అమ్మకానికి న్యాయం…

ఇదేమైనా మనకు కొత్త వార్తా…

లేక మనకు మింగుడు పడనిదా…

గాలి జనార్థన రెడ్డికి ఐదు కోట్లు లంచం తీసుకొని బైల్ ఇచ్చారంట న్యాయమూర్తిగారు..

ఏదో కక్కుర్తిపడ్డారు ఆయన గారు..దానికి ఇంత పెద్ద వార్త చేసి బిల్డప్ ఇచ్చాయి ఈ రోజు వార్తా పత్రికలు..దీనిని సామాన్య జనం ఏమైనా చదివి రోడ్లెక్కి అబ్బో ఆ న్యాయమూర్తిగార్ని శిక్షించి న్యాయ దేవత శీలాన్ని కాపాడండి అని గగ్గోలు పెడతారా ఎక్కడైనా ఎప్పుడైనా..

నీకు వ్యతిరేకంగా వున్న వాడి గురించి ఇంతింత బాక్స్ ఐటంలు కట్టి రాస్తావే కానీ అదే నీ దగ్గరివాడో లేక నీ పార్టీవాడో చేసినప్పుడు అశ్వథ్థామ హతః అన్న స్టైల్లో ఎక్కడో ఆరో పేజీలో రాస్తున్నావే..మరి నీకెక్కడి బాధ్యత వుంది.. అందుకే ఇలాంటివి ఎవడూ పట్టించుకోవడం మానేసాడు..

వాడికి డబ్బు ఎక్కువుంది..అమ్ముడుపోయే వాడు దొరికినప్పుడూ వీజీగా కొనుక్కున్నాడు.. అసలు ఇలా మేనేజ్ చేయడం కొత్తనా…ఎవడికి అవకాశమున్నంత మేరా వాడు ఈ దేశంలో చేసుకు పోతూనే వున్నాడు కదా..

మన దేశ ప్రధానమంత్రివర్యుల పాలనా కాలంలో ఎన్ని కోట్ల రూపాయల కుంభకోణాలు వెలుగులోకొచ్చినా వారు మాత్రం నాకే మసి అంటనేలేదు.. నిరూపిస్తే రాజకీయాలనుండి తప్పుకుంటానంటారు..అంటే ఆయన రాజకీయం చేస్తున్నట్టే కదా..మరి ఆయనెన్నడైనా ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డారా?? అసలు ఆయన రాజకీయాలలో వుంటే ఏంటి లేక పోతే మనకేంటి..దమ్ముంటే ఏ శిక్షకైనా సిద్దమే అనాలి.. తనకు తెలీకుండా ఇన్ని లక్షలకోట్లు దారి మళ్ళుతాయా.. అయినా ఆయన గురించి పరిశోధించి నిరూపించే కాలానికి ఆయనా పదవిలో వుంటాడా? లేక ఆయనేమైనా యుక్త వయసులో నవనవలాడుతున్నారా?? అసలు మన దర్యాప్తు సంస్థల స్పీడు తెలీనిదా మనకి..

అందుకే ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?? పాలక వర్గమే భ్రష్టు పట్టి పోయుంటే ఇంక దాని నాలుగు కాళ్ళలో ఒకటి కుంటిదని బాధ పడడం మన వెఱితనం కదా…

