన్నికలని, శవ రాజకీయాలని ప్రజలు విస్పష్టంగా ప్రకటించిన వేళ ఈ కాగితప్పులుల మేకపోతు గాంభీర్యాలు పటాపంచలై దిగి వస్తారు.అదే ఆత్మార్పణ చేసిన అమరులకు నిజమైన నివాళి…
కాదంటారా?



