నీచ రాజకీయులు

పార్లమెంటరీ రాజకీయాలు ఎంత కుళ్ళు కంపుకొడుతున్నాయో అందరికీ అవగతమవుతోంది…

అసెంబ్లీ హాలులో బూతు బొమ్మలు చూస్తూ గడిపేవారు కొందరు…

జనం నెత్తురు తాగుతూ కోట్లరూపాయల సారా వ్యాపారం చేస్తూ పట్టుబడితే కులం పేరుతో తప్పుకోజూసే వాడొకడు…

శాఖల కోతలతో అగ్గిమీద గుగ్గిలమవుతాడొకడు…

బట్టీలకు బట్టీలు సారా వ్యాపారం చేస్తున్న వాడు అధినాయకుడై కూచుంటాడు పైన,

మోజు పడి మహిళను లోబర్చుకొని చంపిస్తాడొక మంత్రివర్యుడు….

వీళ్ళ డొక్కలు శుద్ధి జేయడానికే సరిపోతుంటే పరిపాలనెవడు జేస్తాడు…

వీళ్ళ అధికార ధాహం దన మదాంధకారాలతో జనం నెత్తిన కూచున్న ఈ రాజకీయ నీచులను పాతరెయ్యాలి….

ఆడి సేతులల్ల బెమ్మజెముడు మొలిసియ్య…

ఖాకీచకుడు

అప్పా, ఓలప్పా ఏటే ఇలాగోసిపోయింది నీ సెయ్యి, బుగ్గ మీదేటే అలా కమిలిపోయింది అంటూ వొచ్చింది వరలక్ష్మి రాములమ్మ ఇంటికి..