కొత్త (ప్రతి) నాయకుడు

Image
జగన్ ను దిల్ కుష్ లో పరామర్శించేందుకు విజయమ్మ బయల్దేరారు..ఇప్పుడే చేరుకొని కొడుకు చెంతకు చేరారు కూడా..
కానీ ఎవరి ఇళ్ళకు వాళ్ళను చేర్చే ఏకైక సాధనమైన ఆర్టీసి బస్సులను రద్దు చేసి రోడ్లన్నీ దిగ్బంధనం చేసిన రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం సామాన్య జనాలను ఇంత ఇబ్బందుల పాల్జేస్తూ అనవసరపు హైప్ సృష్టిస్తూ గత రెండు గంటలుగా భయకంపిత వాతావరణాన్ని మీడియా ద్వారా కల్పిస్తూ  వేలాది మంది పోలీసు బలగాలతో రాష్ట్రమంతా కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించి ‘కొత్త నాయకున్ని’ (తనకు ప్రతినాయకున్ని) కూడా సృష్టించుకుంది…
ఆర్థిక పరమైన నేరానికి పాల్పడ్డారని ఆరోపించబడిన వ్యక్తికి ఇంత పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తూ అనవసరంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతతను చెదరగొడ్తోంది..

దీనిద్వారా తన సొంత చానల్ పత్రికకే పరిమితమైన వ్యక్తి నేడు దేశ వ్యాప్తంగా వున్న మీడియాలో పాపులరవ్వడం ద్వారా తమ కన్ను తామే పొడుచుకున్నట్టైంది. దీని ద్వారా లబ్ధి పొందేది జగనే. ఈ దేశంలో అవినీతి ఆర్థిక నేరాల పట్ల సామాన్య జనం పట్టించుకున్న దాఖలాలే లేవు. అసలు ఏది నేరమో దేనిని ఏ స్థాయిలో శిక్షించాలో కూడా సరిగా స్పందించలేని న్యాయవ్యవస్థకూడా మనదే. అతి పెద్ద నేరాలు చేసిన వారిని చిన్న చిన్న మందలింపులతో వదిలేసిన దాఖలాలు చాలా. ఇలా ఇప్పటికే ప్రజలలో దీనిపట్ల ఎన్నికల ప్రచారానికి జగన్ వెళ్ళకుండా అడ్డుకోవడం ద్వారా తాము లబ్ధి పొందాలనుకోవడం అలాగే తమ నాయకుని పరిపాలన అంతా అవినీతిమయంగా పేర్కొనడం ద్వారా అది తమ నెత్తిపై సి.బి.ఐ. భస్మాసుర హస్తంగా మారిందన్నది త్వరలో తెలుసుకోబోతోంది…

ఉపఎన్నికలొక చీడకాదా??

ఈ రాష్ట్రానికి పట్టిన ఈ ఎన్నికల చీడ పోవాలంటే మొత్తం అసెంబ్లీని రద్దు చేసి మరల ఎన్నికలు వస్తే కానీ ప్రజలకు ఈ వెధవ బాదుడు పోయేట్టు లేదు. ప్రతి సారీ ఎక్కడో దగ్గర ఉప ఎన్నికల పేరుతో వాడి పంచ వీడు వీడి పైజామా వాడు పీక్కుంటూ రోడ్లమ్మట తిరగడం తప్ప రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగక భ్రష్టు పట్టి మూడేళ్ళు కావస్తోంది. దమ్ముంటే మధ్యంతర ఎన్నికలకు పోవచ్చుకదా. వాడింత తినేసాడు వీడింత తీనేసాడని ఊరూరా టాం టాం వేస్తూ ప్రజల డబ్బులతో సెక్యూరిటీ అనుభవిస్తూ ప్రయాణ భారాన్ని ప్రజలపై అదనంగా మోపుతూ తిరుగుతున్న అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులను ఈ విషయమై ఖచ్చితంగా నిలదీయాలి. ఈ సారి ఈ ఉప ఎన్నికల నోటిఫికేషన్ కావాలనే నెలముందుగా విడుదల చేసి ప్రచారం మొదలెట్టి నామినేషన్లకు ఎన్నికలకు ఇంత సమయాన్ని గాప్ తీసుకొన్నారన్నది సామన్య జనానికి తెలీదా?

