మరో సామాన్యుని పక్షపాతి (K.G.కన్నాభిరాన్) ఇకలేరు

హక్కుల వాది


ఆయనను
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్
మానవహక్కుల కొరకు ఉద్విగ్నంగా పోరాడే న్యాయవాది’
అంది..

నక్సల్బరీ తరం నాయకుడు
సత్యనారాయణసింగ్
‘ప్రాసిక్యూటర్లకు ప్రాసిక్యూటర్’ అన్నాడు..

ఒకప్పటి మానవహక్కుల నేత, జర్నలిస్టు,
ఇప్పుడు సంఘపరివార్ సిద్ధాంతకర్త
అరుణ్ శౌరి
‘లోకాధివక్త’ అన్నాడు..

ఆయన
నాలుగు దశాబ్ధాలుగా
న్యాయవాద వృత్తిలో
పోరాడే ప్రజల హక్కుల
పరిరక్షణ కోసం
అహర్నిశలు శ్రమిస్తున్న
అసాధారణ మేధావి

ఆంధ్రదేశంలోనే కాదు
దేశం మొత్తానికే
పౌర, ప్రజాతంత్ర హక్కుల స్ఫూర్తికి
పర్యాయ పదంగా ఎదిగినవాడు

మనిషిగా సామాన్యుడు
వాదనా పటిమలో అసామాన్యుడు
తోటి మనిషి హక్కులను కాపాడడంలో అనితర సాధ్యుడు

పై వాక్యాలన్నీ చదవగానే ఈ తెలుగునేలపై వున్న ఆ అసామాన్యుడు ఎవరో ఇప్పటికే అర్థమై వుంటుంది. ఈ వాక్యాలు 24 గంటలు అన్న ఆయన ఆత్మకథాత్మక సామాజిక చిత్రం అనే పుస్తకం వెనక అట్టమీదున్నవి. ఆయనే మనందరి హక్కుల న్యాయవాది కె.జీ.కన్నాభిరాన్. ఆయన ఈ సాయంత్రం 5.00 గం.ల ప్రాంతంలో అమరులయ్యారన్న వార్త సామాన్యులకు, నిరంతరం నిర్బంధాన్ని ఎదుర్కొంటున్న వారికి అశనిపాతం. ఆయన లాంటి మరో న్యాయవాది పేదలకు, తాడిత, పీడిత వర్గాలకు ఇప్పట్లో మరల లభ్యంకావడం దుర్లభం. ఈ రోజుల్లో మనుషులలో పెరిగిపోతున్న నిర్లిప్తత, నిర్లక్ష్యం, వ్యక్తివాద ధోరణి, స్వార్థం మానవత్వాన్ని చంపేస్తున్న వేళ అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభం కాలంలో ఇది అశనిపాతం..

జోహార్ కన్నాభిరాన్ జోహార్ జోహార్..

సా ‘మాన్యుని’ కి వందనం..

భారతరత్న


ప్రజా నాయకుడంటే యిలా వుండాలని జీవించి చూపించిన మన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారిని తన 107వ జన్మదినం సందర్భంగా తలచుకోవడం ఈ కాలం చాలా అవసరం. చిన్ననాటినుండి నిరాడంబర జీవితాన్ని గడిపిన శాస్త్రి తనకు వరకట్నంగా ఓ చరఖాను, కొంత నూలును తీసుకున్నారంటే ఆయన తన జీవన శైలిని ఎంతగా రూపుదిద్దుకున్నారో ఆశ్చర్యం. జీవితమంతా తను నమ్మిన విలువలకు కట్టుబడి మంత్రిపదవిని కూడా తృణప్రాయంగా త్యజించిన మానధనుడు. తను ప్రధానిగా ఎన్నికైన క్లిష్టకాలంలో దేశాన్ని ఏకతాటిపై నిలబెట్టిన జైజవాన్ జైకిసాన్ నినాదాన్ని అందించిన స్ఫూర్తిప్రదాత శాస్త్రీజీ. ఈ నినాదాంతో ఆయన పాకిస్తాన్ తో జరిగిన యుద్ధాన్నే గెలిపించి చూపించిన ధీశాలి. మఱిమాను కింద మరో వృక్షం మొలవదన్నట్లు ప్రముఖుల భజనలలో అసలు సిసలు భారతీయుడైన శాస్త్రీని గుర్తుపెట్టుకోవడం కష్టమే. జీవితమంతా ఓ నులకమంచంపైనే సాగించిన రాజకీయ నాయకున్ని ఈ కాలం ఊహించగలమా? మిస్టరీగా మిగిలిన ఆయన మరణం ఎప్పటికీ జవాబులేని ప్రశ్నలా మిగిలిపోవడం విషాదం..

