అమ్మకానికి న్యాయం…

ఇదేమైనా మనకు కొత్త వార్తా…

లేక మనకు మింగుడు పడనిదా…

గాలి జనార్థన రెడ్డికి ఐదు కోట్లు లంచం తీసుకొని బైల్ ఇచ్చారంట న్యాయమూర్తిగారు..

ఏదో కక్కుర్తిపడ్డారు ఆయన గారు..దానికి ఇంత పెద్ద వార్త చేసి బిల్డప్ ఇచ్చాయి ఈ రోజు వార్తా పత్రికలు..దీనిని సామాన్య జనం ఏమైనా చదివి రోడ్లెక్కి అబ్బో ఆ న్యాయమూర్తిగార్ని శిక్షించి న్యాయ దేవత శీలాన్ని కాపాడండి అని గగ్గోలు పెడతారా ఎక్కడైనా ఎప్పుడైనా..

నీకు వ్యతిరేకంగా వున్న వాడి గురించి ఇంతింత బాక్స్ ఐటంలు కట్టి రాస్తావే కానీ అదే నీ దగ్గరివాడో లేక నీ పార్టీవాడో చేసినప్పుడు అశ్వథ్థామ హతః అన్న స్టైల్లో ఎక్కడో ఆరో పేజీలో రాస్తున్నావే..మరి నీకెక్కడి బాధ్యత వుంది.. అందుకే ఇలాంటివి ఎవడూ పట్టించుకోవడం మానేసాడు..

వాడికి డబ్బు ఎక్కువుంది..అమ్ముడుపోయే వాడు దొరికినప్పుడూ వీజీగా కొనుక్కున్నాడు.. అసలు ఇలా మేనేజ్ చేయడం కొత్తనా…ఎవడికి అవకాశమున్నంత మేరా వాడు ఈ దేశంలో చేసుకు పోతూనే వున్నాడు కదా..

మన దేశ ప్రధానమంత్రివర్యుల పాలనా కాలంలో ఎన్ని కోట్ల రూపాయల కుంభకోణాలు వెలుగులోకొచ్చినా వారు మాత్రం నాకే మసి అంటనేలేదు.. నిరూపిస్తే రాజకీయాలనుండి తప్పుకుంటానంటారు..అంటే ఆయన రాజకీయం చేస్తున్నట్టే కదా..మరి ఆయనెన్నడైనా ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డారా?? అసలు ఆయన రాజకీయాలలో వుంటే ఏంటి లేక పోతే మనకేంటి..దమ్ముంటే ఏ శిక్షకైనా సిద్దమే అనాలి.. తనకు తెలీకుండా ఇన్ని లక్షలకోట్లు దారి మళ్ళుతాయా.. అయినా ఆయన గురించి పరిశోధించి నిరూపించే కాలానికి ఆయనా పదవిలో వుంటాడా? లేక ఆయనేమైనా యుక్త వయసులో నవనవలాడుతున్నారా?? అసలు మన దర్యాప్తు సంస్థల స్పీడు తెలీనిదా మనకి..

అందుకే ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?? పాలక వర్గమే భ్రష్టు పట్టి పోయుంటే ఇంక దాని నాలుగు కాళ్ళలో ఒకటి కుంటిదని బాధ పడడం మన వెఱితనం కదా…

కొత్త (ప్రతి) నాయకుడు

Image
జగన్ ను దిల్ కుష్ లో పరామర్శించేందుకు విజయమ్మ బయల్దేరారు..ఇప్పుడే చేరుకొని కొడుకు చెంతకు చేరారు కూడా..
కానీ ఎవరి ఇళ్ళకు వాళ్ళను చేర్చే ఏకైక సాధనమైన ఆర్టీసి బస్సులను రద్దు చేసి రోడ్లన్నీ దిగ్బంధనం చేసిన రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం సామాన్య జనాలను ఇంత ఇబ్బందుల పాల్జేస్తూ అనవసరపు హైప్ సృష్టిస్తూ గత రెండు గంటలుగా భయకంపిత వాతావరణాన్ని మీడియా ద్వారా కల్పిస్తూ  వేలాది మంది పోలీసు బలగాలతో రాష్ట్రమంతా కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించి ‘కొత్త నాయకున్ని’ (తనకు ప్రతినాయకున్ని) కూడా సృష్టించుకుంది…
ఆర్థిక పరమైన నేరానికి పాల్పడ్డారని ఆరోపించబడిన వ్యక్తికి ఇంత పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తూ అనవసరంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతతను చెదరగొడ్తోంది..