దీనికి తోడుగా తమ అమ్మకాలను పెంచుకునే యావలో ఎవడికి నచ్చిన పార్టీకి వాడు సొంత డబ్బాలా తయారైన మీడియా జనం చెవులలో, కళ్ళలో ఊదరగొడుతోంది. నిజానికి మీడియా ప్రజల పక్షమైనదైతే దీనిపై రిఫరెండం లాంటిది జరిపి ఈ అదనపు వేల కోట్ల రూపాయల భారాన్ని తప్పించే విధంగా కృషి చేసేది. అలాగే న్యాయ స్థానాలుకూడా యిలాంటి అత్యవసర విషయాల పట్ల స్పందించాల్సిన అవసరముంది. ప్రజాస్వామ్యమంటే ఎన్నికలే అన్న భ్రమలో వుంచి తమ కుట్రపూరిత మోసపూరిత అవినీతి కక్కుర్తి వ్యాపార లావాదేవీలను జరుపుకునే భాగంగా రాజకీయాలను భ్రష్టు పట్టించిన ఈ మోసగాళ్ళకు మోసగాళ్ళను కాలర్ పట్టి నిలదీయాలి. ఎవడికి వాడే గురివిందలాంటి వాడైన ఈ తొక్కలో నాయకులు ప్రజల సొమ్ముతో ఊరేగుతూ ప్రజల కనీస అవసరాలను మరచి రాష్ట్రాన్ని చీకట్లోకి నెడుతున్నారు. పారిశ్రామికంగా, సాంకేతికంగా, వ్యవసాయపరంగా అన్నివిధాల వెనకబడిపోయి నేడు బీహార్ కంటే అభివృద్ధి సూచికలో వెనక్కుపోయిందన్నది సత్యం. కావున ఈ పందికొక్కులను తరిమికొట్టాల్సిన అవసరముంది. వీరి సవతి పోరుకు అంతిమ తీర్పు యివ్వాల్సిన అవసరముంది..

దర్జాగా కస్టడీలోకి భాను!!


మద్దెల చెరువు సూరి హత్య కేసు ప్రధాన నిందితుడు భానును తాజాగా పట్టుకున్న పోలీసు అధికారులు నిర్వహించిన మీడియా సమావేశంలో కెమెరాలకు నవ్వుతూ పోజులిచ్చిన భాను అస్సలు తను చేసిన హత్య పట్ల చూపుతున్న నిర్లక్ష్యం, దానికి పోలీసు వారు చెపుతున్న కథనాలు చూస్తుంటే ఇదంతా డ్రామాగా కళ్ళున్న ఎవరికైనా అనిపించక మానదు..

ఇదంతా ప్రీ ప్లాన్ డ్ మర్డర్ తరువాత జరుగుతున్న అరెస్ట్ అని మనకు అర్థమవ్వడంలో మన దోషమేమీ లేదు. దర్జాగా ట్రిమ్మింగ్ చేసుకున్న గెడ్డం, టీ షర్ట్ లతో చేతులు కట్టుకున్నట్టు నటిస్తూ మీరెంత వీపీలో అని నవ్వుతూ ఫోజులిస్తుంటే డబ్బు జబ్బున్న నేరగాళ్ళ పట్ల మన రాజ్యం ఎంత మర్యాదగా వ్యవహరిస్తుందో అర్థం కాకపోతేనే మనలో ఏదో లోపమున్నట్టు కదా..

కడుపుమండి ఓ పది రూపాయలు కొట్టేసిన జేబు దొంగను ఉతికి ఆరేసి తాము కూచున్న కుర్చీకో టేబుల్ కో గొలుసులతో కట్టేసి తమ అడ్డమైన చాకిరీ చేయించుకుంటూ వాడిని హీనంగా చూసే పోలీసు దొరలు నేనే ఆ హత్య చేసానురా పొండి అని పోజులు కొట్టే వాడిని అంత మర్యాదగా ట్రీట్మెంటు ఇవ్వడంలో ఆంతర్యం మనకు గోచరించక పోతేనే మనకు ఏదో ఆశ చావనట్టు కదా…