రాయే తల్లీ లచ్మీ.. ఏటి సెప్పమంతావే, మా ఆశా వర్కర్లమందరం కలిసి మన మండలం నుండి ఉదయం పాసెంజిరెక్కి విజీనగరం యూనియనోళ్ళు రమ్మన్నారని ఎల్లినాం… అలా ఎల్లి రైలు టేసను నుండి బయటకు వస్తూనే అందరం రెండు లైన్లుగా ఇడిపోయి జీతాలు పెంచాలని, యూనిపారాలివ్వాలని గట్టిగా అరుసుకుంటూ కలెకటేరాపీసు వైపు నడుత్తున్నాం. ఎత్తు బిడ్జీ కాడికి వచ్చే రావడంతోనే పోలీసులడ్డుకున్నారు.. ఇంతమందిమి మేముండగా ఇద్దరు ఆడపోలీసులు మిగిలినోళ్ళంతా మగపోలీసులే తల్లి.. ఏమయ్యా బాబూ మేము మా సమస్యలు జెప్పుకోటానికి ఎల్తున్నాం, మేమెవలం దుడ్డుకఱలు పట్టుకోనేదు, మా సేతిలో ఏమీలేదు, కాయితాలు తప్ప మరి అడ్డుకుంటున్నారేమయ్యా అని అడిగినారే మా ముందున్నోళ్ళు, సంగం నాయకులు..మీరు ముందుకెల్లడానికీలునేదంతే నేదనీసి లావుపాటి బాబు ఒకటే ఈరంగం.. అయితే మేమిక్కడే కూకుండిపోతాం, కలెకటరు బాబే వత్తాడైతే అనీసి ఎక్కడోళ్ళం అక్కడే రోడ్డుపైన కూసున్నామే… ఇంక ఆ ఆడ పోలీసులు రెచ్చిపోయి ఏటే నెగండే నంజిల్లారా అని గదమాయించేసరికి, బొబ్బిలి, సాలూరు సుట్టుపక్కలనుండి వచ్చినోళ్ళంతా మేమెందుకు నెగాలె, మమ్మల్ని ఎల్లనిత్తే ఎల్తాం, నేకపోతే ఇక్కడే వుంతాం అని ఆళ్ళ సేతుల్నిండి ఇడిపించుకుంతుంటే ఆ గుంజులాట సూసి ఏటే ఆల్లతోని మాటలు, అనీసి కఱి దున్నపోతులా ఎగసోప బెట్టుకుంటూ ఒక్కపాలిగా మామీద నాటీలతో ఇరగబాదీసినాడె.. ఆడు తినాద సిఐ బావంట… ఆడి సేతులు పడిపోను, ఆడి నోట్లో మట్టికొట్ట, నా రగతం పొయ్య, ఆడి జిమ్మడిపోను, ఆడి సేతులల్ల బెమ్మజెముడు మొలిసియ్య ఏనాడు మీ బావైనా కొట్టనేదే, అలాపింటిది ఆ నంజికొడుకు నాటీతో బాదీసినాడే, పచ్చి బాలింతరాలు సిన్న పిల్లల్ని సేతులల్లో పట్టుకొని పరిగెట్ట నేకపోతుంటే పిఱలమీద మరీ కొట్టీసినాడే, పైటసెంగులు, జుత్తు పట్టి నాగీసి ఈడీసీసినారే, ఇజీనగరం ఆడి బాబుగాడిదైనట్టు రోడ్లమీద ఈరంగం ఆడినాడే, మాలో నలుగురైదుగురికి బుఱలపై దెబ్బలు తగిలి సానా రక్తం పోయినాదే లచ్మీ… ఏటి సెప్తాను, తెల్లారిగట్ల ఇంటికాడ బయలెల్లినప్పుడు తాగిన గెంజేనే, దిగాక టీ సుక్కకూడా తాగకుండ ఎల్లినామా, ఈ దెబ్బలు ఈటితోని పాటు కడుపుమంటతో నకనకలాడిపోయినామే.. ఉపాధిహామీ పనులకెల్లినోళ్ళకు రోజుకు వందొస్తుందా, మాకేమో నెలకు నాలుగొందలు జీతం, అదీ ఇప్పుడు ఆరేడు నెలలుగా ఇయ్యనేదా, తీరా ఇచ్చినప్పుడు అందులో గుమస్తాబాబుకు ఏబై ఇయ్యాల మరి మండలాపీసు మీటింగులకెల్లాల, ఆలకి ఈలకి బాలేదంటే తోడు ఎల్తన్నామా, పురిటికి పున్నానికి తీసుకెల్తున్నామా అందరికీ ఎలాగోలా సేసుకొస్తున్నామా, అయ్యా మరో ఆరొందలైనా పెంచండి మాప్రబో అని సెప్పుకోడానికి ఎల్తామంటే ఇలగ కాలిపోయింది.. మేమేమైనా ఉద్యోగాలు జీవితకాలం సేత్తామన్నామా, గోనెసంచీలతో ఒంపీమన్నామా… ఏటోనే లచ్మీ ఇలా దెబ్బలు తినీసి వచ్చినానా ఇంక మీ బావ నీకెల్లొద్దంటే ఎల్లినావ్, నువ్వే అనుబవించే అని ఆడు రోడ్డు మీద టీకొట్టులోనికి ఎల్లిపోనాడు..ఈ పిల్లలకి ఒండిపోయాలి కదా అని మల్లీ నెగిసినానే… యిదీ నిన్నటి మా ఎద…

ఇంత కఠినాత్ములమా?

ఒక ప్రక్క మనకు అత్యంత సమీపంలోనున్న దేశం మొత్తం బూడిదవుతున్న సందర్భంలో ఈ ఉపఖండంలో జరుగుతున్న క్రికెట్ వ్యాపారాన్ని ఎలా ఎంజాయ్ చేయగలుగుతున్నారో? అంత భీభత్సంగా ప్రకృతి విలయతాండవానికి గురై అల్లల్లాడుతూ ఆర్తనాదం చేస్తున్న ప్రజలను చూస్తూ సునామీ రోజుకూడా బందుపెట్టని ఫక్తు వ్యాపార సంస్కృతిని ఖండించను కూడా లేని సానుభూతి ఎవరికోసం? అణు ప్లాంట్లన్నీ బూడిదవుతూ మానవాళికి ముప్పుగా తయారవుతున్నా బహిరంగ ప్రదేశాలలో మూకుమ్మడిగా జనం కూడగట్టడం న్యాయమా? జరగరానిది జరిగితే ఎవరు దీనికి బాధ్యులు? జనావళి పట్ల బాధ్యత లేని పెట్టుబడిదారుల వ్యూహానికి ఇంత లోకువై పోవాలా? మన్యులంతా ఆలోచించగలరు….

