లగడపాటి గారు తిరుపతిలో సభలో మాటాడుతూ చిరు తను కలిసి తెలంగాణా ప్రాంతంలో తిరుగుతామని సవాల్ చేస్తున్నారు. ప్రాంతీయవాదంలో పస లేదని సెలవిచ్చారు. తన సమైక్య వాదంలో వున్న పస వ్యాపార పస కాకపోతే ఈయనకు ఈ రాష్ట్ర ప్రజలపై ఇంత ప్రేమ దేనికేడ్చినట్లు. తన సొంత గ్రిడ్ లలో తయారయిన విద్యుత్ ను బయటకు అమ్ముకుంటూ ఇక్కడి వనరులతో వ్యాపారాలు చేసుకుంటూ కోట్లాది రూపాయలు సంపాదించే యీయన గారికి యిక్కడి వనరుపై ప్రేమా లేక జనంపైనా?
చిరు గారు భారమైన స్టెప్పులు జనం చూడలేకపోతున్నారన్న నిజం తెలిసి మొఖానికి రంగుమాని ప్రజలకు రంగు వేద్దామని బయల్దేరి బామ్మర్థి కోటరీతో సీట్లమ్ముకొని, తనేదో ఉద్ధరిస్తాడని మోద్దామని బయల్దేరిన మిత్రా, ప్రభాకర్ లాంటి వారు ఈయన గారి లోగుట్టు తెలిసి పారిపోయారు. ఏనాడూ పిల్లికి బిచ్చం పెట్టని ఈయన జనాల్ని ఏముద్ధరిస్తాడు అన్నది తొందరగానే గ్రహించిన జనం దూరంగా జరిగారు. దాంతో సొంత గ్రామంలోనే ఓడిపోయి ఏం జేయాలో తెలియక, ఉన్న పరువేదో నిలుపుకుందామని కొత్తగా సమైక్య వాదాన్ని తలకెత్తుకొన్నా ఎవరూ వెంట రాక, ఒంటరిగా అద్దం ముందు నిలబడిపోయాడు.
ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి తొడగొడుతున్నారు. ప్రజల మనోభావాలను, ఉద్వేగాలను రెచ్చగొడితే కాళ్ళు విరుగుతాయి తప్ప మరేమీ కాదన్నది తొందర్లోనే ఎరుకవుతుంది. తమ తమ వ్యాపారాలను కాపాడుకునేందుకు హైదరాబాదునుండి వెల్లగొడతారేమోనన్న భయంతో యిలా ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారు.