పోనీలే ఎవడెలా పోతే మనకేం..ఈరోజుకు టీవిలు పత్రికల వారికి ఆ పూట బిస్కట్లు, కాఫీలుతో పాటు ఓ నాలుగైదు గంటలకు క్లిప్పింగ్ లు ఇంక పత్రికలలో అయ్యవారిని కోర్టులకు తీసుకు పోయినప్పుడల్ల కెమెరా క్లిక్ లకు కొదవుండదు…

రండి దుప్పటి ముసుగేసుకుందాం…

తారలు ఈ సమాజపు నిలువెత్తు ప్రశ్నలు కారా??


ఇటీవల ఆంధ్రజ్యోతి వారి టీవి చానల్ ద్వారా పత్రిక ద్వారా ఏదో ఓ పెద్ద నేరస్తురాలిని పట్టుకున్నట్టు, తన ఒక్క దాని వల్లనే ఈ తెలుగునేలంతా కుళ్ళిపోతున్నట్టు రోజంతా ఊదరగొట్టి రోజూ కథనాలు ప్రచురిస్తూంది. ఈరోజుకు రాజకీయ నాయకులు, వారి తాబేదార్లు, పోలీసులకు తనతో లింకులు వున్నాయని వాటిని బయటపెట్టుతూ తనను తాను రక్షించుకోజూస్తున్నట్టు కథనం రాసింది. అలాగే కొంతమంది రా.నా.ల వలన తనకు బెదిరింపులొస్తున్నట్టుగా కూడా.. ఒంటరిగా వున్న ఆడదానిని చంపేయడం అదీ ఇలా ముద్ర పడ్డ వాళ్ళని ఏం చేసినా ఈ సమాజం హర్షిస్తుందిలే ఆన్న ధీమా వున్న వాళ్ళు ఏమైనా చేయొచ్చు..

అసలు మీడియా అంత పవిత్రంగా ఏడిసిందా ఈ దేశంలో???

అసలు ఇది తారా చౌదరితోనే మొదలయ్యిందా? లేక అమ్మె ఒక్క దానితోనే అంతమయిపోతుందా.. ఇలాంటి వారు ఈ సమాజంలోంచి వస్తున్న వారే కాదా?? ఎంతమంది జీవితాలను ఈ సమాజం నాశనం చేస్తూ వాళ్ళని ఇలా పెడదోవ పట్టడానికి దోహదం చేయడంలేదు. రాజకీయనాయకులు, అధికార గణం వీరిని ఇలా తయారు కావడంలో పాత్ర వహించడం లేదా.. వ్యభిచార వృత్తి మన సమాజంలో అంతర్లీనంగా అంగీకరింప బడుతూ శతాబ్ధాలుగా వస్తున్నదే కదా… మరి తారా చౌదరి వలన నష్టమెవరికి జరిగింది. ఏదో పెద్ద స్టింగ్ ఆపరేషన్ తో పట్టుకున్నటు బిల్డప్ ఇచ్చి అదో దేశ ద్రోహ నేరంలా మీడియా చూపుతోంది.. వారిని సంస్కరించాల్సింది పోయి వాళ్ళ ఫోటోలు వేసి వాళ్ళను మరింత కుంగిపోయేట్టు చేయడం ద్వారా ఉపయోగముంటుందా…లేదంటే వాళ్ళు మరింత మొరటుగా తయారవ్వడానికి ఈ ప్రచారం ద్వారా మరింత పెరగడానికైనా ఉపయోగపడుతుంది ఇలాంటి కథనాలు.