దీనిద్వారా తన సొంత చానల్ పత్రికకే పరిమితమైన వ్యక్తి నేడు దేశ వ్యాప్తంగా వున్న మీడియాలో పాపులరవ్వడం ద్వారా తమ కన్ను తామే పొడుచుకున్నట్టైంది. దీని ద్వారా లబ్ధి పొందేది జగనే. ఈ దేశంలో అవినీతి ఆర్థిక నేరాల పట్ల సామాన్య జనం పట్టించుకున్న దాఖలాలే లేవు. అసలు ఏది నేరమో దేనిని ఏ స్థాయిలో శిక్షించాలో కూడా సరిగా స్పందించలేని న్యాయవ్యవస్థకూడా మనదే. అతి పెద్ద నేరాలు చేసిన వారిని చిన్న చిన్న మందలింపులతో వదిలేసిన దాఖలాలు చాలా. ఇలా ఇప్పటికే ప్రజలలో దీనిపట్ల ఎన్నికల ప్రచారానికి జగన్ వెళ్ళకుండా అడ్డుకోవడం ద్వారా తాము లబ్ధి పొందాలనుకోవడం అలాగే తమ నాయకుని పరిపాలన అంతా అవినీతిమయంగా పేర్కొనడం ద్వారా అది తమ నెత్తిపై సి.బి.ఐ. భస్మాసుర హస్తంగా మారిందన్నది త్వరలో తెలుసుకోబోతోంది…

చీమలు పెట్టిన పుట్టలు…

చీమలు పెట్టిన పుట్టలు పాముల పాలైనట్లు పుట్టపర్తి పుట్టలో బంగారు బాబా కూడబెట్టింది పాముల పాలౌతోంది…ప్చ్…

అంతా చోద్యం చూస్తున్నారు….

సామాన్యులెప్పుడూ నిస్సహాయులౌతున్నారు…

అందరూ శ్రీ వైష్ణవులే…చాపలోని చేపలు మాత్రం హుష్…

ఐతే అయినోడి పెళ్ళి లేకపోతే గులాపోడి పెళ్ళి (కడపోరు)

కడప ఉప ఎన్నికలు జరుగుతాయన్నప్పటినుంచి రాష్ట్ర పాలన స్తంభింప జేసి మంత్రులు, అధికార పార్టీ MLA లు మేమే వైఎస్ వారసులమంటూ ప్రకటనల మీద ప్రకటనలు గుప్పించి ప్రజలంతా తమ వైపే వున్నారని, గెలుపు మాదేనని తొడలు గొట్టి మీసాలు మెలేసిన వారంతా పోలింగ్ ముగిసిన తరువాత సెంటిమెంటు సెంటంతా జగన్ కే అంటుకుందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అధికారులు జగన్ కు పనిచేసారని ఆరోపణలు అధికారంలో వున్నవారే చేయడం వాళ్ళ అసమర్థతకు గుర్తుకాదా?

ఈ సందర్భంగా మా అమ్మమ్మ జెప్పిన ఈ సామెత గుర్తుకు వచ్చింది.. ఐతే అయినోడి పెళ్ళి లేకపోతే గులాపోడి పెళ్ళి అన్నట్లు ప్రవర్తిస్తున్నారు….

ఈ ఎన్నికల సందర్భంగా అధికార ప్రతిపక్షం వాళ్ళు ఎంత నిస్సిగ్గుగా డబ్బు మద్యం పంచారో చూస్తుంటే ఎన్నికలంటేనే అసహ్యం వేస్తోంది..

జనం కూడా ఇంతలా అమ్ముడుపోవడం ఇంతకుముందు జరిగినా ఇప్పుడు మరింత పబ్లిక్ గా బరితెగించడం చూస్తుంటే ప్రజాస్వామ్యం ఖూనీ కావడంలో ఎవరి పాత్రా తక్కువకాదన్నది నిష్ఠుర సత్యం…

ముగిసిన ప్రచారంకం – పంపకం ముమ్మరం..

ఉప ఎన్నికలే పరమావధిగా మారిన పాలక ప్రతిపక్షాలు రెన్నెళ్ళుగా ఒకరిపై ఒకరు ఇంత బురద, ఇన్ని రాళ్ళు, చెప్పులు విసురుకొని వీళ్ళంతా ఇంత చీదర గాళ్ళా అని జనం ముక్కును గట్టిగా మూసుకుంటే చెవులు కళ్ళు మూసుకోలేక ఇబ్బంది పడగా ఈ రోజుతో ఆ అంకం ముగిసింది.. ఇప్పుడింక పంపకాల పబ్బంతో ఎవరెంత మూటలు విప్పితే అన్ని ఓట్ల మూటలు రాలుతాయా????