రాజీవ్ రెడ్డి, సోనియా రోశయ్యని పెట్టుకోండిరా…

తెలుగు లలిత కళా తోరణం


తెలుగు లలిత కళా తోరణం పేరుకు ముందు రాజీవ్ ను కలపడానిని ఇప్పుడే ఏబిఎన్ లో చర్చలో సుబ్బరామిరెడ్డి సమర్థించుకోవడాన్ని చూస్తుంటే వీళ్ళ పేరుకు ముందు కూడా రాజీవో, సోనియా అనో తగిలించుకుంటే బాగుణ్ణు. ఏమంటే రాజీవ్ జీవితాన్ని త్యాగం చేసాడన్న సోది చెప్తున్నాడు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఈ జాతి వినాయకుల పేర్లను తగిలించేయడం ఎలా సమర్థించగలం. ఆ ఏంకర్ బాగానే అడిగాడు ప్రపంచ బ్యాంకు వేలకోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తుందని ప్రపంచబాంకు ఆంధ్రప్రదేశ్ గా మార్చేద్దామా అని అడిగితే ఈ నత్తి నాయకుడు తుతుతి అని అంటున్నాడు. ఏదో వీడి జేబులో సొమ్ములా మాటాడుతున్నాడు. అది కూడా పార్లమెంటు సభ్యులకిచ్చే నిధులనుండి ఇచ్చినదే.. ప్రజాధనంతో చేస్తున్న పనులన్నీ వీళ్ళ సొంత సొమ్ములా ఫోజులిస్తూ తెలుగువాడి పరువు తీస్తున్నారు. వాటర్ గేట్ కుంభకోణంతో సమానమైన బోఫోర్స్ కుంభకోణంతో భారత పరువు తీసిన రాజీవ్ పేరును ఇప్పటికే ప్రభుత్వ కార్యక్రమాలన్నింటికీ ఆఖరికి ఎప్పుడో NTR పేరు పెట్టిన విమానాశ్రయానికి కూడా తగిలించారు. అయినా వీళ్ళ దురద తీరక ఇలా సాంస్కృతిక వేదికలకు కూడా తగిలించడాన్ని అంతా వ్యతిరేకించడం మనందరి కర్తవ్యం కాదా?

నందులు రాజకీయ ..ందులకా?

2009 రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులలో ఉత్తమ నటుడు అవార్డు మాజీ ఎం.పీ. నటుడు దాసరి నారాయణ రావుకు దక్కడంలో రాజకీయ కోణం వుందన్నది స్పష్టం. ఆయన ఎలక్షన్ ముందు నటించిన మేస్త్రీ సినిమాలోని నటనకు దక్కడం వెనక ఆయన లాబీయింగ్ తో పాటు ఆ సినిమాను ప్రజారాజ్యం పార్టీని, చిరంజీవిని ఎదుర్కొనేందుకు తీసినందుకు దక్కిన ప్రతిఫలంగా భావించాల్సి వస్తోంది. అందులో ఏమి విరగదీసాడని ఈ అవార్డ్ నిచ్చారో జ్యూరీ వారు వివరించగలరా?

ఈ విధంగా ఓ సీనియర్ నటుడై వుండి ఇలా చేయడం ఆయన పట్ల వున్న కాస్తా గౌరవం మంటగలిసినట్లే.. అలాగే నంది అవార్డులుపై గత కొంతకాలంగా వున్న విమర్శలు సత్యదూరం కావని నిరూపిస్తున్న జ్యూరీని అభినందించాల్సిందే!!!

లంచం వద్దన్నమహిళా పోలీసధికారిణిని లాక్కెళ్ళిన పోలీసోళ్ళు

ఉత్తర ప్రదేశ్ లోని రాయ్ బరేలీలో కల్పనా సక్సేనా అనే ట్రాఫిక్ సూపరింటేండెంట్ కేడర్ పోలీసధికారిణిని ట్రాఫిక్ పోలీసులుగా విధి నిర్వఃహణలో వున్న ముగ్గురు పోలీసులు తాము లంచం తీసుకుంటుండగా పట్టుకునేందుకు ప్రయత్నించగా కారులో పారిపోబోతే ఆమె కారు డోరును పట్టుకొనగా అంతా చూస్తుండగానే ఒక కిలోమీటరు దూరం రోడ్డుపై ఈడ్చుకు పోయారు. తమ పై అధికారిణిపైనే లంచావతారులు ఇలా ప్రవర్తిస్తుంటే సామాన్యుల పరిస్తితేంటి?

http://www.ndtv.com/video/player/news/video-story/161702

source:http://www.ndtv.com/article/cities/up-police-officer-dragged-on-road-by-her-subordinates-49199

శిలకోల చూపు


వాకపల్లీ వాకపల్లీ
అప్పుడే నీ శోకానికి మూడేళ్ళూ నిండాయా?

