అమ్మకానికి న్యాయం…

ఇదేమైనా మనకు కొత్త వార్తా…

లేక మనకు మింగుడు పడనిదా…

గాలి జనార్థన రెడ్డికి ఐదు కోట్లు లంచం తీసుకొని బైల్ ఇచ్చారంట న్యాయమూర్తిగారు..

ఏదో కక్కుర్తిపడ్డారు ఆయన గారు..దానికి ఇంత పెద్ద వార్త చేసి బిల్డప్ ఇచ్చాయి ఈ రోజు వార్తా పత్రికలు..దీనిని సామాన్య జనం ఏమైనా చదివి రోడ్లెక్కి అబ్బో ఆ న్యాయమూర్తిగార్ని శిక్షించి న్యాయ దేవత శీలాన్ని కాపాడండి అని గగ్గోలు పెడతారా ఎక్కడైనా ఎప్పుడైనా..

నీకు వ్యతిరేకంగా వున్న వాడి గురించి ఇంతింత బాక్స్ ఐటంలు కట్టి రాస్తావే కానీ అదే నీ దగ్గరివాడో లేక నీ పార్టీవాడో చేసినప్పుడు అశ్వథ్థామ హతః అన్న స్టైల్లో ఎక్కడో ఆరో పేజీలో రాస్తున్నావే..మరి నీకెక్కడి బాధ్యత వుంది.. అందుకే ఇలాంటివి ఎవడూ పట్టించుకోవడం మానేసాడు..

వాడికి డబ్బు ఎక్కువుంది..అమ్ముడుపోయే వాడు దొరికినప్పుడూ వీజీగా కొనుక్కున్నాడు.. అసలు ఇలా మేనేజ్ చేయడం కొత్తనా…ఎవడికి అవకాశమున్నంత మేరా వాడు ఈ దేశంలో చేసుకు పోతూనే వున్నాడు కదా..

మన దేశ ప్రధానమంత్రివర్యుల పాలనా కాలంలో ఎన్ని కోట్ల రూపాయల కుంభకోణాలు వెలుగులోకొచ్చినా వారు మాత్రం నాకే మసి అంటనేలేదు.. నిరూపిస్తే రాజకీయాలనుండి తప్పుకుంటానంటారు..అంటే ఆయన రాజకీయం చేస్తున్నట్టే కదా..మరి ఆయనెన్నడైనా ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డారా?? అసలు ఆయన రాజకీయాలలో వుంటే ఏంటి లేక పోతే మనకేంటి..దమ్ముంటే ఏ శిక్షకైనా సిద్దమే అనాలి.. తనకు తెలీకుండా ఇన్ని లక్షలకోట్లు దారి మళ్ళుతాయా.. అయినా ఆయన గురించి పరిశోధించి నిరూపించే కాలానికి ఆయనా పదవిలో వుంటాడా? లేక ఆయనేమైనా యుక్త వయసులో నవనవలాడుతున్నారా?? అసలు మన దర్యాప్తు సంస్థల స్పీడు తెలీనిదా మనకి..

అందుకే ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?? పాలక వర్గమే భ్రష్టు పట్టి పోయుంటే ఇంక దాని నాలుగు కాళ్ళలో ఒకటి కుంటిదని బాధ పడడం మన వెఱితనం కదా…

తారలు ఈ సమాజపు నిలువెత్తు ప్రశ్నలు కారా??


ఇటీవల ఆంధ్రజ్యోతి వారి టీవి చానల్ ద్వారా పత్రిక ద్వారా ఏదో ఓ పెద్ద నేరస్తురాలిని పట్టుకున్నట్టు, తన ఒక్క దాని వల్లనే ఈ తెలుగునేలంతా కుళ్ళిపోతున్నట్టు రోజంతా ఊదరగొట్టి రోజూ కథనాలు ప్రచురిస్తూంది. ఈరోజుకు రాజకీయ నాయకులు, వారి తాబేదార్లు, పోలీసులకు తనతో లింకులు వున్నాయని వాటిని బయటపెట్టుతూ తనను తాను రక్షించుకోజూస్తున్నట్టు కథనం రాసింది. అలాగే కొంతమంది రా.నా.ల వలన తనకు బెదిరింపులొస్తున్నట్టుగా కూడా.. ఒంటరిగా వున్న ఆడదానిని చంపేయడం అదీ ఇలా ముద్ర పడ్డ వాళ్ళని ఏం చేసినా ఈ సమాజం హర్షిస్తుందిలే ఆన్న ధీమా వున్న వాళ్ళు ఏమైనా చేయొచ్చు..