మన హీరోలు

గుండెల్లో చేవ వుండాలే గానీ
నేడు చెప్పు కూడా ఓ నిరసనాయుధమే
వెధవల మొహంపైకి చెప్పు విసిరి
తన గుండెలోని మంటను చల్లార్చుకోవడం
ఓ పెద్ద ఉపశమనం
వాడు బుష్ ఐనా, మోడీ ఐనా, అద్వానీ ఐనా,
కల్మాడి ఐనా ఒక్కొక్కరు ఒక్కొ తరహా
నియంతలు.. అవినీతి కూపాలు..
అల్ జైదీ నుండి నేటి కపిల్ ఠాకూర్ వరకు
అంతా మన హీరోలే

వై.ఎస్.వుంటేనా…

ఈ రోజు శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన డి.ఎస్.ముందు ఒక సర్పంచ్ సుమారు అరవై ఏళ్ళకు పైగా వున్న పెద్దాయన జరిగిన పంట నష్టం గురించి వివరిస్తూ, ఉపాధి హామీ పథకం వలన వలస పోయే కూలీలు తగ్గినా వ్యవసాయ కూలీ రేట్లు పెరిగి వ్యవసాయం పెట్టుబడి అధికమైందని వివరిస్తూ, తుఫాను వలన జరిగిన పంట నష్టానికి ఇదే సమయంలో వై.ఎస్. గనక వుంటే నేనున్నానని అని తన ప్రసంగం కొనసాగిస్తుండగా ప్రక్కనున్న ప్రభుత్వ విప్ కోండ్రు మురళి మైక్ లాక్కుని, ప్రతిపక్షాలు అసెంబ్లీని అడ్డుకుంటున్నాయని, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి సోనియా గాంధీ సహకారంతో సాయం చేసే వారని అన్నప్పుడు జనం వై.ఎస్.ఆర్.జిందాబాద్ నినాదాలతో సమాధానమిచ్చారు. మురళి లాంటి నడమంత్రపు సిరి రాజకీయ నాయకులు అలా ఓ సర్పంచ్ మాట్లాడుతుండగా మైక్ లాక్కోవడం చూస్తుంటే రాజకీయ ఊసరవెల్లులు ఎలా ప్రవర్తిస్తారో కళ్ళముందు కనబడింది.

జరిగిన అవినీతి, ఆశ్రిత పక్షపాతం వీటన్నింటికీ కారణంగా వై.ఎస్.ను ఎంతలా విమర్శించినా సామాన్య జనంలో ఆయనకున్న పేరు ఇంత తొందరగా మసిబారదనిపిస్తోంది..

ఇన్నాళ్ళకు తప్పు తెలిసొచ్చిందా?

ప్రభుత్వ కార్యక్రమాలన్నింటికీ ఆఖరికి మరుగుదొడ్ల నిర్మాణాలకు కూడా జాతీయనాయకుల పేర్లు పెట్టి వారి పరువుతీస్తున్న తమ పార్టీ ప్రభుత్వాల తీరును అడ్డుకొనే క్రమంలో ఇకనుండీ ఏ పథకానికి పడితే ఆ పథకానికి ఇందిరా రాజీవ్ ల పేర్లు పెట్టొద్దని హుకుం జారీ చేసారని వార్త. ఇన్నాళ్ళకు తమ పధకాలలోని డొల్ల తనం గుర్తొచ్చి దాని పర్యవసానం పట్ల గ్రహింపు కలిగినట్లుంది హైకమాండ్ వారికి ఇకనైనా ఈ సాగతీత పేర్లతో విముక్తి కలుగుతున్నందుకు సంతసిద్దాం..

నిజం ఒప్పుకున్న అల్లు..

