బోగస్ కిరణాలు

లక్షకొలువులు ఇచ్చేశాం అని సిఎం గారి ప్రకటన చూస్తే నవ్వొస్తోంది. ఈమధ్య ఈ యువకిరణాల ఉద్యోగాలపై గ్రామాలలోని యువకులు తామిచ్చిన కొలువులలో చేరారా లేదా అని విచారణకు గ్రామస్థాయి కమిటీలు వేసారు. నేనూ తిరిగా.. కానీ అందులో పేర్కొన్న కంపెనీలలో ఒక్కడు చేరలేదు. ఎందుకంటే ఆ ఉద్యోగాలు ఇచ్చినట్లు సమాచారమే లేదు. అసలు ఆ జాబితాలో ఇచ్చిన పేర్లలో 5 శాతానికి మించి ఎవరూ ఆ ఊళ్ళలో లేరు. ఏ ఊరివారో తెలీలేదు. అది స్వయంగా జిల్లా ఎంప్లాయ్ మెంటు ఎక్స్చేంజీ వారిచ్చిన జాబితా. సెక్యూరిటీ గార్డు పోస్టులలో స్వంత ఖర్చులతో చేరిన వారి పేర్లుకూడా వీళ్ళు కలిపేసుకున్నారు. ఇది మా పరిశీలనలో తేలిన అంశం. ఎందుకయ్యా ఇలా జన్నాన్ని మోసగిస్తారు??

పెద బేరగాడు…

బేరగాడు

ఈ ప్రస్థానం ఎటు వైపు..
T.కాంగ్రెస్ వాళ్ళంతా కుయ్యో మొఱో అంటూ వుంటే పదిహేను రోజుల్లో తెలంగాణా ఇచ్చేస్తారని సంకేతాలొచ్చాయంటాడు ఈ నాయకుడు…ఈయనకేమైనా ప్రత్యేక రాడార్ వుందా?
సోనియా చిదంబరంలతో ఎంత కుదిరిందో బేరం కానీ రాజుకున్న అగ్గిపై నీళ్ళు చల్లడానికి వెంటనే సిగ్గు ఎగ్గులేకుండా తయారై పోయాడు. ఏదో ఒక నిర్ణయం వెలువడే సమయంలో యిలా చేస్తూ పబ్బం గడుపుకుంటున్న ఇటువంటి నాయకుల
పబ్లిక్ నిలదీయాలి…

జర భద్రం తమ్ముళ్ళూ…

ను

వార్తకు ఆధారంః

కుక్క కరిస్తే చెప్పుతో కొట్టుకోవడమే మిగిలిందా?

ఈ మధ్య రాష్ట్రంలో కుక్క కాటు మరణాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి అని గౌరవనీయులైన వైద్యారోగ్య శాఖ కార్యదర్శి గారిని విలేకరులు అడిగితే యిందులో రాష్ట్ర ప్రభుత్వం కుట్రేమీ లేదని, జనం సరైన సమయానికి వేక్సిన్ వేయించుకోక పోవడంతో మరణాలు సంభవిస్తున్నాయని సెలవిచ్చారు.  కానీ వేక్సిన్ వేయించుకోవడానికి వెలితే సర్కారు దవాఖానలో వేక్సిన్ వుండదన్నది అందరికీ తెలిసిన విషయమే. పోనీ వైద్యారోగ్య మంత్రిగారినడుగుదామంటే ఆయన ఉప ఎన్నికల ఫలితాలతో బొప్పికట్టి యింకా పూర్తిగా కోలుకోలేదు. సి.ఎం.గారెమో గుండు గీయించుకొని హాయిగా ఏసీ కింద తలపెట్టి పడుకున్నారు. మరింక మన మొర వినేది సదరు గ్రామ సింహాలే కాబట్టి వాటి సంఘాలతో సమావేశమై వేడుకోవడమే తప్ప మరో గత్యంతరం లేకపోయే..