అంతా మరిచిపోయారు..
ఎవరికి కావాలిలే నీ బతుకు
ఎవరికి వారు తమ రోజువారీ
పనులలో పడి తమ నిన్నటి గురించే
మరిచిపోయే కాలమిది..

సిగ్గువిడిచి నీకు జరిగిన అన్యాయాన్ని
ఆక్రోశిస్తే నవ్వుకున్న వారెందరో వున్న
ఈ పాడులోకం…

పచ్చని ఆకులమధ్య నీ శీలాన్ని హరించిన
ఖాకీచకులంతా పతకాలతోనో
అదనపు భత్యాలతోనో అలరారుతున్నారు..

వాడియైన నీ ‘శిలకోల’ చూపులకు
సమాధానం చెప్పే వాడే లేడిక్కడ..

కళ్ళకు నల్లటి గంతలతో ఊగే త్రాసు
పట్టుకున్న న్యాయదేవత
నోటికి కూడా నోట్ల తాళమో
ప్రమోషన్ల తాయిలమో వేసి నొక్కివేశారు కాదా?

మీడియాకు కొత్త కొత్త కథనాలే కావాలి
నీ పాతబడ్డ బట్ట చిరుగు ఎవరికి కావాలిలే నేస్తం..

అయినా..
నీ చేతిలో మెరిసే కొడవలే నీకు
అండకావాలి…

నీ అడుగులో అడుగువేసి
గొడ్డలికి పదును పెడుతున్న నీ
వారసత్వం బదులు కోరుతోంది..

(శిలకోల=బాణం మొన)
(తమపై అత్యాచారం జరిగిందని వాకపల్లి ఆదివాసీ మహిళలు న్యాయం కోరి మూడేళ్ళు నిండినా వారికి సమాధానం చెప్పలేని న్యాయానికి నిరసనగా)

వీళ్ళు కసబ్ కంటే నేరస్తులుకారా?

పాతికేళ్ళ క్రితం పాతికవేలమంది ఘోర మరణానికి కారణమైన యూనియన్ కార్బైడ్ కంపెనీ పై పెట్టిన కేసు నిందితుల ఆరోగ్య సమస్యలను కారణంగా చూపి న్యాయమూర్తి వారికి రెండు సం.ల జైలు, లక్ష రూపాయల జరిమాన విధించి చెరో పాతిక వేల పూచీకత్తుతో బైలు మంజూరు చేయడం చూస్తుంటే న్యాయ దేవత విగ్రహానికి కాదు ఈ బతికున్న న్యాయమూర్తుల కళ్ళకు గంతలు కట్టుకున్నారనిపిస్తుంది. ఇన్నేళ్ళ తరువాత ఇంత నామ మాత్రపు శిక్షలతో సరిపెట్టడం చూస్తుంటే డబ్బున్న వాడు, అధికారం అండగా వున్నవారికేం పీకలేమన్నది అర్థమయి మూగగా ఆక్రోశించడమేనా అనిపిస్తోంది. ఈ కేసులో మొదటినుండి ఆ కంపెనీ వాదనలను సుప్రీంకోర్టు వారు కూడా సమర్థిస్తూనే వచ్చినట్లు తెలుస్తోంది. వారు భారత దేశంలో పరిశ్రమలు పెట్టి, ఇక్కడి కోర్టు పరిథిలోకి రామంటే నోరుమూసుక్కూచున్న పాలక వర్గాల తీరు గర్హనీయం. ఇది ఆనాడే అంతర్జాతీయ న్యాయ స్థానం ముందు పెట్టి వుంటే దోషులకు సరైన శిక్షపడేదేమో? ఏనాడూ దీనిని సరిగా పట్టించుకోలేదు. బాధితులకు పూర్తిస్థాయి నష్టపరిహారం నేటికీ అందలేదు.