కుళ్ళిన సమాజంలో వుంటూ ముక్కు మూసుకున్నామనడం హాస్యాస్పదం కాదా.. ఈ వ్యవస్థలో తారాచౌదరిలు వస్తూనే వుంటారు… వారిని వెంటాడి వేటాడకండి.. వారి తప్పు తెలుసుకొని మారే అవకాశమిద్దాం…

మన రక్షణ ఒట్టి డాబేనా,,,

యిటీవల దేశ సైన్యాధిపతి మన రక్షణ రంగంలోని డొల్లతనాన్ని బయటపెట్టిన తరువాత ఈ ప్రశ్న వెంటాడుతోంది. శవపేటికలను కూడా లంచం అడిగిన వారు, ఫిరంగుల కొనుగోళులో ముడుపులు మింగిన వారి వారసులనుండి మనమింతకన్నా ఆశించింది లేదు. ఇది ఎన్నాళ్ళూగానో జరుగుతున్నదే అనిపించకమానదు. అలాగే ఢిల్లీ కేంద్రంగా బలగాల కదలికలపై ఓ వార్తా పత్రిక కథనం ప్రచురించేదాకా తెలీని ప్రధాని, రక్షణ మంత్రి మనకున్న అతి పెద్ద దౌర్భాగ్యం. ప్రతి దానిని అబద్ధంగా కొట్టి పారేయడం మామూలుగా జరిగే విషయం అని మనకందరికీ ఎరుకే. అసలు పేలని తుపాకులిచ్చి ఎడారులు, మంచు కొండల్లో పహారా కానిస్తున్న అధికార, అనధికార గణాన్ని తప్పక బోనులో నిలబెట్టాల్సిన అవసరముంది. ఇంక దేశ పరువు మట్టి కలిసిపోతుంది అన్నది ఒట్టి భ్రమ మాత్రమే.. పోయింది బోఫోర్స్ తోనే పోయింది. కొత్తగా పోవడానికేముందింక…..
నిన్నగాక మొన్న అమెరికా యుద్ధ విమానం చెన్నై విమానాశ్రాయంలొ అనుమతి లేకుండా దిగడం,,ఏమైనా అంటే కేంద్రం అనుమతిచ్చిందన్న హాస్యాస్పద సమాధానం… మనింట్లో చొరబడ్డారురా అంటే పక్కింటోడికి చెప్పోచ్చేడులే అన్నట్టుగా వుంది…దిగే చోటవున్న వారికి తెలియచేయకపోవడం…వీళ్ళు కళ్ళు మూసుకున్నట్టు ఎటాక్ చేయకుండా ఊరుకోవడం చూస్తుంటే మన భద్రత చిరిగిన అంకెలా వుందనిపిస్తోంది…
ఎవరి భద్రత వారు చూసుకోవడం మినహా…

జూడాలకు మద్దతు తెలుపుదాం…

రాష్ట్రంలో గత నెలరోజులుగా కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె పట్ల ప్రభుత్వం రక రకాల వ్యాఖ్యానాలు చేస్తూ వైద్య విద్యార్థుల పట్ల ద్వేష భావాన్ని పెంపొందింప జేయడమే తప్ప వారి డిమాండ్ల పట్ల సముచిత వైఖరిని అవలంబించి సమస్య పరిష్కారానికి కృషి చేయకుండా మొన్నటికి మొన్న 108 సిబ్బంది సమ్మె చేస్తే RTC డ్రైవర్ల తో నడుపుతామన్నట్టుగా ఆసుపత్రులను కూడా ఇష్తమొచ్చిన వారితో నడిపి ప్రజల ప్రాణాల పట్ల చులకన భావం చూపుతోంది.