ఖమ్మంలో గౌరవనీయ మంత్రి వర్యుల కళ్ళముందే అయ్యా బతికించండయ్యా అని చుట్టుకుంటూ చనిపోయిన బాలుని హృదయ విదారక దృశ్యం టీవీలలో చూసిన మనం చలించిపోవడమే తప్ప సర్కారుకు  చీమ కుట్టినట్లైనా లేదు. కావున మనకు చెప్పుతో కొట్టుకోవడమే మిగిలిన వైద్యం…

మహిళలపై పెరిగిన దాడులు-పోలీసుల రాజీమార్గాలు

ఇటీవల కాలంలో రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. ఆడపిల్ల బయటకు వెళ్ళి రావాలంటే ప్రాణాలరచేత్తో పట్టుకోవాల్సిన పరిస్థితి తల్లిదండ్రులది.. మహిళా హోం మంత్రిగారి హయాంలో మరీ పెట్రేగిపోతున్న ఆకతాయిలు, ఆ తరువాత డబ్బులుంటే చాలు కేసులు మాఫీ అవుతున్నాయన్న భరోసా పెరిగిపోయింది…

ఉదాహరణకు ఈ నెల పదమూడో తారీఖున శిరీష అనే ఎం.బి.ఏ. విద్యార్థినిపై మోటార్ బైక్ పై వచ్చి దాడి జరిగితే మూడు వేళ్ళు తెగి పదిహేను అడుగుల దూరంలో పడితే అది ప్రమాదవశాత్తు జరిగిందని సెలవిస్తున్న పోలీసుల తీరు అనుమానాస్పదంగా వుంది. ఏవిధమైన ఆయుధంతో దాడి చేయకపోతే చేతి వేళ్ళు ఎలా తెగిపడతాయి? అలాగే ఎప్పటినుండో ప్రేమించమని వేధిస్తున్న వ్యక్తి కావాలని దాడి చేయకపోతే అది వీళ్ళన్న ప్రమాదమైనా ఆ వ్యక్తి ద్వారానే జరిగివుండాల్సిన అవసరముండేదా అన్నది సామాన్యులుగా మనకే తెలుస్తున్న జవాబు. అంతకుముందు పోలీసు స్టేషన్ లో వేధింపులపై రిపోర్టు ఇస్తే రాజీ చేసుకోమని సెలవిచ్చిన పోలీసు అధికారులు వాళ్ళ అమ్మాయిలపట్ల ఎవరైనా ఇలానే ప్రవర్తిస్తే రాజీకి వస్తారా? ఇంక ఈ సీను పై ఆ ప్రదేశంలో వున్న సాక్షులను అడిగితే రెప్పపాటులో జరిగిపోయిందిమేమేమీ చెప్పలేమన్నారని నిన్నటి వార్త. ఇప్పుడు నూటఎనిమిది కి అక్కడి నుండి వెల్లిన కాల్స్ లో ప్రమాద కారకుడైన వాడిదే మొదటినెం.అని చెప్పడమ్ బట్టి చూస్తే కేసును ఎలా మూసివేయాలో బాగా ఆలోచించి చేస్తున్నట్టున్నారనిపించడంలేదా? వీళ్ళు కేసును పక్కదోవపట్టించాలంటే ఏమైనా చేయగలరని నిరూపితమౌతోంది. జరిగింది ప్రమాదమన్నవారు ఫోరెన్సిక్ లాబ్ కు పంపారంట. వాళ్ళేలా ఈ కేసులో తేలుస్తారు? ఇది హాస్యాస్పదంగాలేదా? చేతి పై ఎంత పదునైన ఆయుధంతో దాడి జరగకపోతే వేళ్ళు అదీ మూడువేళ్ళు తెగిపడతాయా?

ఆడపిల్లల్ని కనడమే నేరమా? అటు విశాఖలో ఉపాద్యాయురాలిని ఘోరంగా  బడిపిల్లలముందే నరికి చంపాడొకడు. ఎక్కడున్నాం మనం? ఎటువైపు మన ప్రయాణం?

వార్త ఆధారం

తండ్రీ… రాక్షసుడా….