ఈ కంపెనీ కారణమైన ఘోరకలి కసబ్ చేసిన దానికంటే నేరం కాదా? కనీసం వీళ్ళపై హత్యానేరం మోపబడలేదు. దర్యాప్తు చేసిన సి.బి.ఐ. వారి కళ్ళుకూడా ఈ దుర్ఘటనలో పోయుంటాయి. ఆ కంపెనీ చైర్మన్ ఆండర్సన్ గాడి వూసే లేదు. ఎందుకంటే వాడు తెల్ల తొక్కగాడని వదిలేసి వుంటారు. ఇది అమెరికా వాడి తొత్తుల పాలన కాబట్టే ఇలా జరిగింది.

అంతుచిక్కని వ్యాధులతో, అంధత్వంతో ఎందరి జీవితాలో నాశనంచేసిన కంపెనీని ఏం చేయలేని వారు ఈ దేశంలో అణువిద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పడం ఎంతవరకు సమంజసం. బాక్సైట్, జింక్, రసాయన పరిశ్రమల వ్యర్థ పదార్థాలు, థర్మల్ విద్యుత్ కేంద్ర కాలుష్యాలకే జనం యిప్పటికే అంతుచిక్కని రోగాల బారిన పడుతుంటే కొత్తగా అణు విద్యుత్ ప్రాజెక్టులు పెడతాడంట మన ప్రధాని. దానికి ఇక్కడ మన సి.ఎం. కూడా వంతపాడుతున్నడు. భోపాల్ దుర్ఘటనను అంత ఈజీ గా తీసుకున్న పాలక వర్గం ప్రజల పట్ల ఏమాత్రం బాధ్యతలేని అధికార గణం వున్న ఈ దేశంలో యిటువంటి ప్రమాదకర ఫ్యాక్టరీల స్థాపనతో ప్రజల జీవితాలతో, ప్రాణాలతో చెలగాటమాడటాన్ని అడ్డుకోలెకపోతే ఈ విధ్యంసకర అభివృద్ధికి కోట్లాదిమంది బలికాక తప్పదు. భోపాల్ మృతులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ మన భవిష్యత్ పట్ల కూడా ఒకమారు ఆలోచిద్దాం.

ముందే చేసుండాల్సింది..

రోశయ్యగారు తీసుకున్న తాపీ నిర్ణయం వలన యింతా జరిగింది. అసలు రాత్రి జగన్ ను గృహనిర్బంధంలో వుంచి వుంటే తెలంగాణాలో యింత ఉద్రిక్త పరిస్థితి వచ్చేది కాదు. రైలు ఎక్కనిచ్చి, భారీ బందోబస్తు మధ్య పెదవులనుండి బయటపడీ పడని నగుమోముతో ఆయన బయల్దేరడం వలన జరిగిన ఈ ఆస్తి నష్టాన్ని ఆయన నుండే తిరిగి వసూలు చేస్తే మరల యిలాంటి ఉద్రిక్త పరిస్థితులు యిలాంటి నాయకులు చేపట్టరు.

సురేఖ గారు తమ అనుచరులతో కాల్పులు జరిపించడం జరిపించి ఏదో సామెతలో అన్నట్లు ఇంటి చూరుకు నిప్పుపెట్టి అత్తా నా ఒళ్ళు వణుకుతోందన్న కోడలు మాదిరిగా ఆత్మ హత్యాయత్నం డ్రామా ఆడారు. యివన్నీ జనం చూస్తున్నారన్న వివేకం లేని రాజకీయ నాయకులను ఏమనాలో తెలియడం లేదు.