అసలు మీడియా అంత పవిత్రంగా ఏడిసిందా ఈ దేశంలో???

అసలు ఇది తారా చౌదరితోనే మొదలయ్యిందా? లేక అమ్మె ఒక్క దానితోనే అంతమయిపోతుందా.. ఇలాంటి వారు ఈ సమాజంలోంచి వస్తున్న వారే కాదా?? ఎంతమంది జీవితాలను ఈ సమాజం నాశనం చేస్తూ వాళ్ళని ఇలా పెడదోవ పట్టడానికి దోహదం చేయడంలేదు. రాజకీయనాయకులు, అధికార గణం వీరిని ఇలా తయారు కావడంలో పాత్ర వహించడం లేదా.. వ్యభిచార వృత్తి మన సమాజంలో అంతర్లీనంగా అంగీకరింప బడుతూ శతాబ్ధాలుగా వస్తున్నదే కదా… మరి తారా చౌదరి వలన నష్టమెవరికి జరిగింది. ఏదో పెద్ద స్టింగ్ ఆపరేషన్ తో పట్టుకున్నటు బిల్డప్ ఇచ్చి అదో దేశ ద్రోహ నేరంలా మీడియా చూపుతోంది.. వారిని సంస్కరించాల్సింది పోయి వాళ్ళ ఫోటోలు వేసి వాళ్ళను మరింత కుంగిపోయేట్టు చేయడం ద్వారా ఉపయోగముంటుందా…లేదంటే వాళ్ళు మరింత మొరటుగా తయారవ్వడానికి ఈ ప్రచారం ద్వారా మరింత పెరగడానికైనా ఉపయోగపడుతుంది ఇలాంటి కథనాలు.

కుళ్ళిన సమాజంలో వుంటూ ముక్కు మూసుకున్నామనడం హాస్యాస్పదం కాదా.. ఈ వ్యవస్థలో తారాచౌదరిలు వస్తూనే వుంటారు… వారిని వెంటాడి వేటాడకండి.. వారి తప్పు తెలుసుకొని మారే అవకాశమిద్దాం…

సోనియా ……..చాటున దాగిన చిరు..

భారీకాయం కలిగిన ఏనుగు ఎంత గట్టిగా గాలి వెనక వదులుతుందో అని మునుపుటికి ఒకడు తిరగ్గా తిరగ్గా తుస్ మని వదిలేసిందన్నట్లు పాపం చిరు తన ప్రరాపా సూరీడుని కొంగుచాటున కుంగదీసి నవ్వలేక నవ్వు రాక ఏడ్వలేక కాంగీ కండువాతో చీదుకుంటూ ఈరోజు మాటాడిన మాటలు వింటుంటే ఎంత నవ్వుతాం.. మాటాడితే సోనియమ్మ ఎంత ఆదరించారో అంటాడు. అంతే కానీ ఎంతకు అమ్ముడుపోయానో చెప్పడు. ఇంతా చేస్తే బహిరంగ సభ లేదు కదా ఓ చిన్న గదిలో ఓ రజస్వల కార్యక్రమంలా ముగించేసారు పాపం.. రాహుల్జీ మొఖంలో నవ్వు కూడా లేకపాయే,. అక్కడ అన్నా తలనొప్పితో ఏ మీడియా వాడు ఏమడిగేస్తాడో అని హడావిడిగా ఓ పోజిచ్చి వెళ్ళిపోయినాడు. ఆ తరువాత తెచ్చిన కండువాలు కప్పితే దారితప్పిన నవ్వుతో వేయించుకొని మైకు ముందు ఐదు నిమిషాలు మాటాడి చిరు ముగించేసాడు. ఇంక ఈ తీర్థంతో తానేదో సాధించేస్తానన్న భ్రమలలో జనం లేరని గ్రహింపుకొస్తే మంచిది. సొంత లాభం చూసుకోవడంలో అరవింద్ చేయూత ఎలానూ వుంది కదా….