తనెవరో,

ఆడో, మగో,

ఏ కులమో,

ఏ మతమో,

ధనికురాలో,

పేదరాలో

తెలీని

ఆ పిచ్చితల్లి…


నవమాసాలు

అమ్మకడుపులో

భద్రంగా ఈదులాడి

బయటపడిన క్షణం…


తను ఆడబిడ్డనని

తన ఇంట తిరుగాడే

అదృష్ట దేవతనని

గారాభంగా చేతుల్లోకి

తీసుకుంటావనుకుంటే

ఒక్కసారిగా నేలకేసి మోది

చంపుతావనుకోలేదు నాన్నా…


ఇందులో నా తప్పేంటో

కాస్తా చెప్పగలవా?

మరో మారు జన్మెత్తకుండా

వుంటా….

(ఉదయాన్నే పేపరులో ముందు పేజీలోనే ఆడబిడ్డని నేలకేసి బాది ఆసుపత్రిలోనే చంపిన తండ్రి వార్త చదివి)

ఉత్తరాంధ్ర ఉసురు తీస్తున్న బొగ్గు కుంపట్లు..

బొగ్గు కుంపటి

ప్లాంటు చుట్టూ నిర్మిస్తున్న గట్టు

ఈ రోజు కాకరాపల్లి ధర్మల్ ప్రోజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న పల్లె ప్రజలపై పోలీసు కాల్పులలో ఇద్దరు మరణించారు. బీల ప్రాంతంలో నిర్మిస్తున్న ఈ ప్లాంటు వలన మొత్తం ఆ ప్రాంతమంతా జలమయమై ప్రజలు కూడూ గూడుకు దూరమైపోతున్నందుకు నిరసనగా చేపట్టిన ఉద్యమాన్ని అణచివేయడానికి శతృ దేశంపై దండయాత్రకు వెళ్ళినట్లుగా వందలాదిమంది పోలీసులను మోహరించి భయభ్రాంతులను చేస్తున్నా ప్రజలకు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమవడంతో గత్యంతరం లేక తిరగబడుతున్న వారిపై సాయుధ మూకలు కాల్పులు జరపడం, ఈ కాల్పులలో మరణించిన వారిని ఆకాశలక్కవరం గ్రామానికి చెందిన నాగేశ్వర రావు, బీరపువానిపేట గ్రామానికి చెందిన ఎర్రయ్యలుగా గుర్తించారు. అనేక మంది తీవ్ర గాయాలకు గురయ్యారు. పోలీసు ఫైరింగ్ తో వారి గుడిసెలన్నీ తగలబడుతున్నాయి.

ఇంతగా ప్రజలు తిరగబడుతున్నా ప్రైవేటు కంపెనీలకు అమ్ముడు పోయిన పాలక వర్గం వారి విన్నపాలను వినేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. గత ఆరు నెలలుగా వడ్డితాండ్ర గ్రామస్తులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా కనీసం స్పందించలేదు. ఆ ప్లాంటు చుట్టూ నిర్మించిన గట్టు వలన వందలాది ఎకరాల వరి పంట మునిగిపోయింది. ఆ ఫోటోలతో కూడిన పోస్ట్ గతంలో ప్రత్యక్ష్జంగా చూసి ఈ బ్లాగులో వుంచాను. ఎంతసేపూ వారికి మద్ధతుగా ఎవరెవరు వస్తున్నారు, ప్రతిదినం ఎవరు కూచుంటున్నారు అన్న విషయ సేకరణ పట్ల వున్న ఆసక్తి తప్ప వారి గోడును వినే నాధుడు లేకపోవడం, మునిగిపోతున్న తమ బతుకులను కాపాడుకోవడానికి తిరగబడ్డం తప్ప ప్రత్యామ్నాయం లేకపోయిన ఆ మత్స్యకార, సన్నకారు రైతు కుటుంబాల ప్రాణాలను తీయడం ఎంతవరకు సమంజసం. ఇలా ప్రజల ప్రాణాలను హరించి ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు?, ఇంత ఘోరమైన నీచమైన పనులు చేస్తూ ప్రజల పట్ల బాధ్యతలేని పాలకులు తమ ఆస్తులను కూడబెట్టుకోవడానికి అధికార ప్రతిపక్ష నాయకులు ఒకటై పోయారన్న చేదు నిజం ఇక్కడ సత్యదూరం కాదు. ఇక్కడ నిర్మిస్తున్న ప్రోజెక్టు ప్రతిపక్ష భారీ విగ్రహానిదేనన్న సత్యం అందరికీ తెలుసు. వీడు మైకు దొరికితే గొంతు చించుకొని అవినీతి గురించి మాటాడుతాడు ముద్ద ముద్దగా. ఇక్కడి జనం నోట్లో మట్టి గొట్టడానికి తయారైన వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఉత్తరాంధ్ర బొగ్గుకాక తప్పదు. దీనిని ప్రజాస్వామ్య వాదులు, మేధావులు తప్పక ఖండించి ప్రజల పక్షాన నిలిచి పోరాడాలని కోరుకుంటున్నాం..