పానకంలో పుడకలా జగడపాటి గారికి తీవ్రవాద సంస్థలు గుర్తొస్తున్నాయి. ఎవరికి నచ్చినట్లు వారు తిరగడానికి పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు పంతాలకు పోవడం దేనికి. ఏం సాధిద్దామని? నిజంగా వీళ్ళకు ప్రజలపై ప్రేమ వుందా? వుంటే ఈ మధ్యకాలంలో తుఫానులో మృతి చెందినవారిని, వడగాడ్పులలో మృతి చెందిన వారిని పరామర్శించొచ్చు కదా? అసలు వీళ్ళు నిజమైన సమైక్యాంధ్ర వాదులైతే ఇటీవల తెలంగాణా కోరుతు ఆత్మ బలిదానం చేసిన వారి కుటుంబాలను పరామర్శించొచ్చు కదా? వై.ఎస్. హఠాన్మరణం వలన చనిపోయారన్నది వాస్తవానికి దూరంగా లేదా? ఎందుకంటే ప్రాజెక్టుల పేరుతో కోట్లు గడించిన కాంట్రాక్టర్లు, ఆయన చలవతో మంత్రిపదవులు పొంది తరతరాలకు సరిపడ కూడబెట్టుకున్న మంత్రి వర్గ సహచరులకు కానీ,  రోజూ ఆయనకు గొడుగు పట్టిన సూరీడుకు ఆగని గుండే వీళ్ళందరికీ ఆగిపోవడమేమిటి? రాజుగారు మరణించిన ఆర్నెళ్ళకు ఏడ్చిన రాణిలా ఇప్పుడు వద్దు మొర్రో అని అంటున్నా ఓదార్పు పేరుతో తిరగడమేమిటి? తనకున్న ఫాలోయింగ్ ను షో చేయడానికి కాకపోతే? కావున ఈ రోజు జరిగిన,జరుగుతున్న ఆస్థి, ప్రాణ నష్టానికి ఈయన గారిని బాధ్యున్ని చేస్తే మరోమారు ఏ నాయకుడు తోక జాడించడు. ఆ ధైర్యం మన యంత్రాంగానికుందా?

మరో సామాన్య నిరాయుధుని బలి

ఈరోజు సంతోష్ నగర్ కూడలిలో గస్తీలో వున్న కానిస్టేబుళ్ళపై ఆగంతకులు కాల్పులు జరపగా అందులో రమేష్ అనే కానిస్టేబుల్ మరణించాడు. మరో యిద్దరు గాయాలపాలయ్యారు.

ఇది మన నిర్లిప్త రక్షక భట వ్యవస్థ యిచ్చిన బలిగానే పరిగణించాలి. పోలీసు గస్తీ పోస్టులలో వున్న వారిని నిరాయుధులుగా నిలబెట్టడం, అది కూడా పాతబస్తీ కూడళ్ళలో ఎంతవరకు సమంజసం? ఆ దగ్గర్లోనే మన సిద్ధం హీరో జగపతిబాబు డూప్ సి.పి. ఖాన్ గారు (గల్లీ పోలీసు క్రికెటర్) పర్యవేక్షిస్తున్నారంట మందీ మార్బలంతో. పాపం బిక్కు బిక్కుమంటూ 18 వ తారీఖు ఎప్పుడు గడుస్తుందా అని ఎదురుచూస్తున్న సామాన్య పోలీసులకు ప్రాణాలర్పించాల్సి రావడం విషాదకరం, విచారకరం, ఖండించాల్సిన విషయం. యిలా నిరాయుధులుగా నిలబెట్టిన వారిపై గతంలో కూడా దాడులు జరిగాయన్న ఇంగితజ్నానం లేకుండా వారి బలికోరడం వారి దౌర్భాగ్యం తప్ప మరోటి కాదు. బాసులు చుట్టూ ఆయుధధారులను వుంచుకొని గల్లీలో షికార్లు చేస్తూంటే పాపం రమేష్ బలయ్యాడు.

ఇది పిరికిపంద చర్యగా అంతా స్టేట్ మెంట్లతో సరిపిట్టేస్తారు రేపు. మరి కొద్ది గంటల్లో టీ.వీ.వాళ్ళుకూడా మరో కొత్త అంశం తో ఊదరగొడతారు. వికారుద్దీనో, జలాలుద్దీనో తాపీగా జారుకుంటాడు. ప్రతీకారంగానో, కేసు మూసేయడానికో సోడాబుడ్డీ అహ్మదో, దర్జీవాలా కబీరో కటకటాలు లెక్కిస్తాడో లేక ఎదురుకాల్పులలో మరణిస్తాడు!

శాంతి శాంతి శాంతి..