మరో డ్రామాకు తెరతీసిన నాయకులు

మన రాష్ట్ర రాజకీయ నాయకులు ముఖ్యంగా అధికార పార్టీ వాళ్ళు మరో హైడ్రామాకు తెరతీసారు. రాష్ట్ర పాలనా వ్యవహారంలో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, రైతాంగం నుండి విద్యార్థులు, నిరుద్యోగులు అంతా తీవ్ర సంక్షోభంలో పడిపోయిన సందర్భంలో కేంద్రం కూడా మితిమీరిన పెట్రో ధరలు, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్న సందర్భం, పీకల్లోతు అవినీతి ఊబిలో కూరుకుపోయి ఊపిరాడక మరో మారు తెలంగాణా పేరుతో ఏదో ఒక రకంగా ప్రజల దృష్టిని మళ్ళించేందుకు వారి సభ్యుల రాజీనామా ఎత్తుగడలను చూపుతూ ఏదో జరిగిపోతుందన్న గాభరా సృష్టించి ప్రజలను అయోమయంలో పడేసి, రెచ్చగొట్టి ఊరికే తిని కూచునే తమ బలగాలను ఉసిగొలిపి మంట రేపే ప్రయత్నమే జరుగుతోందనిపిస్తోంది.. ఈ హైడ్రామాకు ప్రజలే తెరదించాల్సిన సమయం ఆసన్నమైంది. బీ వేర్ ఆఫ్ దీస్ ఆలీబాబా నలబై ఒక్క దొంగలు…

ఏదో ఒక బొమ్మే కదా సారూ…

నేను తోలుబొమ్మను కాను.. మన్మోహన్జీ…

కాకపోతే

పిండిబొమ్మో, రబ్బరు బొమ్మో, చెక్క బొమ్మో…

మొత్తానికి ఏదో ఒక బొమ్మేనని ఒప్పుకున్నారు కదా సారూ….

నాయకుడు కాని వాడా? కాలేని వాడా?

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఆజాద్ గారు కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా నాయకుడు కాడని, నాయకుడుగా ఎదిగేందుకు సమయం పడుతుందని, అంతదాకా అలా వుండనివ్వండని సెలవిచ్చారు.. వై.ఎస్.కు నాయకుడు కావడానికి నలభై ఏళ్ళు పట్టిందన్నారు.. మరి ఈయనకు ఎన్నేళ్ళు టైమ్ ఇవ్వాల్సింది?  

మరి అటు పార్టీ నాయకుడు కాక, ప్రజలభీష్టం మేరకు ఎన్నిక కాని వాడ్ని సి.ఎం. చేసిన అధిష్టానం బుద్దిలేనితనమా? ఆయన గుండు గీయించాడు సరే..కానీ పాలనా వ్యవహారాలలో కూడా గుండు సున్నాగా మిగిలిపోతున్నారు..

ఇంక పులి మీద పుట్రలా మా బొత్స బావ్ అధికార పగ్గాలు చేపట్టాడు.. ఇప్పటికే ఇద్దరి మధ్య అనురాగం అంతంత మాత్రమే.. త్వరలో ఈ సీను అటూ ఇటూ మారనుందా?

వీళ్ళ గురించి వీళ్ళేమనుకుంటున్నారో???

తెగిన గాలిపటాలు

వీళ్ళకిప్పుడు రాజకీయాలెందుకు??

వీళ్ళు ఎందులో వుంటే మనకెందుకు???

వీళ్ళ గురించి వీళ్ళకున్న అభిప్రాయమేమిటో???

మీడియాలో స్పేసెందుకు దండగ కాదా???

అన్ని రోడ్లు కడపవైపే!!!

కడప ఉపఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డప్పటినుండీ రాష్ట్రంలో పరిపాలన స్తంభించిపోయింది..

సచివాలయానికి సెలవు ప్రకటించినట్లుగా మంత్రులందరూ కడపలో మకాం వేసారు. వేలాదిమంది పోలీసుల మోహరింపు, అధికార గణం కూడా అక్కడే తిష్టవేయడం ఒక MP & MLA సీటుకు యింతగా ప్రాధాన్యమిచ్చి మొత్తం రాష్ట్ర పరిపాలనను స్తంభింపజేయడం ఘోరం..

రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా రైతాంగం దిక్కుతోచని పరిస్థితుల్లో వుంది..

వైద్యారోగ్య శాఖ మంత్రివారు పోటీలో వుండి ఆ శాఖ బిక్కమొహం వేసింది.

ముఖ్యమంత్రి దగ్గరనుండి కాంగ్రెస్ అధిష్టానం వరకు అంతా జగన్ మెజారిటీని తగ్గించే ప్రయత్నాలలో పడి పాలనను మరిచిపోయారు…కోట్లాది రూపాయల సొమ్ము ప్రవహిస్తోంది..