వార్తనిక్కడ చదవండి

సూరీడుకో విన్నపం

దిగులు



గాలికి పడుతుంటే
కింద రాలే గింజలకంటే
ఎగిరిపోయే పొల్లు గింజలెక్కువైనాయిరో..

రాలిన గింజలలో
కమురుబారిన గింజలెక్కువాయినాయిరో..

గిడసబారిన గింజ కొనే దిక్కులేక
ఎత్తిపట్టిన పేగుల్తో
ఈ పండగెట్లా పారిపోద్దోరా నాయినా

ఇంటికొచ్చిన కూతురికి
సీర అల్లునికి పండగ కట్నాలుకు
సావుకారు అప్పు తప్పక
ఇంక భోగి కుడుములకు
మినుములేడ తేనని ఏడుస్తున్న
నా ఆడది వొంక సూడలేక
సెరువు గట్టున జేరిన నన్ను
జూసి గుంకిపోతున్న సూరీడు మామా
ఈ పండుగ దినాలల్ల నీతో
ఆ కొండమాటుకు తీసుకుపోవా..

వరదపాలు

బురద బువ్వ

 

 

 

 

 

 

 

 

చేతికంది వచ్చిన కొడుకును

పొట్టన పెట్టుకున్న సుడిగుండమల్లే

ఈ వరద కోత కొచ్చిన పంటను

నీటముంచి రైతు కంట కారే

నెత్తుటి వరదైంది…

 

ఆరుగాలం శ్రమించి

పుస్తెలకూడా  తాకట్టుపెట్టి

పండించిన పంట చేను

ఏపుగా ఎదిగిన ఎన్నుల

వెలుగుతో కనుల నిండుగా

పండిన కార్తీక పున్నమి వెన్నెల

కొండ చాటుకు మళ్ళకముందే

తీరందాటిన జల ప్రళయంతో

అలముకున్న చీకట్లతో

ఎలా ఈ ఏడు గట్టెక్కేదంటూ

బావురుమంటున్న రైతన్న

 

చుట్టూ ఆకాశంలో గిరికీలు కొట్టి పోయిన

ఉత్తుత్తి కిరణాల పొడిపొడి మాటల

హామీలతో మరింత కుంగిన

ఆకుపచ్చ చందమామ

నీకు సాయం ఒట్టి

ఎండమావేనా???

అంతా నేరస్తులే..

భోపాల్ దుర్ఘటననుండి తప్పించుకో జూసే వర్గం ఒకటి, దానిని సొమ్ము చేసుకొనే వర్గం ఒకటిగా ప్రస్తుతం రాజకీయ పక్షాలు విడిపోయి దుర్ఘటన బాధితుల పట్ల తమ బాధ్యతా రాహిత్యాన్ని కప్పిపుచ్చుకోజూస్తున్నాయి. అసలు నేరస్తున్ని తప్పించడంలో కీలకపాత్ర పోషించిన నాటి ప్రధాని, ముఖ్యమంతులు ను ఇందులో తప్పించడానికి కాంగ్రెస్ వారు ఎన్ని పిల్లిమొగ్గలు వేయాలో అన్ని వేస్తున్నారు. అలాగే ఈ సంఘటన ద్వారా తామేదో సామాజిక న్యాయానికి బాధ్యులం కానట్లు అధికారంలో వున్నప్పుడు అమెరికా వాడి చెప్పులు మోసిన తీరును మరిచి పాలక పక్షంపై దాడి చేస్తోంది బి.జె.పి. కానీ ఈ రెండు పక్షాలు ఆ రాష్ట్రాన్ని ఏలినవే. అలాగే కేంద్రంలోనూ కీలక పాత్ర కలిగినవి. తీర్పు వచ్చాక ఎవరికి వారు శవ రాజకీయాలు చేస్తూ బాధితులకు మరింత కన్నీళ్ళు మిగులుస్తున్నారు.