జూడా ల డిమాండ్లలో మొదటిది రూరల్ సర్వీసు పట్ల వ్యతిరేకత. దీనిని సాకుగా చూపి ఒక్కో వైద్య విద్యార్థికి పాతిక లక్షలు ఖర్చు పెడుతున్నట్టుగా చెబుతోంది పాలక వర్గం. కానీ ఇది నిజం కాదు. ప్రభుత్వాసుపత్రులలోని రోగులపైన, ఆసుపత్రుల నిర్వహణ ఖర్చును కలిపి వైద్య విద్యార్థి ఖర్చులో కలిపి చూపుతున్నారు. గ్రామీణ ఆసుపత్రులలో నేడు రిటైర్మెంటుకు దగ్గరగా వున్న వైద్యులు తప్ప మిగిలిన పోస్టులన్నీ అప్పుడే రిలీవైన విద్యార్థులతో నింపి గ్రామీణ ప్రజల ఆరోగ్యం పట్ల చులకన చూపు చూస్తున్నది ప్రభుత్వం. ఎక్కడ ఏ ఆసుపత్రులలోను గ్రామీణ పిహెచ్ సిలలో ఎవ్వరూ స్థానికంగా వుండి లేక శ్రద్ధతో వైద్యం చేస్తున్న వారే కరవయ్యారు. అప్పటికే ఓ ఆరేడేళ్ళు కాలేజీలలో చదువు ముగించుకొని వచ్చిన వార్ని బలవంతంగా వారికి ఇష్టంలేని ఉద్యోగం చేయమంటే శ్రద్ధ వుంటుందా? ఈ విధంగా రెగ్యులర్ ప్రభుత్వ వైద్య ఉద్యోగాలను తగ్గిస్తూ పోతున్నది. తద్వారా వైద్య రంగాన్ని సంక్షేమ రంగం నుండి తప్పించే యత్నంలో భాగంగా గుర్తించాల్సిన అవసరముంది.

అలాగే స్టైపెండు పెంచమనడంలోనూ వారి డిమాండ్ పట్ల సానుకూలంగా స్పందించడంలేదు. వెనకబడిన ఉత్తరప్రదేశ్ కంటే తక్కువగా చెల్లిస్తూ ప్రభుత్వ కాలేజీలలో చదువుకునే విద్యార్థులకు ఆర్నెల్లకోసారి నిధులు విడుదలచేస్తూ వారి చధువునకవసరమయ్యే వసతి సౌకర్యాల పట్ల శ్రద్ధ చూపకుండా వ్యవహరిస్తున్నారు. ఏ కళాశాలలోనూ గ్రంధాలయాలలో ఎప్పటివో పాత పుస్తకాలు తప్ప కొత్తగా వస్తున్న జర్నల్స్ కానీ వైద్య గ్రంధాలు కానీ లేని నిజం అందరికీ తెలిసినదే. ఒక్కో జర్నల్ సుమారు వెయ్యి రూపాయలు విలువగలవి ప్రతి నెలా కొనుక్కొని చదివే స్థోమత ఎంతమంది విద్యార్థులకు వుంటుంది. ప్రభుత్వ కళాశాలలలో చదివే విద్యార్థులలో అధిక శాతం మంది పేద మధ్యతరగతి బడుగు జీవుల పిల్లలే అయివుంటారన్నది నిజం కాదా..

వీళ్ళ సమ్మె జరిగే కాలంలో ఆసుపత్రులలో జరిగే సాధారణ మరణాలన్నీ లెక్కకట్టి వీళ్ళ ఖాతాలో జమచేయడం ఎంతవరకు సమంజసం?

ప్రతీ ఆర్నెల్లకోసారి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల జీతాలు, సౌకర్యాలు పెంచుకుంటున్న పాలక వర్గం నిజానికి వైద్య విద్య పట్ల ఎంత శాతం నిధులు ఖర్చు చేస్తున్నదో బహిరంగ పరచగలరా? విడుదలైన నిధులలో ఎంత శాతం కళాశాలల అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారు? ఎంత పెద్ద మొత్తంలో అధికారులు, రాజకీయ గణం బొక్కుతున్నారో బహిరంగంగా చెప్పగలరా?

