మనిషి నోట్లోకి ఇంత ముద్ద దిగాలన్న
ఒకే ఒక్క ఆశతో
ఒంటిపై గుడ్డ కానరాకుండా
దప్పికగొన్న గొంతులో ఇన్ని నీళ్ళు కూడా
పోసుకోక ఎగసోప పడుతూ
ఉత్త చేతుల్తోనే ఆశగా లేని కరెంటు తీగల్ని
కలుపుతూ నేలమ్మ కడుపున నాలుగు
గింజలు పండించి నలుగురికీ
అన్నమై తాను తృప్తిగా తేన్చేందుకు
ఆరుగాలం నెత్తుటిని చెమటగా మార్చే
సత్తెకాలపు వాడు
నేడు
కన్నెఱ జేస్తూ తన నాగలి కఱును
గోడకు జారగిలబెట్టి పూన్చిన
ఎద్దులను కట్లు విప్పదీసి
బండి సీలలను ఊడబెరికి
నెత్తిన చుట్టిన తలపాగా విప్పదీసి
నడుముకు చుట్టి
బంద్ చేస్తున్నానింక
అని సమర శంఖారావం
పూన్చిన క్షణం
నువ్వూ నేనూ
మొఖం ఎక్కడ పెట్టుకుందాం??
సుఖమన్నది ఎరుగని
పిచ్చి నాగలి ఆకలిగా నేలపై
మోరజాపి జూస్తుంటే
ఆ నేలపై తిరుగాడే వాళ్ళకు
ఇంక మంచి జరుగుతుందా??
ప్రతిది తూనిక జేసి గాజు గోళాల మధ్య
జరిగే సత్తు వ్యాపార కూడళ్ళలో
నువ్వు ఆబగా నాకే విదేశీ పాచి వాసన
నీ ముక్కు రంధ్రాలకు సోకడం లేదంటే
శాపగ్రస్తుడెవ్వడో బోధపడలేదా??
చిరుగు పాతలే నీ మానాన్ని
కాపాడే ఎరగా నీ కళ్ళముందు తెరలు తెరలుగా
కదలాడుతుంటే నీవమ్మేసిన అమ్మతనం
ఇంక నీకు కానరాలేదంటే ధృతరాష్ట్రుడెవడో
ఎరుకపడలేదా???
బుడబుక్కల వారిలా వేషాలేస్తూ
రోజుకో నెరవేరని హామీల నేతి బీరకాయల్ని
గుప్పిస్తూ కుప్పిగంతులేస్తున్న వాడ్ని చూసి
వాడి ముఖాన ఖాండ్రించి ఉమ్మడానికి కూడా
అసహ్యమేస్తుందన్నది నిజం
ఇది పంటకు విరామం కాదు
జాతి ప్రగతికి విరామం..విలోమం….