అసలు ఈ నేరాన్ని అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాల్ చేసి దోషులను శిక్షార్హులను చేయాలి. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ నగరాలైన హిరోషిమా-నాగసాకీలపై జరిగిన అణుబాంబు దాడిలాగానే ఈ దుర్ఘటనను చూడాలి. పాతికవేలమందికి పైగా అమానుషంగా చనిపోతే ఒక్కొక్కరికి  పాతికవేల రూపాయల నష్టపరిహారంతో సరిపెట్టమని చెప్పిన  ఆనాటి సుప్రీం న్యాయమూర్తిని మరల విచారించాలి. ఏ ప్రలోభాలకు లోనై దీనిని ప్రైవేటు వ్యవహారంగా సెట్ ల్మెంటు చేసుకోమని తీర్పునిచ్చారో తేల్చాలి.  అర్జున్ సింగ్ కొడుకు నడిపే NGO కు అందిన ముడుపుల వ్యవహారం తేల్చాలి.  ఇందులో రాజీవ్ పాత్ర మరుగునపెట్టే ప్రయత్నం ముమ్మరంగా జరుగుతోంది. కానీ భారీ స్కాంలకు ఆధ్యుడైన కుఱ ప్రధాని చనిపోయి తప్పించుకున్నా ఈ పాపం వెంటాడక తప్పదు.  ఇంతజరిగినా నవ్వుతూ టాటా చెప్పిపోయిన  ఆండర్సన్ గాడిని విచారిస్తామన్న మాట మాత్రం ఇప్పటికీ ఈ పాలకుల నోట రావడంలేదు. లక్షమందికిపైగా అవిటి జీవనం గడుపుతున్నా వీళ్ళకు రాజకీయాలే తప్ప వారి గోడు వినబడుటలేదు. దారుణం…

ప్రతిపాదనే తమవద్ద లేనప్పుడు కమిటీ ఎందుకు సారూ?

ఈ రోజు నాలుగేళ్ళ తరువాత మన ప్రధాన మంత్రిగారు విలేకరుల సమావేశంలో మాటాడారు. ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదనలేవీ తమ వద్ద లేవని, తెలంగాణ విషయంలో శ్రీక్రిష్ణ కమిటే నివేదిక వచ్చాక స్పందిస్తానని సెలవిచ్చారు.

మరి తమ గృహమంత్రిగారి డిసెంబరు 9 నాటి ప్రకటనలో మీ భాగస్వామ్యం లేదా సార్?

రాష్ట్రం తీవ్ర అలజడికి గురికాబడి, యిరువైపులా అగ్గిరాజేసిన పాపం ఎవరిది సార్?

300 మందికి పైగా యువకులు తమ ఆత్మ బలిదానాలకు మీరిచ్చిన విలువ యిదేనా?

ఏమాశించి ఈ నిప్పుల కొలిమిని అంటించారు సార్?

మీ రాజకీయ చదరంగంలో బలయ్యేది క్రొన్నెత్తురు పారే యువకులే కదా?

వై.ఎస్.హవాను తగ్గించడానికి కేంద్రం ఆడిన నాటకమా?

తెలంగాణా అట్టుడికిన సమయాన మీరు తెరచాటు నుండి మరల ఈ రోజు యిలా చిలుక పలుకులు పలికారంటే, ప్రస్తుతమున్న స్తబ్ధత మిమ్మల్నిలా మాటాడించే ధైర్యాన్నిచ్చిందన్న మాట. మీ కేబినెట్ లో రెండో స్థానంలో వున్న మీ సహచరుడు చిదంబరం రగిల్చిన చిచ్చు కు ఆహుతైన లేలేత స్వప్నాలకు ఎవరు బదులిస్తారు?

యిది ప్రజలను వంచించే కార్యక్రమమే…