
ఉత్తరాంధ్ర గొంతు
విప్లవకవి వంగపండు ప్రసాదు ఈ పేరు గత నలభై ఏళ్ళుగా ఆంధ్ర దేశాన వినిపిస్తూనే వుంది. ఆయన రాసిన పాటలు, భూమిభాగోతం నాటకం జనంలో కలగలిసిపోయాయి. ఉత్తరాంధ్రలో బుగతల దోపిడీ ఎలా కొనసాగిందో, దానికి గ్రామ కరణం, మునసబులు ఎలా తోడ్పడేవారో, వారికి వత్తాసుగా పోలీసులెలా లాఠీలు ఝలిపించేవారో కళ్ళకు కట్టినట్లు చూపించడంతో భూమిభాగోతం ఉత్తరాంధ్రనే కాక యావత్ తెలుగుదేశాన ఒక ఊపు ఊపింది ఆ రోజుల్లో. ఆయన రాసిన ఏంపిల్లడో ఎల్దమొస్తవా పాట యువకులను ఎంతో ఉత్తేజితులను చేసింది. అలాగే ఆయన డాక్ యార్డ్ లో పనిచేస్తూ తానెరిగిన కార్మిక జీవితాలనుండి పొందిన ప్రేరణతో రాసిన యంత్రమెట్లా నడుస్తు వున్నదో పాట కార్మికుల శ్రమను కళ్ళకు కడుతుంది. అలాగే ఊరిచివర మాలపేట అన్న పాట తొలి దళిత విప్లవ గీతంగా చెప్పవచ్చు.
అనుకోకుండా మేమిద్దరం ఈ రోజు తాను సైకిల్ పై వెళుతుండగా పలకరించడంతో కలుసుకున్నాం. చాలా రోజులుగా ఆయన ప్రత్యేక ఉత్తరాంధ్ర సాధనకు తన వంతు కృషిలో భాగంగా ధబేళ్ దుబేళ్ కార్యక్రమాలతో బిజీ అయి కలవడం కుదరలేదు. అలాగే ఆ మధ్య తాను వై.యెస్.మరణానంతరం ఏంపిల్లడో పాట శైలిలో ఆయన గురించి పాట రాసి సాక్షి టీవీలో వినిపించడంతో ఎదుర్కొన్న విమర్శలు, ఆ తరువాత నుండి ఆయన కొంత నాకు మానసికంగా దూరమయ్యారు. ఇవి వంగపండు జీవితంలో మొదటినుండి వున్నాయి. అంతా సినిమాలకు రాయకూడదనుకున్నప్పుడు ఆయన రాసి విమర్శలకు గురయ్యారు. అలాగే మగధీర సినిమాలో వాళ్ళు తన పాట చరణాలు వాడుకున్నందుకు నిరసన తెలిపి ఏదో మొత్తం పుచ్చుకొన్నాడని అనుకున్నారంతా. అయినా వంగపండు తన జీవన శైలినుండి దూరం కాలేదు. ఆయన ఆర్థికంగా పడ్డ ఇబ్బందులు ప్రత్యక్షంగా ఎరిగిన నాకు, వాటి ఒడిదుడుకుల వలన, కుటుంబ వత్తిడులకు లోనయి కొంతమేర ఆయన అటూ ఇటూ అయిన కాలం ఈ మధ్యనే. అయినా దాని ప్రభావం తన నడవడికపై ఎక్కడా కనపడదు.