ఇంత అధికార దుర్వినియోగంతో ఎన్నికలు నిర్వహిస్తున్నా ఎన్నికల కమీషన్ చేష్టలుడిగి చూడటం దాని నిస్సహాయతను తెలియజేస్తోంది…

మహిళలపై పెరిగిన దాడులు-పోలీసుల రాజీమార్గాలు

ఇటీవల కాలంలో రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. ఆడపిల్ల బయటకు వెళ్ళి రావాలంటే ప్రాణాలరచేత్తో పట్టుకోవాల్సిన పరిస్థితి తల్లిదండ్రులది.. మహిళా హోం మంత్రిగారి హయాంలో మరీ పెట్రేగిపోతున్న ఆకతాయిలు, ఆ తరువాత డబ్బులుంటే చాలు కేసులు మాఫీ అవుతున్నాయన్న భరోసా పెరిగిపోయింది…

ఉదాహరణకు ఈ నెల పదమూడో తారీఖున శిరీష అనే ఎం.బి.ఏ. విద్యార్థినిపై మోటార్ బైక్ పై వచ్చి దాడి జరిగితే మూడు వేళ్ళు తెగి పదిహేను అడుగుల దూరంలో పడితే అది ప్రమాదవశాత్తు జరిగిందని సెలవిస్తున్న పోలీసుల తీరు అనుమానాస్పదంగా వుంది. ఏవిధమైన ఆయుధంతో దాడి చేయకపోతే చేతి వేళ్ళు ఎలా తెగిపడతాయి? అలాగే ఎప్పటినుండో ప్రేమించమని వేధిస్తున్న వ్యక్తి కావాలని దాడి చేయకపోతే అది వీళ్ళన్న ప్రమాదమైనా ఆ వ్యక్తి ద్వారానే జరిగివుండాల్సిన అవసరముండేదా అన్నది సామాన్యులుగా మనకే తెలుస్తున్న జవాబు. అంతకుముందు పోలీసు స్టేషన్ లో వేధింపులపై రిపోర్టు ఇస్తే రాజీ చేసుకోమని సెలవిచ్చిన పోలీసు అధికారులు వాళ్ళ అమ్మాయిలపట్ల ఎవరైనా ఇలానే ప్రవర్తిస్తే రాజీకి వస్తారా? ఇంక ఈ సీను పై ఆ ప్రదేశంలో వున్న సాక్షులను అడిగితే రెప్పపాటులో జరిగిపోయిందిమేమేమీ చెప్పలేమన్నారని నిన్నటి వార్త. ఇప్పుడు నూటఎనిమిది కి అక్కడి నుండి వెల్లిన కాల్స్ లో ప్రమాద కారకుడైన వాడిదే మొదటినెం.అని చెప్పడమ్ బట్టి చూస్తే కేసును ఎలా మూసివేయాలో బాగా ఆలోచించి చేస్తున్నట్టున్నారనిపించడంలేదా? వీళ్ళు కేసును పక్కదోవపట్టించాలంటే ఏమైనా చేయగలరని నిరూపితమౌతోంది. జరిగింది ప్రమాదమన్నవారు ఫోరెన్సిక్ లాబ్ కు పంపారంట. వాళ్ళేలా ఈ కేసులో తేలుస్తారు? ఇది హాస్యాస్పదంగాలేదా? చేతి పై ఎంత పదునైన ఆయుధంతో దాడి జరగకపోతే వేళ్ళు అదీ మూడువేళ్ళు తెగిపడతాయా?

ఆడపిల్లల్ని కనడమే నేరమా? అటు విశాఖలో ఉపాద్యాయురాలిని ఘోరంగా  బడిపిల్లలముందే నరికి చంపాడొకడు. ఎక్కడున్నాం మనం? ఎటువైపు మన ప్రయాణం?

వార్త ఆధారం

దగ్గరౌతున్న చంద్రుడు – బద్ధలవుతున్న భూమి

విలయం

చల్లగా వున్నాడని ఇన్నాళ్ళు మురిపించిన చందమామ ఈనెల 19 నాటికి భూమికి అత్యంత చేరువగా వస్తున్నాడన్న వార్తలు ఆ తరువాత జరిగే పరిణామాల గురించి ముందే హెచ్చరికలున్నా జపాన్ ను సునామీ ముంచెత్తడంతో జరిగిన భారీ నష్టం కలచివేసింది. ఇంకా చాలా నగరాలు ఈ ప్రభావానికి లోను కావడానికి ఆస్కారముందన్న వార్తలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. మన దేశం మాత్రం మినహాయింపన్న శాస్త్రవేత్తల వార్త కొంత ఊరట. టీవీలలో న్యూయార్క్ నగరం కింద నేలలో బీటలు వున్నాయని అది ప్రళయానికి దారితీస్తుందని వార్త. ఈ రోజంతా ఇలా భయం భయంగాను, జపాన్ కు జరిగిన అపార నష్టానికి ఆవేదనతోను గడిచిపోయింది. తెల్లవారుతుందా?