దండుకున్నోడికి దండుకున్నంత


ప్రరాపా పార్టీ పతనానికి మూలవిరాట్టుగా విమర్శలనెదుర్కొన్న అల్లు అరవింద్ నే మరల దిక్కులేక చిరంజీవి ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టారు. ఈ సందర్భంగా అల్లు మీడియాతో మాటాడుతూ నేను పార్టీ గేట్ కీపర్ ని మాత్రమేనని చెప్పినట్లు వార్త. అంటే ఈయన గారిని దాటి ఎవరూ లోపలికి రాలేరు అనే కదా? ఇంత కాస్ట్లీ గేట్ కీపర్ ని దాటి రావాలంటే సామాన్యులకు చాలా కష్టమైన పనే. అది గత ఎన్నికలలో స్పష్టమైంది. ఏమాత్రం సామాన్య జనాలకు చేరువ కాలేకపోయిన ఈ పార్టీ తన గోతిని తానె తవ్వుకుందన్నది స్పష్టం. బంధుగణ సమూహంగా ఏర్పడి అదే బంధుగణ పీడనతో తెరమరుగైంది. పాపం చిరంజీవని అనగలమా?

వార్త ఆధారంః http://www.teluguone.com/news/2010/09/26/i-m-only-gate-keeper-in-prp-allu-aravind/

జగన్ ఓదార్పు పొందనివ్వండి

తనకంటూ ఒక మార్గాన్ని ఎంచుకున్న జగనోహన్ రెడ్డిని కొనసాగనిస్తే అది ఆయనకు మేలో కీడో అది ఆయన స్వంత వ్యవహారం. కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా తనను తాను సంతృప్తి పరుచుకోలేకపోతున్న ఆయన తీరు స్పష్టమవుతోంది. తన తండ్రిలాగానే తాను పార్టీలో కొనసాగుతూనే తాను ఒంటరిని కాదని, ప్రజలలో తమకంటూ ఓ గుర్తింపు వుందన్న దానిని నిరూపించుకోవాలన్న నిర్ణయం వలన అది పార్టీకి బలాన్నిస్తుందిగా గుర్తించలేని అధిష్టానం తాము పట్టిన పట్టు విడవక పోవడం కూడా జనం హర్షించడం లేదు. ఇక్కడ ఉత్తరాంధ్రలో జనం ఫీలింగ్ ఇది. చాలా మంది ఈ మధ్య జరిగిన పథకాల సర్వేలో అర్హులై కోల్పోయిన వారు, సంక్షేమ పథకాల పట్ల నేటి ప్రభుత్వానికి వున్న నిర్లక్ష్యాన్ని జీర్ణించుకోలేక వై.ఎస్. వారసుడు వస్తే బాగుణ్ణు అని అనుకుంటున్న మాటలు వినబడుతున్నాయి. సామాన్య జనానికి ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేదు. అలాగే మంత్రులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, జనం కొనుగోలు శక్తి పెరిగింది కాబట్టే ధరలు పెరిగినా పర్వాలేదన్న బాధ్యతా రాహిత్య మాటలు వారిని మరింత కుంగదీస్తున్నాయి. దీంతో మరల వారసత్వం వైపు మొగ్గుచూపుతున్నారు. అట్టడుగు ప్రజానీకంలో ఇప్పటికే రోశయ్య గారిపై విముఖత ఏర్పడుతోంది. దీనిని జగన్ తనకు అనుకూలంగా మలచుకోజూస్తున్నారు. తమకు దక్కిన అధికారం మూన్నాళ్ళ ముచ్చట జేసిన అధిష్టానంను ఎదుర్కొనేందుకు సిద్ధపడుతున్నారు. దీనిని అడ్డుకునేందుకు సర్వశక్తులొడ్డుతున్న రోశయ్య చాణక్య ఎత్తుగడలు సామాన్య జనం ముందు పారడంలేదు. 78 ఏళ్ళుగా బయట జరుపుకోని జన్మదినాన్ని రాష్ట్రపతి చేతులు మీదుగా జరుపుకొనడం, వై.ఎస్.జన్మదినం ముందు రోజునుండే ఎన్నడూ జూలైలో జరపని అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుపబూనడం తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడమే, ఇది జగన్ ను మరింత రెచ్చగొట్టి వుంటుంది. కానీ దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకో జూసే అవకాశ వాద రాజకీయ దళారీ MLA లు, మంత్రులు తన వెనక రాకపోవచ్చు. దీనిని జనంలో బయటపెట్టడం అవసరం.  దూరమవుతున్న వీరిని నమ్ముకొనడం కంటే జనాన్ని నమ్ముకోవడమే ఉత్తమం. తద్వారా ఓదార్పు పొందవచ్చు. ఇదంతా మా ప్రాంత  గ్రామీణ జనంలో వున్న భావానికి అక్షర రూపం.