చాలామందికి మల్లే విప్లవం పేరుచెప్పి లాభాలార్జించే మనిషంటే ఇక్కడ నమ్మరెవరూ. ఎందుకంటే ఆయన మాముందు ఏదీ దాచుకున్నది లేదు. తన పిల్లలచే మాత్రం ఎప్పుడూ చీకొట్టబడుతూ వుంటారు. తమను చిన్నతనంలో పట్టించుకోలేదని, పాటలు పాడుతూ తాను ఉద్యమాలలో వుండి తమను సరిగా చూడలేదని, వీటిలో వున్న చాలామంది తమ జీవితాలను సాఫీగానే సాగిస్తున్నారన్న వారి మాటలు కొంత నిజాలుగా కనిపించినా ఆయనకు తన పిల్లలంటే చాలా ప్రేమ. పెద్ద వాడు ఇప్పటికీ సరిగా జీవితంలో కుదుటపడలేదని బాధపడుతుంటాడు. కూతురు ఉష తానెలా వుంటానంటే అలా వుండమన్న స్వేచ్చ నిచ్చారు. ఆమె ఎంచుకున్న జీవితాన్ని తానెప్పుడూ అడ్డుచెప్పలేదు. చిన్న వాడు దుష్యంత్ కు చదువు చెప్పడానికి తన భూమిని తనఖాపెట్టి చదివించారు. ఆయనిప్పుడు హైస్కూలు టీచరయ్యడు ఈ మధ్య డిఎస్సీలో. అయినా ఆయనకు తండ్రి పట్ల తీవ్ర వ్యతిరేకత. తమకు ఆర్థికంగా ఇంకా బతికేందుకు తోడ్పడలేదని, ఉద్యమంతో మమేకమై డాక్ యార్డ్ లోని ఉద్యోగం రాజీనామా చేయడాన్ని తప్పుపడుతుంటాడు. అయినా వారికెవరికీ లోటు రానీయలేదు. వారివి గొంతెమ్మకోర్కెలు. వాటినే తీర్చడం తన ధ్యేయంగా పెట్టుకుంటే మనమీనాడు వంగపండు గురించి మాటాడేదే వుండదు. ఓ పక్క తమ తండ్రిని గొప్పకవి అంటూ పొగుడుతూ తిడుతుంటారు పిల్లలు. ఇది ప్రజల జీవితంలో మమేకమైన వాళ్లకు తప్పని స్థితే..
ఇప్పటికీ ఆయన గోచి బిగించి గొంగడి వేసుకొని పాడుతూనే వున్నారు. అది విప్లవ గీతమే కావచ్చు ఉత్తరాంధ్ర జాలరి పాటే కావచ్చు. చితికిన బతుకులను పాట కట్టి కనులముందుంచగల సత్తా తనలో ఇంకా వుందని, తన వారసత్వాన్ని తెలంగాణా బిడ్డలందుకున్నంతగా తన నేల నుంచి ఎవరూ రాకపోవడం బాధాకరమంటుంటారు.
తాను ఇటీవల రాసిన తొమ్మిది పాటలతో ఒక సీడీ ని రూపొందించానని, దాని ఆవిష్కరణకు తాను బావగా పిలిచే గద్దర్, గోరటి వెంకన్న, ఆర్.నారాయణమూర్తి వస్తున్నారని, విశాఖ ఆర్ కే బీచ్ లో నవంబరు 7 వ తేదీ సాయంత్రం కార్యక్రమం అనుకుంటున్నామని చెప్పారు. గోరటి ప్రస్తుతం లండన్ వెళ్ళాడంటూ ఫోన్ చేస్తే నీ పాటనందుకున్న మేము ఇలా విదేశాలలో తిరుగుతున్నా నువ్వింకా మీ నేలమీదే వున్నావన్నారంట. ఆ విషయం గర్వంగా చెప్తూ మనకెందుకు బ్రదర్ అలాపింటి ఆశలు. మనం మన జనంతో కలిసి వుండడమే నాకు గొప్ప అన్న ఆయన మాటలు ఆయనలోని నిరాడంబరత్వాన్ని తెలియజేసాయి.
ఆయన చాలా భోళా మనిషి. ఎవరైనా వంగపండు గారూ అని పలకరిస్తే చాలు తన పాట తనకు తెచ్చిన గుర్తింపు అంటూ మురిసిపోతారు. తాను ప్రత్యేకించి సిద్ధాంతాలు, వ్యాకరణాలు చదవలేదంటారెప్పుడూ. తాను పుట్టిపెరిగిన పల్లె వాతావరణం, చిన్నప్పటినుండి తాననుభవించిన, ఎరిగిన జీవితాన్ని, ప్రత్యక్షంగా చూస్తున్న జనజీవన వైవిధ్యాన్ని తన పాటలద్వారా వెలుగులోకి తెస్తున్నానంటారు. ఉత్తరాంధ్ర జానపదంలోని నుడికారాన్ని పట్టుకున్న వంగపండు తన పాటలలోని యాసలోని స్వచ్చత మల్లే తనతో మాటాడితే ఆ అమాయకత్వం, స్పందన ఎరుకై మనం కూడా ఆయన పాటకు గొంతు కలుపుతాం…
ఇలా ఈ మనిషి ఇప్పటికీ తాను నమ్మిన దానికి తన 66 సం.ల వయసులో కూడా ఉత్సాహంగా రోడ్డుపై చిందేస్తున్న తన ఆరోగ్యానికి తానే సంబరపడిపోతుంటాడు.
టీ తాగినంతసేపూ తన చుట్టూ పలకరింపులే..
ఆయన సెల్ నెం.9441305889
ఆయన గొంతులో వినండి ఏంపిల్లడో ఎల్దమొస్తవా..
Like this:
Be the first to like this post.