
ఓ పదేళ్ళ క్రితం వరకు మా వూళ్ళో ఎక్కడో దగ్గర రేడియో వినబడేది.. అంతకు ముందర క్రికెట్ కామెంటరీ కోసం చెవిదగ్గర రేడియో ట్రాన్సిస్టర్ వుండటం మోడర్న్ చిహ్నంగా వుండేది. అలాగే వార్తలకు అదే ఆధారం.. ప్రాంతీయ వార్తలు, జాతీయవార్తలను తెలుగులో చదివే కందుల సూర్యనారాయణ మొ.న వారంతా మనకు కనబడని స్నేహితులులా వుండేవారు. వాళ్ళ పేరు చెప్పకుండానే గుర్తుపట్టే వాళ్ళం.. అలాగే ఉదయాన్నే వచ్చే సుప్రభాతం, సూక్తిముక్తావళి, భక్తిరంజని రేడియోలో పెద్ద సౌండ్ తో పెట్టే అమ్మ, చిత్ర తరంగణి, మధ్యాహ్నం కార్మికుల కార్యక్రమం, రాత్రిని వచ్చే రేడియో నాటికలు, జాతీయ నాటికలు ఎంతో శ్రద్ధగా వినేవాళ్ళం. ప్రతీ బుధవారం సిలోన్ రేడియో స్టేషన్ లో వచ్చే బినాకా గీత్ మాలా గురించి వారం వరకు వేచి వుండటం అదో థ్రిల్.. సామాన్యుని బతుకులో రేడియో ఓ భాగం. సంచార జీవులు కూడా తమ గుడారానికి రేడియో వేలాడదీసే వారు. స్వయంకృషి సినిమాలో హీరో రేడియో వినే హిందీకూడా నేర్చేస్తాడు. ఇలా రేడియో మనకు ఆనాడున్న ఒకే ఒక్క entertainer..
అలాగే అభిమాన హీరో కొత్త సినిమా ఆడియో కేసెట్ రిలీజయితే సందడే సందడి. సాయంత్రానికి ఊర్లోకి కేసెట్ రావడం, కాపీలు రెడీ అయిపోవడం, టేప్ రికార్డర్లలో , టూఇన్ వన్ లలో , ఫేంట్ బకిల్కు పెట్టుకున్న వాక్ మన్ లలో వినడం, వీధుల్లో పెద్ద పెద్ద బాక్సులలో వినిపిస్తూ గెంతులేయడం అదో ఆనందం…
ఆ రోజుల్లో మా రేడియో అన్నయ్యకు చేతినిండా పని.. చుట్టు కుప్పలా చిన్న ట్రాన్సిస్టర్ల నుండి పెద్ద పెద్ద ఆడియో సిస్టమ్ ల వరకు వుండేవి. రాత్రి ఎప్పుడో చేరేవాడు ఇంటికి.. మాటిచ్చాడంటే దాని పనయ్యేంతవరకు విడిచిపెట్టేవాడు కాదు.. మన వద్ద పాడనని మొరాయించిన రేడియో చిటికెలో బాగయ్యేది. ఏ పార్ట్ పోయిందో చెప్పి కరెక్టుగా, తన కష్టానికి తగ్గట్టుగా తీసుకునే రేడియో అన్నయ్య అంటే అందరికీ అభిమానం.
కానీ నేడు ఎవరూ కనీసం సి.డీ.లు కూడా కొన్న పాపాన పోవడం లేదు. అంతా మొబైల్ డివైస్ లో ప్లే అవుతుంటే వింటున్నాం. దీంతో మూగబోయిన రేడియోలు, కనుమరుగైన టేప్ రికార్డర్లు, టూ-ఇన్-వన్ ల వలన నేడు రేడియో అన్నయ్యల బతుకు చితికి, ఈ వయసులో మరో పని చేతకాక అరుదుగా వచ్చే రేడియోనే కెలుకుతూ కాలం వెళ్ళదీస్తున్న వారికి ఓ ఓదార్పు మాటివ్వగలమా?
Like this:
Be the first to like this post.