ఇప్పటికీ ఇలా ఇంకా నినదించాల్సిన అవసరముందన్నది అంతా గుర్తుచేసుకుందామా??

జైజవాన్
జైకిసాన్

రేపు ఫీనిక్స్ పక్షిలా ఎగిరివస్తాం..

గాడుపు వీచిన ప్రతిసారీ
తొలకరి జల్లు కురుస్తు౦ది
భూమ్మీద పడ్డ విత్తనం
మొలకెత్తి మానవ్వక మానదు

నేడు నువ్వు తగలబెట్టిన బూడిదలోని౦చి
రేపు ఫీనిక్స్ పక్షిలా ఎగిరివస్తాం
ఓడి గెలవడమే చరిత్ర
వెనకడుగు వేసినది
అడ్డుగా వున్న దానిమీ౦చి ఎగిరి రావడానికే…

వీరజవానులు-హిమపాశం


మనం రోజూ యింత ధైర్యంగా గుండెలపై చేయేసుకొని నిదురపోతున్నామంటే

రేపటి సూర్యోదయం చూస్తున్నామంటే ..

మన రోజువారీ  వ్యాపారాలు, వ్యవహారాలు

ప్రేమలు, పెళ్ళిళ్ళు, పురుడులు, చావులు,

ఎన్నికలు-రాజకీయాలు, ఉద్యమాలు, ధర్నాలు,

వంటలూ-వార్పులూ,

సినిమా రిలీజులు, గలీజులు,

పబ్ లూ-బార్లూ , తాగుడూ-తూలుడూ..

కుట్రలూ-కుహకాలు,

అంతా సాఫీగా, సాదాగా, భారీగా

ఎవరికి వారి పరిమాణంలో

జరిగిపోతున్నాయంటే

వీటి వెనక ఓ అదృశ్య శక్తి అదే మన

వీరజవానుల రెప్పవేయని కాపలా

వారినే కప్పిన హిమపాతం యమపాశమయి

వారి కలలను కల్లలు చేయడం పెను విషాదం

వారి అమరత్వానికి నా గుండెలనిండిన  నిలువెత్తు SALUET

(కాశ్మీర్ దగ్గర్లోని గుల్బర్గా వద్ద హిమతుఫాన్ లో చిక్కుకొని అమరులైన 17 మంది వీరజవానుల స్మృతిలో)

ఉద్యమాల సంద్రమే

గుండె గుండెంతా

గాయాల కూడలైనప్పుడు

జీవితం

పోరాటాలకేంద్రమే

ఉప్పొంగే

ఉద్యమాల సంద్రమే.

..అలిశెట్టి ప్రభాకర్  (12.01.1954-12.01.1993)

(అంతిమ శ్వాసదాకా విప్లవోద్యమ అభిమానీ, కవితా చిత్రశిల్పీ, ఫోటో చిత్రకారుడూ అయిన ప్రభాకర్ స్మృతిలో ఆయన పదునైన కవితా పాదం)

కాలరెత్తిన దళితుడు

ఒంటినిండా బట్టా

కడుపునిండా తిండే కాదు

మనిషిగా గుర్తింపుకోసం

నీ యుగాల ఆక్రందనను

ఎలుగెత్తి చాటిన

దళిత జాతి సింహగర్జన

జై భీం

అందుకో మా ఆత్మగౌరవ

పోరాట వందనాలు

శ్రీకాంత్ అమర్ రహే..

ఒక ఆవేదనా పూరిత
ఆవేశ క్షణాన
ఇన్నినాళ్ళు నీ నేల తల్లిని చెరబట్టిన
వారికి కొరివి పెట్టాలన్న నీ
కోరికను బిగ్గరగా నినదించేందుకు
నీవే కొవ్వొత్తివై
భవిష్యత్ తరాల జీవితాలకు
దివిటీగా మారే నీ
స్వచ్చమైన గొంతును
ఇలా బలిదానం చేసి
మా వెన్నులోని చలిని పటాపంచలు
చేసిన నీ త్యాగం
నూతన తెలంగాణా  చరిత్ర పుటల్లో
నెత్తుటి తడి అక్షరాల మద్య
సజీవం మిత్రమా…
నీ ఆశయం నెరవేరేందుకు
నేడు లక్షలాది పాదాలు కదులుతున్నాయి..

జయహో ముంబై

ముంబై – ఇది  ఒక గాయపడ్డ నగరం

నెత్తురోడుతున్న నగరం

సామాన్యుడి నెత్తురితో హోళీ ఆడుతున్న నగరం

గత్యంతరం లేక డబ్బావాలా సాగిపోతున్న నగరం

 

మీ నవ్వు వెనకాల దాగిన దుఖం

బిగబట్టిన మీ పెదవి వెనకాల దాగిన దృశ్యం

మా గుండెల్లో పదిలం…