ప్రజల డిమాండ్ల పట్ల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించే ముఖ్యమంత్రి మరో నీరో గా తన్ను తాను ఋజువు పరచుకోవడానికి తప్ప పాలన పట్ల శ్రద్ధలేదన్నది ప్రజలకు ఎరుకైనది. అలాగే వైద్యం పట్ల ఏమాత్రం అవగాహన లేని వారికి ఆ శాఖను అప్పగించి రౌడీలులా మాటాడిస్తున్నారు తప్ప సమస్యను సానుకూలంగా పరిష్కరించే కృషి జరగడంలేదు. ఈ విధంగా చేస్తూ చెంచా లాయర్లతో ప్రజా వ్యాజ్యాల ద్వారా కోర్తుల ద్వారా సమస్యను పక్కదారి పట్టించే యత్నం చేస్తూ నియంతలా వ్యవహరిస్తు వైద్య విద్యార్థులపట్ల ప్రజలలో ఏహ్యభావాన్ని తెచ్చే ప్రభుత్వ ధోరణిని ఖండిస్తూ జూ.డా.లకు మద్దతు తెలుపుదాం.

నీచ రాజకీయులు

పార్లమెంటరీ రాజకీయాలు ఎంత కుళ్ళు కంపుకొడుతున్నాయో అందరికీ అవగతమవుతోంది…

అసెంబ్లీ హాలులో బూతు బొమ్మలు చూస్తూ గడిపేవారు కొందరు…

జనం నెత్తురు తాగుతూ కోట్లరూపాయల సారా వ్యాపారం చేస్తూ పట్టుబడితే కులం పేరుతో తప్పుకోజూసే వాడొకడు…

శాఖల కోతలతో అగ్గిమీద గుగ్గిలమవుతాడొకడు…

బట్టీలకు బట్టీలు సారా వ్యాపారం చేస్తున్న వాడు అధినాయకుడై కూచుంటాడు పైన,

మోజు పడి మహిళను లోబర్చుకొని చంపిస్తాడొక మంత్రివర్యుడు….

వీళ్ళ డొక్కలు శుద్ధి జేయడానికే సరిపోతుంటే పరిపాలనెవడు జేస్తాడు…

వీళ్ళ అధికార ధాహం దన మదాంధకారాలతో జనం నెత్తిన కూచున్న ఈ రాజకీయ నీచులను పాతరెయ్యాలి….

పద్మ అవార్డులలో కూడా మన వాటా ఇంతేనా??

ఈ రోజు ప్రకటించిన 109 పద్మా అవార్డులలో మన రాష్ట్రానికి కేవలం రెండు మాత్రమే వచ్చాయి..ఇందులో ఓ సోషల్ వర్కర్ డా.జి.మునిరత్నం, బాడ్మింటన్ క్రీడాకారుడు సయ్యద్ మహమ్మద్ ఆరిఫ్ లకు
పద్మశ్రీలు దక్కాయి. మిగిలిన కేతగిరీలలో ఎక్కడా మనవాళ్ళు లేరు భారత రత్న ఈ ఏడాది లేదని తేల్చేసారు… సచిన్ కు వయసు కాస్తా ముదిరేంతవరకు ఆగుతారేమో..ఇంకెవరూ భారతరత్నలు
ప్రస్తుతానికి లేరు…మన వాళ్ళకు లాబీయింగ్ చేయడానికి సమయం లేదు ఈ విషయంలోననుకుంటా…వీళ్ళ పదవులు కాపాడుకోవడానికె కాల్మొక్త బాంచెన్ అంటూ ఢిల్లీ యాత్రలు చేస్తేనే సరిపోతుంది
కదా??
http://ibnlive.in.com/news/full-list-2012-padma-awards/224135-53.html

కొండ ఫలం

కొండ ఫలం
దళారి ఫలహారం….

వారి స్వచ్చతను
నిలువెల్లా గాయపరుస్తూ
సాగే వ్యాపారం…

ఇది ఏళ్ళుగా సాగుతున్న
శ్రమ దోపిడీవలయం…