
అదిగదిగో ఉద్దానం..
ఉద్దానం కాదురా
ఉద్యమాల వనంరా…
ఈ పాట ఇంకా సజీవంగానే వుంది. సోంపేట ఉద్దానంలో భాగమే. మొన్నటి వరకు పాలకుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తించిన పోరాటాల పురిటిగడ్డ. జమీందారీ పాలకులను ఎదిరించి పోరాడిన పోరుగడ్డ. ఉద్యమం వారికి ఉగ్గుపాలతో పెట్టిన విద్య. ఉప్పెనకు ఎదురొడ్డే గుండె ధైర్యం కలవారు.
కోస్టల్ కారిడార్ పేరిట నెల్లూరు నుండి ఇచ్చాపురం వరకు వున్న 1000 కి.మీ. తీర ప్రాంతాన్ని ప్రైవేటు పెట్టుబడిదారులకు అప్పనంగా దానం చేయబూనిన పాలకులు ఇక్కడి ప్రజల అభిప్రాయాలను గౌరవించాల్సిన కనీస ప్రజాస్వామిక దృక్పధాన్ని విస్మరించారు. ఒకే ప్రాంతంలో ఉత్తరాంధ్రలో 10 వరకు థర్మల్ ప్లాంటులు అవి కూడా వ్యాపార నిమిత్తం నిర్మించబూనడం, అలాగే రణస్థలం దగ్గర అణు విద్యుత్ ప్లాంటు నిర్మాణం చేబూనడం ఎంతవరకు సమంజసం?
ఉత్తరాంధ్ర ప్రజలు అంబలి గాళ్ళు, వారేమి చేస్తారులే, వారి నాయకులు మన కాలికింద చెప్పులై వున్నారు కదా అన్న ఫాసిస్టు ఆలోచనతో తప్పుడు అవగాహనతో ఈ ప్రాంత వినాశనానికి పూనుకున్నారు. బీల ప్రాంతమంతా సారవంతమైన భూములతో, నీటి వనరులతో, కొబ్బరి చెట్లతో గోదావరి తీర ప్రాంతాన్ని తలపించే వ్యవసాయ భూములతో పచ్చగా కళ కళలాడే ప్రాంతం. అలాగే తీరప్రాంతం అంతా మత్స్య సంపదతో నిండి వేలాది మంది మత్స్యకార కుటుంబాలు ఆధారపడిన జీవగడ్డ. అటువంటి ప్రాణాధారమైన ప్రాంతంపై ప్రజల అమాయకత్వాన్ని సొమ్ముచేసుకుందామన్న కుటిల ఆలోచనతో ఈ ప్రాంతాన్ని కబళించ చూడడం మూర్ఖత్వం.
ఉద్దానం ప్రాంత ప్రజలు ఎంత సాధారణంగా సౌమ్యంగా జీవనం సాగిస్తారో, తెగిస్తే ఉవ్వెత్తున ఉప్పెనలా విరుచుకుపడగలరని ఇక్కడి చరిత్ర తెలిసిన వారికి అవగతమౌతుంది. కొన్ని నెలలుగా ఈ ప్లాంట్ల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ స్వచ్చందంగా ఏ రాజకీయ పార్టీ నేతృత్వంలో లేకుండానే గాంధేయ మార్గంలో తమ వ్యతిరేకతను తెలియజేస్తూ నిరవధిక నిరాహార దీక్షలు చేస్తున్నారు. తమ ఉనికికి ముప్పు వస్తుందని గ్రహించిన కొన్ని రాజకీయ పార్టీల నేతలు వారికి మద్ధతుగా మాటాడారు.
ఇటీవలే నర్మదా బచావో ఆందోళన్ నాయకురాలు, ప్రముహ పర్యావరణ వేత్త మేధాపాట్కర్ కూడా సందర్శించి వీరి ఆందోళనకు మద్ధతు పలికి, ప్రాజెక్టుల నిర్మాణం వలన ఈ ప్రాంతం ఎడారిగా మారిపోతుందని, లక్షలాది ప్రజలు నిర్వాసితులౌతారని, కావున వీటిని ఉపసంహరించుకోవాలని విజ్నప్తి చేసారు.
దీంతో ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు మద్ధతుగా వేలాది పోలీసు బలగాలను తరలించి అక్కడ నిరాహార దీక్షా శిబిరాలను తొలగించే ప్రయత్నం చేసింది. అలాగే నిన్నటికి నాగార్జున కన్స్ట్రక్షన్స్ వారు చేపట్టిన నిర్మాణకార్యక్రమాన్ని అడ్డుకునేందుకు వచ్చిన నిరాయుధులైన ప్రజలపై కంపెనీ ప్రైవేటు గూండాలతో పాటు 3000 మంది సాయుధ పోలీసులను వారిపైకి ఉసిగొల్పి నలుగురు మత్స్యకారుల ప్రాణాలు తీసారు.
అలాగే ఇక్కడి ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉన్న డా.రామారావుగారి క్లినిక్ పై దాడి చేసి, రోగులను తరిమి వేసారు. సమీప గ్రామాలపై పడి ప్రజలను చితకబాదుతున్నారు.
ఇదంతా చూస్తుంటే మళ్ళీ శ్రీకాకుళం మొదలయ్యే క్రమానికి ప్రభుత్వమే ప్రజలను తోస్తుందనిపిస్తుంది. ఏమీ తెలీనట్లు మాట్లాడుతున్న ముఖ్యమంత్రిగారు, పోలీసులను వెనకేసుకొస్తున్న హోంమంత్రిగారి మాటలు తీవ్ర వేదనకు లోనైన ప్రజలకు పుండుమీద కారం చల్లినట్లుగా వున్నాయి.
వేల ఎకరాల పంట భూములను, తీర ప్రాంతాన్ని నాశనం చేసే థర్మల్ ప్లాంట్ల వలన ఎవరికి ఉపయోగం? అక్కడ ఉత్తత్తైన విద్యుత్ లో ఒక్క యూనిట్ కూడా ప్రభుత్వానికి చెందదు. మరి వారికి ఇంత చౌకగా భూములను కట్టబెట్టి, అనుమతులే లేని వారికి వత్తాసుగా నిలబడి ప్రజల ప్రాణాలను హరించే వీరిని ఏమనాలి?
మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే ఉద్దానం ఒట్టి బీల ప్రాంతమే కాదు ఉద్యామాల వనం..
Like this:
Be the first to like this post.